
దేశంలో 15వ రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యాయి. ఇది కరెంట్ టాపిక్ కావడంతో వచ్చే పోటీ పరీక్షల్లో రాష్ట్రపతి ఎన్నికలపైన ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. ఇప్పటివరకు ఎన్నికైన రాష్ట్రపతులు, వారి ప్రాధాన్యతలు, ఎన్నికల్లో పొందిన ఓట్ల శాతం గురించి తెలుసుకుందాం.
రాజేంద్రప్రసాద్(1950-62)
దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్. రెండుసార్లు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి. 1962లో భారతరత్న అవార్డు అందుకున్నారు. హిందూకోడ్ బిల్లును ఆమోదించకుండా మంత్రిమండలి పున: పరిశీలనకు పంపారు. సుప్రీంకోర్టు న్యాయసలహాను ఎక్కువసార్లు తీసుకున్న రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్. తన రెండు పర్యాయాల పదవీకాలంలో అత్యధిక ఆర్డినెన్సులు జారీ చేశారు. ఈయన రచించిన గ్రంథం‘ ఇండియా డివైడెడ్’.
సర్వేపల్లి రాధాకృష్ణన్(1962-67)
దేశంలో మొదటిసారి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. 1962లో చైనా యుద్ధం తర్వాత రక్షణ మంత్రి కృష్ణమీనన్‌ను కేంద్ర మంత్రి మండలి నుంచి తొలగించడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. 1954లో భారతరత్న అవార్డు అందుకున్నారు. ఈయన రచనలు ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్. ఆన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్.
జాకీర్ హుస్సేన్ (1967-1969)
దేశ తొలి ముస్లిం రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్. పదవిలో ఉండగా మరణించారు. అతి తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి. 1963లో భారతరత్నను స్వీకరించారు. జాకీర్ హుస్సేన్ హైదరాబాద్ లో జన్మించి ఉత్తర్‌ప్రదేశ్‌లో స్థిరపడ్డాడు.
వి.వి.గిరి (1969-1974)
1969లో జాకీర్ హుస్సేన్ మరణించడంతో ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్న వి.వి.గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత తాత్కాలిక రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓట్ల బదిలీ ద్వారా అతి తక్కువ మెజార్టీతో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఈయన కాలంలో బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు జరిగాయి. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రెండో రాష్ట్రపతి వి.వి.గిరి.
ఫకృద్దీన్ అలీ అహ్మద్(1974-77)
దేశ రెండో ముస్లిం రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్. పదవిలోఉండగా మరణించిన రెండో రాష్ట్రపతి. ఈశాన్య రాష్ట్రాల నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. 1975లో అంతరంగిక కారణాల వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
నీలం సంజీవరెడ్డి (1977-82)
ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి, ఏకైక రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి. చిన్న వయసులో(63 సంవత్సరాలు) రాష్ట్రపతి పదవిని చేపట్టారు. ముఖ్యమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి.
జ్ఞానీ జైల్‌సింగ్(1982-87)
దేశ తొలి సిక్కు రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్. వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన వ్యక్తి. స్వర్ణదేవాలయంపై చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ బ్లూ స్టార్ ఈయన కాలంలోనే జరిగింది. 1983లో ఢిల్లీలో జరిగిన అలీనోద్యమ సదస్సుకు అధ్యక్షత వహించారు. వివాదాస్పద పోస్టల్ బిల్లుపై పాకెట్ వీటో అధికారాన్ని వినియోగించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
ఆర్ వెంకట్రామన్(1987-92)
దేశంలో సంకీర్ణ కూటముల ప్రభుత్వాల ప్రమాణ స్వీకారానికి శ్రీకారం చుట్టారు. ఈయన తన పదవీకాలంలో అత్యధిక మంది ప్రధానులతో పదవీ ప్రమాణం చేయించారు. పార్లమెంట్ సభ్యుల జీతభత్యాల పెంపు బిల్లును మంత్రి మండలి పున:పరిశీలనకు పంపారు. ఈయన గ్రంథం మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్.
