వ్యవస్థ ఎందుకు మునుం తప్పుతోంది?

వ్యవస్థ ఎందుకు మునుం తప్పుతోంది?

వరుస హత్యలు, అత్యాచారాలు తెలంగాణలో పెచ్చుమీరుతున్నాయి. టెక్నాలజీ పరంగా పోలీసింగ్​ ఆధునీకరణలో దేశంలోనే టాప్​లో ఉన్నామంటున్న పోలీసులు, సర్కారు.. సమాజంలో నేరాలను పసిగట్టడంలో, ముందస్తు నివారణలో విఫలమయ్యాయి. సాంకేతికతపైనే ఆధారపడటం పెరిగి, పోలీసుల్లో వృత్తి నైపుణ్యం కుంటుపడుతోంది. పరువు హత్యలు, సుపారీ గ్యాంగులు, పట్ట పగలే హత్యాకాండలు, అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నీట తేలే మంచు గడ్డ కొసలా.. నమోదయ్యే, బయటకు తెలిసొచ్చే అఘాయిత్యాలు, అణచివేతలు, వేధింపులు కొన్నే! వెలుగు చూడనివి ఎన్నో! నియంత్రణే లేని మోసాల యాప్​లు, అశ్లీల సైట్లు సమాజంలో వివాహేతర సంబంధాలను, హింసోన్మాదాలను ప్రేరిపిస్తున్నాయి. నేరస్తుల్లో చట్టం పట్ల భీతి, గౌరవం సన్నగిల్లినట్టే భద్రతపట్ల పౌరుల్లో భరోసా తగ్గి వ్యవస్థ మునుం తప్పుతోంది.

చట్టమన్నా, పోలీసులన్నా పౌరుల్లో భయం-–భక్తి లోపించినపుడు హింస పేట్రేగుతుంది. నేరాలకు అడ్డూ-, అదుపూ ఉండదు. కనిపించని.. దౌర్జన్యాలూ, అధికార బలుపు తాలూకు అరాచకాలూ  హద్దులు మీరుతాయి. బెదిరింపులు, బ్లాక్​మెయిళ్లు, పగతీర్చుకోవడాలు సాధారణమవుతాయి. కొంత కాలంగా తెలంగాణలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడులు, దాష్టీకాలు అందరినీ కలచివేస్తున్నాయి. పలుకుబడి ఉన్న పెద్దల బెదిరింపు–-దౌర్జ్యన్యాలతో జరిగే ఆత్మహత్యలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. తమ చావుకు ఫలానా మంత్రో, ఎమ్మెల్యేనో, అధికారో కారణమని చెప్పి మరీ కుటుంబాలకు కుటుంబాలే బలవన్మరణాలకు పాల్పడుతుంటే సర్కారు, సమాజం చోద్యం చూస్తున్న దురవస్థ!  పట్టపగలు నడిరోడ్ల మీద యథేచ్ఛగా హత్యలకు ఆగంతకులు వెనుకాడటం లేదు. ఒక్కో కేసు దర్యాప్తు చేస్తుంటే, కిరాయి హంతక ముఠాల వ్యవహారం బయటకొస్తోంది. వివాహేతర సంబంధాలు వెలుగు చూస్తున్నాయి. రక్తసంబంధీకులే కిరాతక హంతకులుగా తేలుతున్నారు. పరువు హత్యలు కంటతడి పెట్టిస్తున్నాయి.  ప్రతి మిస్సింగ్ కేసు, ఏ దురవస్థ, దుర్మరణంతో ముగింపు పలుకుతుందో అర్థం కాని ఆందోళన! నీళ్లలో కుళ్లిన, ముఖం కాలిన, తల నుజ్జైన, మొండెమే మిగిలిన ఒక్కో శవం ఒక్కో కథ చెబుతోంది. సీసీ కెమెరాల నిఘా నిరంతరం కాపలా కాస్తున్నా, దొరికి తీరతామని తెలిశాక కూడా..  నేరగాళ్లు ఇంతటి తెగింపునకు తలపడటమే ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసులు, కేసులు, దర్యాప్తులు, న్యాయస్థానాలు, శిక్షలు అన్న భయమే వారికి లేకుండా పోతోంది! ఈ దుస్థితిని ఇలాగే అనుమతిస్తే.. మున్ముందు శాంతిభద్రతల పరిస్థితి మరింత గందరగోళంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 

