
రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు నిర్దేశించిన రక్షణల అమలును అధ్యయనం చేయడానికి రాష్ట్రపతి కమిషనర్‌ను లేదా ప్రత్యేకాధికారిని నియమించవచ్చు. దీనిని అనుసరించి 1978లో జనతా ప్రభుత్వం కార్యనిర్వాహకశాఖ ఉత్తర్వు ద్వారా ఏకసభ్య కమిషన్ స్థానంలో బహుళ సభ్య కమిషన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 1978 ఆగస్టు నుంచి అమలులోకి రాగా భోళా పాశ్వాన్ శాస్త్రి తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1990లో వి.పి.సింగ్ ప్రభుత్వ హయాంలో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు.
ఇది 1992, మార్చి 12 నుంచి అమలులోకి వచ్చింది. మొదటి చైర్మన్ ఎస్.హెచ్.రామ్థన్ (1992–95), రెండో చైర్మన్ హెచ్.హనుమంతప్ప (1995–98), మూడో చైర్మన్ దిలీప్‌సింగ్ భూరియా (1998–2002), నాలుగో చైర్మన్ బిజయ్ సొంకర్ శాస్త్రి (2002–04) వ్యవవహరించారు. ఆ తర్వాత 89వ రాజ్యాంగ సవరణ–2003 ద్వారా కొత్తగా 338ఏ అనే ఆర్టికల్ ను చేర్చి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విభజించి వేర్వేరుగా జాతీయ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు.
జాతీయ ఎస్సీ కమిషన్ : రాజ్యాంగంలో 338 నిబంధన ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పాటైంది. ఇది 2004, ఫిబ్రవరి 20 నుంచి అమలులోకి వచ్చింది. కమిషన్‌కు ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు మహిళా సభ్యురాలు తప్పకుండా ఉండాలి. ఈ కమిషన్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. ఆయనే తొలగిస్తారు. వీరి కాల పరిమితి మూడు సంవత్సరాలు. ఈ కమిషన్ తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి పార్లమెంట్‌కు సమర్పిస్తారు. ఈ నివేదికలను పార్లమెంట్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ పరిశీలిస్తుంది.
విధులు : రాజ్యాంగపరంగా షెడ్యూల్డ్ కులాలకు నిర్దేశించిన రక్షణలు, వాటి అమలు తీరును అధ్యయనం చేయడం.
- షెడ్యూల్డ్ కులాల ఆర్థిక, సాంఘిక స్థితిగతులను మెరుగుపరచడానికి తగిన సూచనలు చేయడం.
- ఎస్సీ హక్కుల ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను విచారించడం, కొన్ని సందర్భాల్లో ఫిర్యాదులు లేకుండా సుమోటోగా కేసులను విచారించవచ్చు.
- పౌర హక్కుల పరిరక్షణ చట్టం – 1955, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం–1989 అమలు తీరుపైన విచారణ చేస్తుంది.
జాతీయ ఎస్టీ కమిషన్ : రాజ్యాంగంలోని 16వ భాగంలోని 338 (ఎ) నిబంధన ప్రకారం జాతీయ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఇది 2004, ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి వచ్చింది. కమిషన్‌కు ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు మహిళా సభ్యురాలు తప్పకుండా ఉండాలి. ఈ కమిషన్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. ఆయనే తొలగిస్తారు. వీరి కాల పరిమితి మూడు సంవత్సరాలు. ఈ కమిషన్ తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి పార్లమెంట్‌కు సమర్పిస్తారు. పార్లమెంట్లో ఈ నివేదికలను పార్లమెంట్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ పరిశీలిస్తుంది.
విధులు : రాజ్యాంగం షెడ్యూల్డ్ తెగలకు నిర్దేశించిన రక్షణల అమలు తీరును అధ్యయనం చేయడం.
- షెడ్యూల్డ్ తెగల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి తగిన సూచనలు చేయడం.
- అటవీ హక్కుల రక్షణ చట్టం–2006ను అధ్యయనం చేసి, దానిని మరింతగా మెరుగుపరిచి అమలు చేయడానికి తగిన సూచనలు చేయడం.
