- కేంద్ర మంత్రి బీఎల్ వర్మ
హనుమకొండ, వెలుగు : ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ త్వరలోనే ప్రపంచలోనే నంబర్‌వన్‌గా మారనుందని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ చెప్పారు. దేశంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఆదివారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ రైతులకు ఏటా రూ. 6 వేల పెట్టుబడి సాయం అందజేస్తున్నామని, ప్రజలందరికీ ఉచితంగా రెండు డోసుల ఫ్రీ వ్యాక్సిన్ వేశామని గుర్తు చేశారు.
ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ముందుగా స్థానికులతో కలిసి ప్రధానమంత్రి మన్‌కీబాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్‌కు చెందిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సమాచార మెటీరియల్‌ను ఆవిష్కరించారు. అనంతరం వివిధ శాఖలు, బ్యాంకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఉజ్వల యోజన లబ్ధిదారులకు గ్యాస్ కేటాయింపు పత్రాలను అందజేశారు.
అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో ‘మన సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశం’ అంటూ ఆఫీసర్లు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ విజయరామారావు, నాయకులు కొలను సంతోష్‌రెడ్డి, దేశిని సదానందం గౌడ్, తాళ్లపల్లి కుమారస్వామి, హనుమకొండ, వరంగల్ జిల్లాల లీడ్ బ్యాంక్ మేనేజర్లు శ్రీనివాస్, రాజు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రతినిధి కళ్యాణ్, కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సూరునేని, డీఐవో వాణిశ్రీ పాల్గొన్నారు.