- మునిగిన నాలుగు మోటార్లు
- సెలవులు రద్దు చేసుకోవాలన్న.. మంత్రి ఆదేశాలు బేఖాతర్
- ఇంజనీర్లు, మేఘాపై చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి నాగం
- ఆడిట్ టన్నెల్ నుంచి పంప్‌హౌస్‌లోకి చేరిన వరద
నాగర్ కర్నూల్/టౌన్/కందనూలు, వెలుగు: నిర్మాణంలో ఉన్న పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లోని వట్టెం పంప్‌హౌస్, సర్జ్‌పూల్ వరద నీటిలో మునిగిపోయాయి. నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీపురానికి దగ్గర్లో ఉన్న నాగనూలు చెరువు అలుగుపారడంతో ఆ నీరంతా పక్కనే ఉన్న వట్టెం ఓపెన్ టన్నెల్లోకి చేరింది. దీనికి తోడు నాగనూల్ చెరువు పైప్రాంతంలో ఉన్న దాదాపు 30 చెరువుల నుంచి వచ్చిన వరద నాగనూలు చెరువు అలుగు మీదుగా ఓపెన్ టన్నెల్ నుంచి డైరెక్ట్‌గా సర్జ్‌పూల్ లోకి చేరి అటు నుంచి ఆడిట్ టన్నెల్ ద్వారా పంప్‌హౌస్‌లోకి వెళ్లాయి.
వరుసగా రెండు రోజులు కురిసిన భారీ వర్షాలకు నిండిన చెరువులు అలుగు దుంకడంతో ఈ పరిస్థితి వచ్చింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇంజనీర్లు సెలవులు రద్దుచేసుకుని అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించినా అధికారులు బేఖాతర్ చేసినట్లు తెలిసింది.
కేఎల్ఐ కాల్వలకు గండ్లు పడి కొట్టుకుపోయినా, చెరువులకు బుంగలు పడినా, రెండు రోజులుగా వట్టెం మెయిన్ టన్నెల్ నుంచి సర్జ్‌పూల్‌లోకి చెరువుల నీరు చేరుతున్నా ఆఫీసర్లు పరిస్థితిని అంచనా వేయలేకపోయారు. పంప్‌హౌస్ మునిగిందన్న వార్తలతో హైదరాబాద్ లో ఉన్న ప్రాజెక్ట్ ఇంజనీర్లు బయలుదేరుతున్నారని తెలుస్తున్నది.
కాపాడే ప్రయత్నాలు సక్సెస్ కాలే
ఆదివారం ఉదయం నుంచే నాగనూల్ చెరువు అలుగు నీరు ఓపెన్ టన్నెల్లోకి వెళ్తున్నా అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టలేదని తెలిసింది. ఆది, సోమవారాల్లో ఉధృతంగా ప్రవహించిన వరద నీరు డైరెక్ట్‌గా సర్జ్‌పూల్ లోకి చేరింది. వరద నీటిని నియంత్రించేందుకు సోమవారం ఉదయం నుంచి చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో పంప్‌హౌస్ పూర్తిగా వరద నీటిలో మునిగింది.
వట్టెం పంప్‌హౌస్ లో 10 పంపులు, మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికి నాలుగు ఫిట్ చేశారు. ఐదో పంప్ పనులు కొనసాగుతున్నాయి. శ్రీపురం నాగనూల్ చెరువు పక్క నుంచి వట్టెం పంప్‌హౌస్ వరకు 14 కి.మీ.ల పొడవున ఓపెన్, అండర్ టన్నెల్ ఉంటుంది. ఓపెన్ టన్నెల్ లోకి చెరువు నుంచి వచ్చే నీరు చేరకుండా అడ్డంగా రాళ్లు వేయిస్తున్నారు. పంప్‌హౌస్ నుంచి నీటిని తోడిపోసే పనులు చేపట్టామని ఇంజనీర్లు తెలిపారు. సర్జ్‌పూల్ నుంచి పంప్‌హౌస్ లోకి మూడు ఆడిట్ టన్నెల్స్, ఎస్కెప్ టన్నెల్స్ ఉంటాయి. వట్టెం అండర్‌గ్రౌండ్ పంప్‌హౌస్ కావడంతో పై నుంచి వచ్చే వరద ప్రవాహాన్నీ కంట్రోల్ చేయలేకపోయారు.
అంత వరద ఊహించలేదు: ఈఈ పార్థసారథి
వట్టెం పంప్‌హౌస్, సర్జ్‌పూల్ పనులు 90 శాతం పూర్తి అయ్యాయని డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని, ఇంతలోనే పంపుహౌస్‌లోకి నీరు చేరిందని ఈఈ పార్థసారథి మంగళవారం చెప్పారు. ఓపెన్ టెన్నెల్‌లోకి ఈ స్థాయిలో నీరు వస్తుందని ఊహించలేదన్నారు. పంప్‌హౌస్ లోకి వరద నీరు ప్రవేశించకుండా అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. సర్జ్‌పూల్, పంప్‌హౌస్ పనులు కంప్లీట్ కానందున పునరుద్ధరణ పనులను కాంట్రాక్ట్ ఏజెన్సీలైన మేఘా, హెచ్‌సీఎల్ చేపడతాయని వివరించారు. జరిగిన నష్టాన్నీ ఇప్పడే అంచనా వేయలేమని, నీటిని తోడిన తర్వాత తెలుస్తుందన్నారు.
మేఘా నిర్లక్ష్యమే కారణం: నాగం
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 7లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌లోని వట్టెం పంప్‌హౌజ్ ప్రారంభానికి ముందే మునిగిపోవడానికి ఇంజనీర్లు, మేఘా కంపెనీ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై విచారణకు ఆదేశించి మేఘా కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.