ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రెసిడెంట్​ పంచారెడ్డి ప్రవళిక, రాష్ట్ర అధికార ప్రతినిధి స్రవంతిరెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కేంద్ర సైనిక చర్యతోనే తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. మహిళలు, బాలికలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆకుల నీలిమ, వరలక్ష్మి, పంచారెడ్డి లావణ్య, మేక విజయ, చంద్రకళ, జ్యోతి అనురాధ సరస్వతి, మీరా పాల్గొన్నారు. 

ఎస్సీ హాస్టల్‌‌‌‌ను తనిఖీ చేసిన స్పీకర్

బాన్సువాడ, వెలుగు: పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌‌‌‌ను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ ప్రకారం వంటలు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో లోపాలను సవరించడానికే ఆకస్మిక తనిఖీ చేసినట్లు చెప్పారు. హాస్టళ్ల నిర్వాహణకు ప్రభుత్వం కావాల్సిన నిధులను ఇస్తుందన్నారు. పిల్లలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. అనంతరం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌‌‌ శ్రీనివాస్ ప్రసాద్‌‌‌‌ను పిలిపించి స్టూడెంట్లకు వైద్య పరీక్షలు చేయించారు. స్పీకర్ వెంట ఆర్డీవో రాజాగౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి ఉన్నారు. 

కామారెడ్డి మార్కెట్ కమిటీ నియమాకం

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమిస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌‌‌‌గా పిప్పిరి వెంకటి, వైస్​చైర్మన్‌‌‌‌గా కుంబాల రవి,  డైరెక్టర్లుగా గబ్బుల లక్ష్మీపతి, మాలవత్ రవీందర్, రాజ్యలక్ష్మి, షేక్​ అజీజ్, బండారం నర్సారెడ్డి, వెల్మ మల్లారెడ్డి, బొంబొతుల రాజాగౌడ్, కొల్మి బీంరెడ్డి, కలకుంట్ల రాజయ్య, బాలకిషన్​గౌడ్, కాసర్ల రవీందర్, కొక్కొండ రవీందర్‌‌‌‌‌‌‌‌ను నియమించారు. కొత్తగా నియమితులైన పాలకవర్గం ప్రతినిధులు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌‌‌‌ను కలిశారు.

రవితేజకు సేవారత్న అవార్డు

లింగంపేట, వెలుగు: మండలంలోని లింగంపల్లికి చెందిన రవితేజ తెలంగాణ సేవారత్న అవార్డును అందుకున్నారు. గురువారం హైదరాబాద్‌‌‌‌లోని సరస్వతీ పరిషత్‌‌‌‌ ఆడిటోరియంలో నిర్వహించిన ఓ ప్రోగ్రామ్‌‌‌‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఫ్రీడం పైటర్ గంగారాం ఫౌండేషన్ వారు తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి ఏటా అవార్డులను అందజేస్తున్నారు. ఈ ఏడాది కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లింగంపల్లికి చెందిన రవితేజకు అవార్డు అందజేశారు. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఫౌండేషన్​ చైర్మన్ భక్తిరాం, సంస్థ నిర్వహకులు పాల్గొన్నారు.

జెండా ఎగురవేస్తే అరెస్టు చేసిన్రు

కామారెడ్డి, వెలుగు: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన సందర్భంగా జెండా ఎగుర వేస్తే అరెస్టులు చేసిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదని బీజేపీ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ అరుణతార విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవం ఉత్సవాల్లో  భాగంగా బీజేపీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళ్లులు అర్పించారు. అనంతరం అరుణతార మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవం ఉసెత్తలేదన్నారు. బీజేపీ చేపట్టిన ఉద్యమాలకు తలొగ్గి ఇప్పుడు సమైక్యతా ఉత్సవాల పేరిట కొత్త నాటకాలు ఆడుతుందని విమర్శించారు. మహిళ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ దత్తేశ్వరి, కౌన్సిలర్లు ఆకుల సుజిత, మానస, లీడర్లు చంద్రకళ, అనిత, యాదమ్మ, శ్యామల, వరలక్ష్మి, పావని పాల్గొన్నారు.  