సంపద పైకి, ప్రాణం విలువ కిందకి

విలువ అమాంతం పెరిగిన భూమి, స్థిర–చరాస్తులు, ఇతర ఆర్థిక లావేదేవీలే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ హత్యల వెనుక ముఖ్య కారణం. రాజకీయ ప్రత్యర్థుల నిర్మూలన ఒక అంశమే! భూ, -ఆస్తి తగాదాలు.. అయితే కుటుంబ సభ్యులు, బంధువుల మధ్యో, ఇతరులతోనో తలెత్తుతున్నాయి. ఇసుక వంటి సహజ ప్రకృతి వనరుల్ని కొల్లగొడుతున్న హిరణ్యాక్షులు, ‘ఇదేమిట’ని నిలదీసే వారిని వాహనాలతో ఢీకొట్టి హతమారుస్తున్నారు. వివాహేతర సంబంధాలు కూడా హత్యలు, దాడులు, ఆత్మహత్యలకు మరో బలమైన కారణమవుతున్నాయి. 

పోలిసింగ్​ పనితీరు మారాలె..

మన పోలీసులు ఇటీవలి కాలంలో శాస్త్ర-సాంకేతికతపై ఎక్కువ ఆధారపడుతున్నారు. అదేం తప్పు కాదు, కానీ, అదే పరిష్కారం అనుకోవడం తప్పే! నేర నియంత్రణకు చేపట్టాల్సిన అనేక సంప్రదాయిక, మేధోనైపుణ్య, నిఘా-నియంత్రణ పరమైన అంశాలకు తగిన ప్రాధాన్యతనిస్తున్నట్టు లేదు. నేరాల అదుపు ప్రక్రియ సరిగా సాగటం లేదు. సీసీ కెమెరాలతో నేరస్తుల కదలికలు– జరిగిన తీరు నిర్ధారించుకోవడం, సెల్ టవర్స్ ద్వారా నిందితులు దాగిన తావుల్ని గుర్తించడం.. ఇలా నేర దర్యాప్తుల్లో, శాస్త్ర సాంకేతికత వినియోగం బాగుంది. కానీ, దానికి కొన్ని పరిమితులున్నాయి. కెమెరా వ్యూలోనో, కాల్ డాటా కొనసాగింపులోనో, టవర్ సిగ్నల్లోనో అంతరం వచ్చినపుడు ఇక దర్యాప్తు అక్కడితో ఆగిపోతోంది. అలా వదిలేసిన కేసులు ఎన్నో! ఆ మిషతో నేరస్తుల పట్ల సుకుమారంగా ఉండటం, వృత్తి నైపుణ్యాలు చూపకపోవడంతో నేరాల ముందస్తు నివారణ సాధ్యపడటం లేదు. చాలా సందర్భాల్లో నేరాల ఆచూకి, ఇతర నేరాల దర్యాప్తుల్లో యాదృచ్ఛికంగా బయటపడుతోంది. పాలకపక్షానికి ఊడిగం చేయడం, వారి అభీష్టం మేరకు విపక్షాలను కట్టడి చేయడం అనే పరిమిత పాత్రనే పోలీసులు పోషిస్తున్నారన్న విమర్శ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. పోలీసులు పక్షపాతంగా ఉన్నపుడు.. నైతికంగా శక్తిమంతులై ఉండరు. వృత్తిపరంగా నైపుణ్యం కొరవడుతుంది. నిర్వహణ సామర్థ్యలోపం సహజం. అన్ని విధాలా బలహీనంగా ఉంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా రూఢీ అయిన సత్యం. మన దర్యాప్తు–న్యాయ ప్రక్రియలోనూ లోపాలున్నాయి. సీఆర్పీసీలోని సెక్షన్ 41(ఎ) సవరణ ద్వారా ఎన్నదగిన నేరాల్లోనూ మెజిస్ట్రేట్ దాకా వెళ్లనవసరం లేకుండా, స్టేషన్ స్థాయిలోనే  బెయిల్ ఇవ్వటం కూడా వారిలో తేలిక భావం కలిగిస్తోంది. హత్య వంటి నేరాల్లో సాక్ష్యాలు నిలిచి, నేరాలు నిరూపణ కాకపోవడం, తేలికగా బెయిల్ లభించడం వంటి పరిణామాలు.. నేరానికి తలపడే వారిలో నిర్భీతిని పెంచుతున్నాయి. తప్పు చేసేవారికి, దానికి దన్నుగా నిలిచే పోలీసులకు సర్కారు అండ దొరికితే ఇక నేరాలు ఇబ్బడిముబ్బడిగా పెరగటమే! ఎఫ్ఐఆర్​లో పేరున్న సీఐ, చార్జిషీట్​లో పరారీలో ఉన్నట్టు చూపిస్తారు. ఆయన మంత్రి బందోబస్తులో ప్రత్యక్షమైతే ఏమనాలి?

