
గుర్గావ్ లో దారుణం చోటు చేసుకుంది.. ఆడజాతి సిగ్గుతో తలదించుకునే ఘటన ఇది.. సభ్య సమాజం సైతం సిగ్గుపడే ఘటన. హాస్పిటల్లో వెంటిలేటర్ పై ఉన్న ఓ మహిళ మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. కళ్ళముందు ఇంత దారుణం జరుగుతుంటే అడ్డుకోవాల్సింది పోయి.. చూస్తూ ఉండిపోయారు అక్కడే ఉన్న నర్సులు. స్పృహలో లేని పేషేంట్ పై లైంగిక దాడి చేయడమే దారుణం అనుకుంటే.. అక్కడున్న నర్సులు డాళ్లు అయ్యుండి.. ఆపకపోవడం ఇంకా దారుణమని చెప్పాలి. గుర్గావ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఏప్రిల్ 6న జరిగింది ఈ దారుణం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..
46 ఏళ్ళ ఎయిర్ హోస్టెస్.. కంపెనీ ట్రైనింగ్ కోసమని ఓ స్టార్ హోటల్లో బస చేయగా.. అక్కడి స్విమ్మింగ్ పూల్ లో దిగి అస్వస్థతకు గురైంది.. దీంతో ఆమెను సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్లో చేరే సమయానికి ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను వెంటిలేటర్ పై ఉంచారు వైద్యులు. చికిత్స అందించిన తర్వాత ఏప్రిల్ 13న ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.
ఈ క్రమంలో తాను వెంటిలేటర్ పై ఉన్నప్పుడు హాస్పిటల్ సిబ్బంది తనపై లైంగికి దాడికి పాల్పడ్డారని.. ఆ సమయంలో తాను స్పందించలేని స్థితిలో ఉండిపోయానాని తెలిపింది మహిళ. అక్కడే ఉన్న నర్సులు చూస్తూ ఉండిపోయారని తెలిపింది. ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో హాస్పిటల్ యాజమాన్యం నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాకపోవడం గమనార్హం.