పెండింగ్‌‌‌‌ కేసులపై దృష్టి పెట్టాలి

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌‌‌‌లో పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ నాగరాజు సూచించారు. గురువారం తన కార్యాలయంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 18 వరకు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అండర్ ఇన్‌‌‌‌ వెస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు. సమావేశంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ , ఏసీపీలు వెంకటేశ్వర్ ,ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు, కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌‌‌‌స్పెక్టర్ శ్రీహరి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ

భిక్కనూరు, వెలుగు: సైబర్  నేరాల నియంత్రణపై హైదరాబాద్ సైబర్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నిర్వహిస్తోన్న 120 కిలో మీటర్ల సైకిల్ ర్యాలీ గురువారం భిక్కనూరుకు చేరుకుంది. సీఐ తిరుపయ్య, ఎస్సై అనంద్‌‌‌‌గౌడ్ సైకిల్​ ర్యాలీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్సై గడ్డం మల్లేశం మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోయాయని, వాటిని అరికట్టేందుకు పోలీస్​శాఖ ఎన్నో చర్యలు తీసుకుంటున్నదన్నారు. నేరాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగామన కల్పించేందుకే ఈ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వాగతం పలికిన వారిలో పట్టణ సర్పంచ్ తునికి వేణు, ఉప సర్పంచ్ బోడ నరేశ్‌‌‌‌ ఉన్నారు. 

అపారం చెరువును పరిశీలించిన ఆఫీసర్లు

భిక్కనూరు, వెలుగు: మండలంలోని రామేశ్వరపల్లి అపారం చెరువు ఫీడర్ చానెల్‌‌‌‌ను ఇరిగేషన్ ఆఫీసర్లు డీఈ సుష్మారెడ్డి, ఏఈ అనంద్ గురువారం పరిశీలించారు. ఫారెస్ట్​ ఏరియా అయిన గట్టు ప్రాంతం నుంచి వర్షాపు నీరు చెరువులోకి వస్తుందా లేదా అని చెక్‌‌‌‌ చేశారు.  కొన్ని చోట్ల ఫీడర్​చానెల్​ కాల్వకు రిపేర్లు అవసరం ఉన్నట్లు గుర్తించారు. వారి వెంట సర్పంచ్ నాగర్తి పోతిరెడ్డి, ఎంపీటీసీ మద్ద చంద్రకాంత్‌‌‌‌రెడ్డి, విండో చైర్మన్ నాగర్తి భూమిరెడ్డి, వీడీసీ అధ్యక్షుడు తక్కళ్ల నర్సారెడ్డి, ఉప సర్పంచ్ యాశోద, రెడ్డిగారి నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మద్ది సూర్యకాంత్, సొసైటీ వైస్ చైర్మన్ శేఖర్ ఉన్నారు.​ 

అట్రాసిటీ కేసులో నిందితుడి అరెస్ట్ 

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్థానిక పోచమ్మగల్లికి చెందిన ఎడ్ల అశోక్ గురుబాబాదికి చెందిన అజయ్ కుమార్ తనను కులం పేరుతో దూషించాడని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గురువారం మధ్యాహ్నం అజయ్ కుమార్‌‌‌‌‌‌‌‌ను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్‌‌‌‌లలో కూడా అతడిపై కేసులు ఉన్నాయని తెలిపారు. భూ తగాదాలకు సంబంధించిన ఎటువంటి వివాదాలు ఉన్న సివిల్ కోర్టులను సంప్రదించి పరిష్కరించుకోవాలని, వాటిని క్రిమినల్ కేసులుగా మార్చుకోవద్దని ఏపీసీ సూచించారు.

టీయూ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌కు నేషనల్ అవార్డు

డిచ్‌‌‌‌పల్లి, వెలుగు: రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో బీఏ, బికాం, బీఎస్సీ కోర్సుల సిలబస్‌‌‌‌ను  అప్​గ్రేడ్​ చేసిన తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్​ డాక్టర్ ప్రవీణ్ మామిడాల నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. గ్లోబల్​ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​ఆయనకు ‘అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్–2022’ను గురువారం ప్రకటించింది. సెప్టెంబర్​ 16, 17వ తేదీల్లో హైదరాబాద్‌‌‌‌లో​ నిర్వహించే ఇండిగ్లోబల్ ఎడ్యుకేషన్​ఫెస్టివల్‌‌‌‌లో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. అవార్డు సాధించిన ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ను వీసీ రవీందర్​ గుప్తా, రిజిస్ట్రార్​ విద్యావర్ధిని, ప్రొఫెసర్స్, స్టూడెంట్లు అభినందించారు.

