బెంగళూరు AI టెక్కీ సూసైడ్ నోట్.. న్యాయ వ్యవస్థపై రాష్ట్రపతికి రాసిన లేఖలో ఏముంది..?

భార్య నికితా సింఘానియా కిరాతకమైన వేధింపులు తాళలేక టెక్కీ అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అతుల్‌ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు 24 పేజీల సూసైడ్ లేఖ, 40 నిమిషాల వీడియో తీసి ప్రాణాలు తీసుకున్నారు. ఆ 24 పేజీల లేఖలో అతను భారత న్యాయ వ్యవస్థపై పలు వ్యాఖ్యలు చేస్తూ.. ఆ లేఖను రాష్ట్రపతికి అందించాలని కోరాడు.

చట్టాల లొసుగులో భార్యలు.. భర్తలపై తప్పుడు కేసులు పెట్టడం పెరుగుతున్న ధోరణిని అతుల్‌ సుభాష్‌ ఎత్తిచూపారు. తన ఘటనలో భార్య నికితా సింఘానియా, ఆమె కుటుంబం దాఖలు చేసిన అనేక కేసుల ద్వారా తనను ఎంతలా వేధించారో అతను వివరించారు. అసహజ శృంగారం, హత్యాయత్నం, వేధింపులు, గృహ హింస, వరకట్నం వంటి తొమ్మిది కేసులు తనపై పెట్టినట్లు అతుల్‌ లేఖలో పేర్కొన్నారు. జౌన్‌పూర్‌లోని ఫ్యామిలీ కోర్టు జడ్జి కూడా తన మాట వినలేదని ఆరోపించారు. అవినీతికి పాల్పడే న్యాయమూర్తులు, కోర్టు అధికారులపై ప్రతీకార చర్యలకు భయపడకుండా ఫిర్యాదు చేసే మార్గం కూడా ఉండాలన్నారు.

ALSO READ | ఎవరీ నికితా సింఘానియా..? ట్రెండింగ్‌లో యాక్సెంచర్ ఐటీ కంపెనీ.. !

"ఈ రోజుల్లో జీవించి ఉన్నవారు కోర్టులకు, న్యాయవ్యవస్థ తీర్పులకు వ్యతిరేకంగా మాట్లాడటం అసాధ్యం. చనిపోయిన వ్యక్తే వాటి గురించి మాట్లాడాలి"

"భారత న్యాయవ్యవస్థ తన అన్ని పరిమితులను అధిగమించింది. ఎటువంటి జవాబుదారీతనం లేకుండా ప్రతి సంస్థ యొక్క అధికారాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. భారతదేశం న్యాయ నియంతృత్వంలో ఉన్న మొదటి దేశంగా మారవచ్చు.."

"రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ.. ప్రజాస్వామ్యంలో నిష్పాక్షిక న్యాయ ప్రాముఖ్యతను అర్థం చేసుకునే ఉదార మనస్సు మీకు ఉందని భావిస్తున్నా.. దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీం కోర్టు కంటే మీకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి. మీరు పార్లమెంటుతో సహకరిస్తే న్యాయ వ్యవస్థలో మార్పులు చేయగల అధికారాలు కలిగి ఉన్నారు.." అని అతుల్‌ సుభాష్‌.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన మూడు పేజీల లేఖలో పేర్కొన్నారు.

ఈ ఘటనలో బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ కుటుంబం.. అతని భార్య నికితా సింఘానియా, ఆమె కుటుంబ సభ్యులు,  న్యాయమూర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.