బీహార్: నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన కేబుల్‌ బ్రిడ్జి

బీహార్: నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన కేబుల్‌ బ్రిడ్జి

బీహార్‌లో ఘోర ప్రమాదం తప్పింది. భాగల్‌పూర్‌లో గంగానదిపై నిర్మిస్తున్న కేబుల్‌ బ్రిడ్జి పేకమేడలా కుప్పకూలింది. బ్రిడ్జి కూలిన దృశ్యాలను స్థానికులు వీడియో తీయగా, అవి నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ విచారణకు ఆదేశించారు. 

ఈ బ్రిడ్జికు ప్రమాదం జరగడం ఇది రెండోసారి అని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో తుఫాను కారణంగా వంతెన పిల్లర్లు కొంతభాగం దెబ్బతిన్నట్లు సమాచారం. ఖగారియా అగువాని-సుల్తాన్‌గంజ్‌ మధ్య గంగా నదిపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. దాదాపు రూ.1,710 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2014లో బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ శంకుస్థాపన చేశారు. 2020 నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. ఇప్పటికీ పూర్తికాలేదు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో నితీశ్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

కాగా, ఇలాంటి ఘటనలు బీహార్‌లో తరచూ జరుగుతున్నాయి. 2022లో బెగుసరాయ్‌లో బుర్హి గండక్‌ నదిపై నిర్మించిన వంతెనలో కొంత భాగం కూలిపోయింది. వంతెన రెండు, మూడు పిల్లర్లు కూలిపోయాయి. అంతకు కొన్ని రోజుల ముందు నలంద జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. ఈఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. అలాగే కిషన్‌గంజ్‌, సహర్సా జిల్లాల్లోనూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలు కూలిపోయాయి.

https://twitter.com/ANI/status/1665360733234659328