నిధులు రిలీజైతేనే నీళ్లు వచ్చేది .. ఇదీ చనాఖా-కోర్టా ప్రాజెక్టు పరిస్థితి

నిధులు రిలీజైతేనే నీళ్లు వచ్చేది .. ఇదీ చనాఖా-కోర్టా ప్రాజెక్టు పరిస్థితి
  • –గత బడ్జెట్​లో కేటాయించిన రూ. 72 కోట్లు ఇంకా రిలీజ్ కాలే
  • తాజాగా రూ. 179 కోట్లు కేటాయింపు
  • 1800 ఎకరాల భూసేకరణ ముందర పడట్లే
  • నిధులు లేక ఆగిన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు

ఆదిలాబాద్, వెలుగు :  తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని లోయర్​ పెన్ గంగా నదిపై నిర్మిస్తున్న చనాఖా–కోర్టా ప్రాజెక్టు పనులు పదేండ్లుగా కొసాగుతూనే ఉన్నాయి. గత బీఆర్ఎస్  ప్రభుత్వం 2015లో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ఇప్పటికీ చుక్క నీరందడం లేదు. నిధులు కేటాయించడంతో పాటు వెంటనే రిలీజ్ చేస్తేనే కాలువలు, డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. 

ఇందులో చనాఖా కోర్టా ప్రాజెక్టును సైతం తీసుకుంది. ఇటీవల బడ్జెట్​లో రూ. 179 కోట్లు కేటాయించింది. దీంతో ప్రాజెక్టు పనులు ముందుకెళ్తాయని రైతులు పేర్కొంటున్నారు. గత బడ్జెట్​లోనూ ప్రభుత్వం రూ.72 కోట్లు కేటాయించింది. వాటిని ఇప్పటి వరకు ఖర్చు చేయకపోవడంతో మార్చి 31 తరువాత వెనక్కి వెళ్లే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.  ఒకవేళ గత బడ్జెట్  నిధులతో పాటు ఈ బడ్జెట్​లో కేటాయించిన నిధులను రిలీజ్  చేస్తే పనులు వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. 

పదేండ్లుగా సాగుతోంది..

పెన్ గంగా నదిపై తెలంగాణ, మహారాష్ట్రను కలుపుతూ చనఖా–కోర్టా ప్రాజెక్టు నిర్మాణానికి 2015లో పరిపాలన అనుమతి లభించింది. పంప్​హౌజ్, రిజర్వాయర్, డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ముందుగా రూ.386 కోట్ల అంచనాతో చేపట్టగా, ఫండ్స్ సరిపోవడం లేదంటూ రూ.1,227 కోట్లకు పెంచారు. అయినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. ప్రస్తుతం రూ.2 వేల కోట్లకు అంచనాలు పెంచినప్పటికీ, నిధులు విడుదల చేయకపోవడంతో సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. 2018లోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉండగా నిధుల కొరతతో పదేండ్లుగా గడువు పెంచుతూ వస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే తాంసి, భీంపూర్, ఆదిలాబాద్, బేల మండలాల్లోని 51 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. 

నిధులు లేక భూసేకరణలోనూ జాప్యం..

చనాఖా–కోర్టా ప్రాజెక్టు పూర్తి కావడానికి ప్రధానంగా భూసేకరణ అడ్డంకిగా మారింది. భూసేకరణ కోసం నిధులు విడుదల చేయకపోవడంతో కాల్వలు, డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఏండ్ల తరబడి పనులు పెండింగ్ లో ఉంటున్నాయి. డి14 నుంచి డి19 వరకు డిస్ట్రిబ్యూటర్లు, కాల్వల నిర్మాణానికి 1,800 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటరీ, దాని కింద మైనర్స్, సబ్  మైనర్స్  నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి హత్తిఘాట్  పంప్ హౌజ్  వద్ద గతంలోనే డ్రై రన్, వెట్  రన్ నిర్వహించారు. 

ఇందులో భాగంగా కెనాల్స్​లోకి నీళ్లు ఎత్తిపోయడం, ప్రాజెక్టు 23 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూటరీ, సబ్ మైనర్స్, మైనర్స్  పనులు పెండింగ్ లో ఉండడంతో నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది.  గత బడ్జెట్​లో కేటాయించిన రూ.72 కోట్లు విడుదల చేస్తే.. భూసేకరణ, కాల్వల పనులు కొంత మేరకు పూర్తి చేసి 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. 

నిధులు విడుదల కాగానే భూసేకరణ చేపడతాం

ప్రభుత్వం బడ్జెట్​లో చనాఖా–కోర్టా ప్రాజెక్టుకు రూ.179 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్​లో కేటాయించిన రూ.72 కోట్లు కలెక్టర్  అకౌంట్​లో ఉన్నాయి. ఈ నిధులు విడుదల చేస్తే భూసేకరణ చేపట్టి పనులు ప్రారంభిస్తాం. 1,800 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. నిధులు విడుదల చేస్తే ఈ ఏడాది సాగునీటిని అందిస్తాం.

రవీందర్, ఈఈ ఇరిగేషన్