మీడియాపై ఆంక్షలు ఎందుకు? : చిల్ల మల్లేశం

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో  మీడియాపై ఆరేడు నెలలుగా అప్రకటిత ఆంక్షలు అమలవుతున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నెలనెలా జరిగే కౌన్సిల్​ మీటింగులకు, కొన్ని జిల్లాల్లో జడ్పీ మీటింగులకు, ప్రజావాణి, పోలీస్​గ్రీవెన్స్, మంత్రులు, ఆఫీసర్ల రివ్యూ మీటింగులకు జర్నలిస్టులను అనుమతించడం లేదు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ గురించి, బంగారు తెలంగాణ దిశగా మీడియా పోషించాల్సిన పాత్ర గురించి ఇటీవల తరచూ మాట్లాడుతున్న మున్సిపల్​మంత్రి కేటీఆర్​ ఆదేశాల మేరకే జిల్లా ఆఫీసర్లు మీడియాను అడ్డుకుంటున్నారనేది ఇక్కడ ఆసక్తికరం. ఆ మధ్య కరీంనగర్​ కార్పొరేషన్​ మీటింగ్​లో టీఆర్ఎస్​మహిళా కార్పొరేటర్​ తన వార్డులోని వాటర్ ​సమస్యపై కార్పొరేషన్​లో​ నిలదీసింది. నిండు సభలో నెత్తిన బిందె, చేతిలో బకెట్​తో ఆమె నిరసన తెలపడంతో సహజంగానే చానళ్లలో, మరుసటి రోజు పత్రికల్లో ప్రముఖ వార్తగా వచ్చింది. ఇదే మంత్రి ఆగ్రహానికి కారణమైంది. తమ పార్టీకే చెందిన ఓ కార్పొరేటర్, అదీ మిషన్​ భగీరథ లాంటి ప్రతిష్టాత్మక స్కీములో లోపాలపై ప్రభుత్వాన్ని నిలదీయడం, ఆ వార్తకు పలు పత్రికలు మొదటి పేజీల్లో చోటివ్వడంతో ఆగ్రహించిన మున్సిపల్​ మంత్రి.. జిల్లా జర్నలిస్టులపై బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. రాష్ట్రంలో ఉన్న144 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగే ఏ కౌన్సిల్​మీటింగుకూ మీడియాను అనుమతించవద్దంటూ ఈ ఏడాది మే13న ఓ ఆర్డర్​ పాస్ ​చేశారు. సమావేశం ముగిశాక ఆఫీసర్లే  మీడియాకు బ్రీఫ్ ఇస్తే చాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఆ నాటి నుంచి చిన్నసారు ఆదేశాలను కమిషనర్లు, మేయర్లు, మున్సిపల్ ​చైర్​పర్సన్లు తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. 

తప్పు చేస్తే చెండాడమని.. మరోవైపు ఆంక్షలు

ఇదే మంత్రి కేటీఆర్​నవంబర్​12న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ‘‘తెలంగాణలో మీడియా.. గతం–వర్తమానం–భవిష్యత్తు” అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడారు. రాష్ట్రంలోని మీడియాకు చాలా అంశాలను ప్రస్తావించే దమ్ము లేదని నిష్టూరమాడారు. ‘మేము తప్పు చేస్తే చీల్చి చెండాడండి.. కానీ మంచిని కూడా చూపించండి.. ’ అంటూ సలహా ఇచ్చారు. మీడియా స్వేచ్ఛ గురించి, అది నిర్వహించాల్సిన పాత్ర గురించి రెండు ముక్కల్లో గొప్పగా చెప్పిన మంత్రే కౌన్సిల్​ మీటింగులకు మీడియాను అనుమతించవద్దని ఆర్డర్స్​ఇవ్వడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న కాలంలో మున్సిపల్​, జడ్పీ మీటింగులకు రాకుండా జర్నలిస్టులను అడ్డుకోవడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో అత్యధిక మెజారిటీ ఉన్న రూలింగ్​ పార్టీ ఎలాగూ ప్రతిపక్షాల గొంతునొక్కుతూనే ఉంది. అడపాదడపా జరుగుతున్న సెషన్స్​లలో బంగారు తెలంగాణ అభివృద్ధి గురించి బాతాఖానీ కొట్టడానికే  ప్రభుత్వ పెద్దలు పరిమితమవుతున్నారు. తమ నియోజకవర్గాల్లో సమస్యలు, పెండింగ్​పనుల గురించి చెప్పుకునే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఎలాగూ లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు చాన్స్​ దొరకట్లేదు. కానీ లోకల్​ బాడీల్లో అలా కాదు. కౌన్సిల్, జడ్పీ మీటింగుల్లో రూలింగ్​ పార్టీ, అపోజిషన్​అనే తేడా లేకుండా సభ్యులు.. జనం ఎదుర్కొనే సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా తాగు, సాగు నీరు, కరెంట్ కష్టాలపై, బడులు, ఆసుపత్రులు, రోడ్ల దుస్థితిపై ఆఫీసర్లను నిలదీస్తున్నారు. కొన్నిసార్లు ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా ఓ ఆట ఆడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న మిషన్​ భగీరథ, ధరణి, దళిత బంధు తదితర స్కీముల్లోని లోపాలను ఇటీవల సొంత పార్టీ సభ్యులే మీటింగుల్లో ఎండగడ్తున్నారు. పోడు భూములకు పట్టాలు, సాదాబైనామాలు, సర్కారు జాగల్లోని ఇండ్ల రెగ్యులరైజేషన్​ లాంటి అంశాలను పెండింగ్​లో పెట్టడం వల్ల తాము జనాల్లో తిరగలేకపోతున్నామని ఓపెన్​గా చెప్తున్నారు. ఇది ప్రభుత్వానికి ఎంతమాత్రం నచ్చడం లేదు.