ప్రతి వాడలో జాతీయ జెండా ఎగురవేయాలి

నిజామాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న ప్రతి పోలింగ్ బూత్‌‌‌‌లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని బీజేపీ జిల్లా కమిటీ  పిలుపునిచ్చింది. గురువారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో పార్టీ జిల్లా ప్రెసిడెంట్ బస్వా లక్ష్మీనర్సయ్య  అధ్యక్షత వహించగా జిల్లా ఇన్‌‌‌‌చార్జి మీసాల చంద్రయ్య హాజరై మాట్లాడారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు దాశరథిని బందీగా ఉంచిన ఖిల్లా జైలును నేడు సందర్శించనున్నట్లు చెప్పారు.  ప్రధాని మోడీ జన్మదిన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో వంద మంది సభ్యులతో రక్తదాన శిబిరం నిర్వహించాలని యువ మోర్చా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు  జాతీయ పార్టీ ఇచ్చినా కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు ఆదేశించారు. సమావేశంలో బీజేపీ నేతలు యెండెల లక్ష్మీనారాయణ, అల్జపూర్ శ్రీనివాస్, లోక భూపతిరెడ్డి, ధన్‌‌‌‌పాల్‌‌‌‌ సూర్యనారాయణ, మేడపాటి ప్రకాశ్‌‌‌‌రెడ్డి, డాక్టర్‌‌‌‌‌‌‌‌ మల్లికార్జున్‌‌‌‌రెడ్డి, పోతన్‌‌‌‌కార్‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, నర్సింహారెడ్డి, పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, స్రవంతిరెడ్డి, మేక విజయ, గద్దె భూమన్న, కంచెట్టి గంగదార్ పాల్గొన్నారు.

బోధన్‌‌‌‌లో బైక్‌‌‌‌ ర్యాలీ

బోధన్, వెలుగు: సెప్టెంబర్​ 17 విమోజన దినం సందర్భంగా ప్రతి గ్రామంలో జాతీయ జెండాను ఎగరవేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండాల  లక్ష్మీనారాయణ కోరారు. గురువారం బోధన్​ పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని రెంజల్ జడ్పీటీసీ మేక విజయ్ జెండా  ఊపీ ప్రారంభించారు.  రాకాసిపేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రైల్వేగేట్, గోశాల రోడ్, పాత బస్టాండ్, అంబేద్కర్​ చౌరస్తా, కొత్త బస్టాండ్, శక్కర్ నగర్ చౌరస్తా, అనిసానగర్, ఆచన్‌‌‌‌పల్లి వరకు కొనసాగింది. నాయకులు మేడపాటి ప్రకాశ్‌‌‌‌రెడ్డిరెడ్డి,  బాలరాజ్, నర్సింహారెడ్డి, సుధాకర్‌‌‌‌‌‌‌‌చారి పాల్గొన్నారు.

ప్రోటోకాల్‌‌‌‌ పాటించరా..?

ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై వివక్ష ఎందుకు

కామారెడ్డి, వెలుగు: ప్రభుత్వ అధికారిక ప్రోగ్రామ్‌‌‌‌లలో ప్రోటోకాల్ ఎందుకు పాటించడంలేదని కాంగ్రెస్‌‌‌‌ జడ్పీటీసీ నారెడ్డి మోహన్‌‌‌‌రెడ్డి ప్రశ్నించారు. తాను ప్రతిపక్ష పార్టీకి చెందిన జడ్పీటీసీ కావడం వల్లే మండల స్థాయిలో జరిగే ప్రోగ్రామ్‌‌‌‌లకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. గురువారం  రామారెడ్డి మండల కేంద్రంలో కొత్తగా మంజూరైన ఆసరా ఫించన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ చీఫ్‌‌‌‌ గెస్ట్‌‌‌‌గా హాజరయ్యారు. కార్యక్రమం షురూ కాగానే కాంగ్రెస్‌‌‌‌కు చెందిన జడ్పీటీసీ మోహన్‌‌‌‌రెడ్డి, పొసానిపేట సర్పంచ్‌‌‌‌ మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.  ఆసరా ఫించన్ల లబ్ధిదారుల జాబితా కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలో ఎంపీపీ  దశరథ్‌‌‌‌రెడ్డి జడ్పీటీసీ మధ్య కొద్ది సేపు వాగ్వావాదం జరిగింది. మండల  సమస్యలపై  జడ్పీటీసీ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.