శంకర్‌దయాళ్ శర్మ(1992-97)
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల ప్రచార సమయాలను 21 రోజుల నుంచి 14 రోజులకు కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి మండలి పున:పరిశీలనకు పంపారు. వివాదాస్పదమైన దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ బిల్లుపై వీటో అధికారం వినియోగించారు.
కె.ఆర్.నారాయణన్(1997-2002)
దేశ తొలి దళిత రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్. బిహార్‌లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఎన్డీఏ ప్రభుత్వం చేసిన సిఫారసును వెనక్కి పంపించారు.
ఎ.పి.జె.అబ్దుల్‌కలాం(2002-07)
భారత క్షిపణి శాస్త్ర పితామహుడిగా ఎ.పి.జె.అబ్దుల్ కలాంను పేర్కొంటారు. 1997లో భారత రత్న అవార్డును స్వీకరించారు.2006లో లాభదాయక పదవుల బిల్లు విషయంలో సస్పెన్సివ్ వీటోను ఉపయోగించారు. సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి. ఈయన రచించిన గ్రంథం వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్.
ప్రతిభాపాటిల్ (2007-2012)
దేశ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్. ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లాను తొలగించాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ గోపాలస్వామి సిఫారసులను కేంద్ర ప్రభుత్వ సలహాను అనుసరించి తిరస్కరించారు. తన పదవీకాలంలో అత్యధిక దేశాల్లో పర్యటించిన రాష్ట్రపతిగా పేరుగాంచారు. సుఖోయ్ యుద్ధ విమానం, టీ–90 యుద్ధ ట్యాంక్‌లో ప్రయాణించిన తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్.
ప్రణబ్ ముఖర్జీ(2012-17)
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.2004 నుంచి 2012 వరకు అత్యధిక కాలం లోక్‌సభలో నాయకుడిగా వ్యవహరించారు. ఈయనకు 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, 2008లో పద్మవిభూషణ్, 2019లో భారతరత్న అవార్డును అందుకున్నారు. ఈయన రచించిన గ్రంథాలు ఆఫ్ ద ట్రాక్, ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్, ద కోలిషన్ ఇయర్స్, ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్.
రామ్‌నాథ్ కోవింద్(2017-2022)
దేశ రెండో దళిత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. బిహార్ గవర్నర్‌గా పనిచేశారు. బీజేపీ దళిత మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన స్పీచ్‌ల సంకలనం ద రిపబ్లికన్ ఎథిక్.
తాత్కాలిక రాష్ట్రపతులు
వి.వి.గిరి: 1963 మే నుంచి జూలై వరకు పనిచేశారు. జాకీర్ హుస్సేన్ మరణించడంతో ఉపరాష్ట్రపతిగా ఉన్న గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగారు.
జస్టిస్ హిదయతుల్లా: 1969 జూలై 20 నుంచి ఆగస్టు 24 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు. వి.వి.గిరి తాత్కాలిక రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినప్పుడు ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులు ఖాళీలుగా ఉండటంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ హిదయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.
బి.డి.జెట్టి: 1977 ఫిబ్రవరి నుంచి జూలై 25 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు. రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ మరణించినప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న బి.డి.జెట్టి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు.
గవర్నర్లైన తర్వాత రాష్ట్రపతులు: శంకర్‌దయాళ్ శర్మ, ప్రతిభా పాటిల్, రామ్‌నాథ్ కోవింద్
సీఎంలైన తర్వాత రాష్ట్రపతులు: నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్‌సింగ్, శంకర్‌దయాళ్ శర్మ
ఉపరాష్ట్రపతులైన తర్వాత రాష్ట్రపతులు: సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వి.వి.గిరి, ఆర్.వెంకట్రామన్, శంకర్‌దయాళ్‌శర్మ, కె.ఆర్.నారాయణన్