ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఖరారుకాని కాల్పుల విరమణ ఒప్పందం

  • పీస్ డీల్ కుదరలే 
  • చివరి నిమిషంలో అభ్యంతరం తలెత్తినట్టు నెతన్యాహు ప్రకటన
  • గాజాపై మళ్లీ దాడి.. 72 మంది మృతి 

టెల్ అవీవ్: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా కుదరలేదు. ఈ డీల్ ఇంకా ఫైనల్ కాలేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్  నెతన్యాహు గురువారం తెలిపారు. చివరి నిమిషంలో తలెత్తిన సంక్షోభంతో డీల్ కు కేబినెట్ ఆమోదం తెలపలేదని, హోల్డ్ లో పెట్టామని ప్రకటించారు. ‘‘డీల్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి.  హమాస్ దిగి వస్తేనే డీల్ కు ఆమోదం తెలుపుతం. మరిన్ని సడలింపులకు హమాస్ ప్రయత్నిస్తున్నది. అందుకే  ఒప్పందంలో కొన్ని అంశాలను ఉపసంహరించుకుంది” అని చెప్పారు. అయితే అవి ఏంటనేది మాత్రం వివరించలేదు. 

మరోవైపు డీల్ కు తాము అంగీకరిస్తున్నామని హమాస్ ప్రకటించింది. కాగా, ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందం కుదిరిందని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ బుధవారం రాత్రి ప్రకటించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన ఖతార్ కూడా డీల్  కుదిరిందని ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. ఇంతటితో యుద్ధం ముగిసిపోతుందని, గాజాలో శాంతి నెలకొంటుందని, బందీలు విడుదలవుతారని అంతా భావించారు. కానీ ఆ ఒప్పందానికి తాము ఇంకా ఆమోదం తెలపలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించడంతో మళ్లీ ఆందోళన మొదలైంది. 

ఇదీ ఒప్పందం.. 

కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి  మూడు దశల్లో ఆరు వారాలపాటు అమలవ్వాల్సి ఉంది. ఈ టైమ్ లో 33 మంది బందీలను హమాస్ విడిచిపెట్టాలి. పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టాలి. సెకండ్ ఫేజ్ లో మిగతా బందీలను హమాస్, మిగతా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టాలి. గాజాలోని ఇజ్రాయెల్ బలగాలన్నీ తిరిగి వెళ్లాలి. ఫైనల్ ఫేజ్ లో  బందీల డెడ్ బాడీలను హమాస్ అప్పగించాలి. గాజా పునరుద్ధరణకు పనులు ప్రారంభించాలి.

గాజాపై బాంబుల వర్షం.. 

పాలస్తీనాపై ఇజ్రాయెల్ మళ్లీ బాంబుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించడానికి ముందు రెండు దేశాల ఆర్మీ బలగాలు పరస్పర దాడులకు దిగాయి. ఈ క్రమంలో గాజాకు తీవ్ర నష్టం వాటిల్లింది. ‘‘కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. బుధవారం రాత్రి నుంచి బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 72 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది” అని గాజా హెల్త్ మినిస్ట్రీ గురువారం తెలిపింది.