- రాష్ట్రపతి నిర్దేశించిన ఇతర విధులు
అధికారాలు : ఈ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. ఏదైనా న్యాయస్థానం లేదా ఆఫీసు నుంచి అవసరమైన సమాచారాన్ని అడగడం, ఏ అధికారికైనా సమన్లు జారీ చేయడం, ఏ పత్రాన్నైనా పరిశీలించడం, శిక్షలు విధించడం, కోర్టు ధిక్కార చట్టాన్ని అమలు చేయడం, సాక్షుల విచారణ వంటి అధికారాలుంటాయి.
జాతీయ బీసీ కమిషన్ : 102వ రాజ్యాంగ సవరణ చట్టం–2018 ప్రకారం రాజ్యాంగంలో 338బిని చేర్చుతూ జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించారు. దీంతో గతంలో ఉన్న జాతీయ బి.సి.కమిషన్ చట్టం–1993ను తొలగించారు. కమిషన్‌కు ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. చైర్మన్‌గా నియమించే వ్యక్తికి సుప్రీంకోర్టులో గానీ, హైకోర్టులో గానీ పనిచేస్తున్న న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలుండాలి. లేదా న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వారై ఉండవచ్చు. చైర్మన్, సభ్యులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. అభియోగాలు మోపబడిన చైర్పర్సన్, సభ్యులపై సుప్రీంకోర్టున్యాయమూర్తితో విచారణ చేయించి, నిరూపణ అయితే రాష్ట్రపతి తొలగిస్తారు.
విధులు : బీసీ కులాల్లో చేర్చాల్సిన లేదా తొలగించాల్సిన కులాలను సూచించడం
- బీసీల స్థితిగతులను అధ్యయనం చేయడం
- క్రిమిలేయర్ పరిమితిని సూచించడం
- సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ :
రాజ్యాంగంలోని ఐదో భాగంలో ఆర్టికల్ 148 నుంచి 151 వరకు గల నిబంధనలు కాగ్ అనే పదవి గురించి వివరిస్తాయి. కాగ్ పదవిని బ్రిటన్ నుంచి గ్రహించారు. ఇది రాజ్యాంగరీత్యా అత్యున్నత పదవి. ఇతను భారత ఆడిట్ అండ్ అకౌంట్ విభాగానికి అధిపతి. ఇతను భారత ప్రజాధనానికి లేదా ఖజానాకు సంరక్షకుడు. ఆర్టికల్ 148 ప్రకారం దేశానికి ఒక కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంటారు. ఈ అధికరణ కాగ్ నియామకం, పదవీ విరమణ, స్వీకారం, సేవానిబంధనల గురించి తెలుపుతుంది. ఇతని అర్హతలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఇతనికి 10 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉండాలి. కాగ్ పదవీకాలం ఆరు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు, ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. సేవా నిబంధనలపై 1971లో చట్టం చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంగా ప్రత్యేక మెజార్టీ అంటే 2/3వంతు మెజార్టీతో పార్లమెంట్ తొలగిస్తుంది. అధికారికంగా పార్లమెంట్ సూచనతో రాష్ట్రపతి తొలగిస్తారు. ఈ తొలగింపు అసమర్థత, అక్రమ ప్రవర్తన ఆధారంగా చేస్తారు. కాగ్‌ను పదవీరీత్యా కంట్రోలర్ అని పేర్కొన్నా వాస్తవంలో ఇతను ఎలాంటి నియంత్రణ చేయకుండా కేవలం అకౌంట్లను మాత్రమే తనిఖీ చేస్తాడు. అందుకే ఇతని పనితీరును శవపరీక్షతో పోలుస్తారు. కేంద్రంలో రాష్ట్రపతికి, రాష్ట్రంలో గవర్నర్‌కు తన నివేదికలు ఇస్తుంది. కాగ్ తన పదవీ విరమణ తర్వాత ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం చేపట్టరాదు.
స్వతంత్ర ప్రతిపత్తి : రాష్ట్రపతి నియమిస్తాడు.
- పదవీకాలం నిర్దిష్టంగా ఉండి భద్రతను కలిగి ఉండటం.
- జీతభత్యాలకు, సేవా నిబంధనలకు రక్షణ.
- తొలగింపు ప్రక్రియ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పోలి ఉండటం.
- రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ప్రభుత్వ పదవిలో ఉండకపోవడం.