మోసాల మంత్రదండం మొబైల్!

యువతరాన్నే కాకుండా ఎందరో గృహిణుల్ని, ఖాళీగా తిరిగే జులాయిలనీ పెడదారి పట్టిస్తున్న పలు మాయదారి యాప్ లకు స్మార్ట్ ఫోన్ ఒక వేదిక. అడ్డూ–అదుపూ లేని అశ్లీల సైట్లకు తోడు చెడు సహవాసాలకు దారులు చూపే యాప్​లు జనాన్ని వశీకరించుకొని, తేలిగ్గా తప్పులు చేయిస్తున్నాయి. సజావుగా సాగే సంసారాల్లో,  మానవ సంబంధాల్లో చిచ్చు రేపుతున్నాయి. మానం, మర్యాద లేని, అనైతిక అంశాల్లో అదుపే లేని సినిమా, టీవీ కంటెంట్​​తో ప్రభావితులై ఉండే కౌమార, యవ్వన యువతకు ఈ యాప్​లు గాలం వేస్తుంటాయి. తేలికగా లొంగి, వాటి వినియోగం ద్వారా తెలియని తప్పిదాలకు, ఉచ్చులకు లోనవుతుంటుంది.ఫలితంగా డబ్బుగుంజే, వాంఛలు తీర్చుకునే బెదిరింపులు, బ్లాక్​మెయిల్ వంటివి పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. ఇవి ఆత్మహత్యలకు,  వివాహేతర సంబంధాలకు, కక్ష–కార్పణ్యాలకు దారితీస్తున్నాయి. సామాజికార్థిక సమస్యలు, పని ఒత్తిళ్ల మధ్య నలిగే తలిదండ్రుల నుంచి పిల్లలకు, ఉద్యోగులు–వ్యాపారుల నుంచి వారి జీవిత భాగస్వాములకు గాలం వేసి, ఉచ్చులో దించే వంచకులు ఎందరో? ఇవన్నీ నేరాలను, హింసను పెచ్చరిల్లజేస్తున్నాయి. వీటిపై శాస్త్రీయ అధ్యయనం జరగాలి. నియంత్రణకు నిఘా–దర్యాప్తు, శిక్షలు పటిష్టంగా ఉండాలి. ప్రభుత్వంతో పాటు న్యాయస్థానాలు, పౌర సంస్థలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్దిష్ట కార్యాచరణకు పూనుకుంటేనే నేర ప్రపంచానికి కట్టడి. 


యూట్యూబ్, వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టా.. ఇలా వేదికేదైనా సోషల్​ మీడియా మనిషి లైఫ్​లోకి చొచ్చుకు వచ్చిన తీరు మానవ సంబంధాలను దిగజార్చింది. అశాంతికి, పెట్రేగుతున్న హింసకు కారణమౌతోంది. వీటిపై ఏ మానసిక శాస్ర్త అధ్యయనం లేదు. కారణాలు వెతకడం, పరిష్కారాలు కనుక్కోడం ఏదీ లేదు. సర్కారు చేతులెత్తేసింది. పౌర సమాజం చేష్టలుడిగి బిత్తరచూపులు చూస్తోంది. ఆశలతో అల్లుకున్న నిండు జీవితాలు అర్ధంతరంగా కడతేరుతున్నాయి. హత్యో, ఆత్మహత్యో, దుర్మరణమో.. తిండి పెట్టే ఇంటి పెద్ద పోతే ప్రతి చోటా కుటుంబం కుదేలవుతోంది. ఆస్తుల కోసం కన్న తల్లిని, తండ్రినీ హతమార్చే దుర్మార్గానికి వారి సంతానమే తెగబడుతోంది. ఓ వివాహిత ఒకటో ప్రియుడితో, రెండో ప్రియుడిని చంపించే తెగింపు. ఊరు మారే ముందు.. చివరిసారి ప్రియుడిని  కలుస్తానంటే విధిలేక సరే అన్న భర్త, తన సహజసిద్ధ కోపావేశంతో వారి  మైథున సమయంలో అతన్ని హతమార్చిన విపరీతం! జల్సాలకు మరిగిన దత్తపుత్రుడు పెంచిన తల్లినే హతమారిస్తే.. డబ్బు కోసం తోటి జులాయి అతడిని చంపడం.. ఇదీ వరుస!
- దిలీప్ రెడ్డి.