ఏపీది దశాబ్ది ఘోష..జగన్, చంద్రబాబుదే తప్పు.. ఉండవల్లి అరుణ్ కుమార్

ఏపీలో తాజా పరిస్థితిపై సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంటే ఏపీ పరిస్థితి మాత్రం దశాబ్ది ఘోష అన్నట్లు తయారయ్యిందని అన్నారు. 2014 నుండి 2024 వరకు ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి జగన్, చంద్రబాబు ప్రభుత్వాలే కారణమని అన్నారు ఉండవల్లి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఈరోజుకి కూడా అమలు చేయలేదని అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరం పూర్తీ కాలేదని అన్నారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో పోలవరం 48శాతమే పూర్తయ్యిందని తెలిపిందని అన్నారు. ఇంకా 52శాతం పూర్తీ కావాల్సి ఉందని అన్నారు. 2014 లెక్కల ప్రకారం ఇవ్వాల్సిన నిధులు ఇచ్చేశామని, 500కోట్లు ఇస్తే సరిపోతుందని కేంద్ర పెద్దలు అంటున్నారని అన్నారు. విభజన తర్వాత పదేళ్లు ఏపీకి ఇబ్బందిగానే సాగిందని అన్నారు. ఏపీలో రాజకీయంగా ఎదిగే అవకాశం లేదు కాబట్టే బీజేపీ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత ఏర్పడే ప్రభుత్వమైనా కేంద్రం మీద ఒత్తిడి తేవాలని, లేకపోతే రాష్ట్రం మరింత ఇబ్బంది పడుతుందని అన్నారు ఉండవల్లి.