- సంఘాల ఎన్నికలపై స్పష్టత లేదు
- మరో ఆరు నెలల గడువు పెంచే అవకాశం
- ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న ఆశవాహులు
నల్గొండ, యాదాద్రి, వెలుగు : వరుస ఎన్నికల జాబితాలో పీఏసీఎస్‌లు కూడా చేరనున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే వీటి ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గం పదవీకాలం ఈనెల 15న ముగుస్తోంది. ఈ ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అన్న సందిగ్ధం నెలకొంది.
ఉమ్మడి జిల్లాలో 107 పీఏసీఎస్‌లు..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం107 ప్రాథమిక వ్యవసాయ సంఘాలు (పీఏసీఎస్) ఉన్నాయి. సూర్యాపేటలో 44, నల్గొండలో 42, యాదాద్రి జిల్లాలో 21 ఉన్నాయి. 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగిన ఈ సంఘాల పాలక వర్గాలతోపాటు డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ఈనెల 15న పదవీకాలం ముగుస్తోంది. దీంతో ఇప్పటికే పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలపై ఆసక్తిగా చూస్తున్న రాజకీయ పార్టీలు పీఏసీఎస్‌ల వైపు కూడా చూస్తున్నాయి.
కన్పించని హడావుడి..
పాలకవర్గం గడువు దగ్గరకు వచ్చినా రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్నుంచి ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. సంఘాల్లోనూ ఎన్నికల హడావుడి కన్పించడం లేదు. దీంతో ఎన్నికలు నిర్వహిస్తారా..? లేకుంటే పర్సన్ఇన్చార్జీలను నియమిస్తారా..? లేనిపక్షంలో పాలకవర్గం పదవీ కాలం పొడిగిస్తారా..? అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే పాలకవర్గం పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాన్ని కొట్టి పారేయలేమని, ఆరు నెలలపాటు గడువు పొడిగించే అవకాశాలున్నాయని సహకార వర్గాలుచెబుతున్నాయి.
కొత్తగా మరికొన్ని పీఏసీఎస్ లు..
ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్ లకు తోడుగా కొత్తగా సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సహకార శాఖ కమిషన్రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నూతనంగా ఏర్పాటు చేసే పీఏసీఎస్ ల ప్రతిపాదనలు తెప్పించుకుంది. నల్లగొండ జిల్లాలో 42 పీఏసీఎస్‌లు, సూర్యాపేట జిల్లాలో 44 ఉన్నాయి.
ఈ రెండు జిల్లాల్లో మరో 16 ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. యాదాద్రి జిల్లాలో ప్రస్తుతం 21 ఉండగా, మరో 10 పెంచాలని ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ఏ జిల్లాకు ఎన్ని పీఏస్ఎస్లను పెంచాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.