అసలు విషయాలు బయటకు రాక..

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నెలనెలా జరిగే కౌన్సిల్ జనరల్​బాడీ మీటింగులకు మీడియా రాకుండా గేట్లు మూసేస్తున్నారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు చెందిన జర్నలిస్టులు, ఫొటో, వీడియోగ్రాఫర్లెవరినీ మీటింగ్ హాళ్లలోకి అనుమతిస్తలేరు. ప్రభుత్వ స్కీములు, అభివృద్ధి పనుల్లో లోపాలు, అవకతవకలపై, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాలపై లోపల జరిగే వాదోపవాదాలను బయటకు రానివ్వడం లేదు. అధికార, ప్రతిపక్ష సభ్యులు గల్లాలు పట్టుకుంటున్నా తెలియనివ్వట్లేదు. కేవలం సర్కారుకు అనుకూలంగా వివిధ డిపార్ట్​మెంట్ల పై జరిగే చర్చను ప్రోగ్రెస్ రిపోర్ట్​లాగా మీడియాకు బ్రీఫ్​ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పనిలో పనిగా తమ నిర్వాకాలు కూడా నాలుగు గోడల మధ్యే సమాధి అవుతుండటంతో అటు ప్రజాప్రతినిధులు, ఇటు ఆఫీసర్లు కూడా సంతోషంగా ఉన్నారు. వీళ్లను చూసి కొన్ని జిల్లాల్లో జడ్పీ మీటింగులకు కూడా మీడియా ప్రతినిధులను రానిస్తలేరు. ప్రజావాణి, పోలీస్​గ్రీవెన్స్, ఆఫీసర్లు, మంత్రులు నిర్వహించే రివ్యూ మీటింగులకు సైతం అలో చేస్తలేరు.

లోపాలను కప్పి పుచ్చితే నష్టం

ధరణి అమల్లోకి వస్తే భూ సమస్యలు అనేవే ఉండవని సీఎం కేసీఆర్​ చెప్పినా, ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించే ప్రజావాణికి ల్యాండ్ ​ఇష్యూస్​ పైనే కుప్పలు తెప్పలుగా అర్జీలు వస్తున్నాయి. భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జనం కలెక్టరేట్లలోనే ఆత్మహత్యాయత్నాలకు సైతం పాల్పడుతున్నారు. ఇవన్నీ పత్రికలు, చానళ్ల ద్వారా వెలుగు చూస్తుండటం సర్కారుకు ఇబ్బందిగా మారింది. అందుకే మీడియాను మీటింగులకు, గ్రీవెన్స్​లకు రాకుండా ఓ కుట్ర ప్రకారం అడ్డుకుంటున్నారు. ఇలా అడ్డుకోవడం ముమ్మాటికీ జర్నలిస్టుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. మీటింగుల్లో సొంత పార్టీ సభ్యులు లేవనెత్తే సమస్యలను రాస్తేనే తట్టుకోలేని మంత్రి ‘తప్పు చేస్తే చీల్చి చెండాడండి’ అని మీడియాకు సుద్దులు చెప్పడం తనకు మానిన నీతే తప్ప మరొకటి కాదు. అదీగాక లక్షలకు లక్షలు పెట్టి నిర్వహిస్తున్న లోకల్​బాడీ మీటింగుల్లో చర్చలు అర్థవంతంగా సాగుతున్నాయో, లేదో తెలుసుకునే హక్కు పౌరులకు ఉంటుంది. తాము వేసిన ఓట్లతో పదవులు అనుభవిస్తున్న ప్రజా ప్రతినిధులు.. మీటింగుల్లో తమ సమస్యలు లేవనెత్తుతున్నారో, కుర్చీల్లో కునుకు తీస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలి కదా! మీటింగ్​ముగిశాక ఆఫీసర్లు బ్రీఫ్​ ఇవ్వడానికి లోపల సభ్యులు చర్చించేది దేశరహస్యాలేమీ కాదు, ప్రజాసమస్యలు! మీడియాకు తెలియకుండా పాలనాపరమైన లోపాలను దాచడం అంటే డాక్టర్ల​ దగ్గర రోగాలను దాయడం లాంటిదే! రోగాలను దాస్తే ప్రాణాలు పోయినట్టే, లోపాలను కప్పిపుచ్చుకుంటే పీడన పెరిగి, పీఠాలు కూలుతాయి. తెలంగాణ తెచ్చుకున్నదే స్వేచ్ఛ కోసం! ఆ స్వేచ్ఛా పోరాటంలో జర్నలిస్టులు ముఖ్య పాత్రధారులు! జర్నలిస్టులకే స్వేచ్ఛ లేకపోతే తెచ్చుకున్న తెలంగాణకు అర్థమే లేదు. పాలకులు ఈ విషయం గుర్తుంచుకొని ఇకనైనా మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తే మంచిది.

- చిల్ల మల్లేశం, సీనియర్​ జర్నలిస్ట్