న్యూఢిల్లీ: టీమిండియా 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే వరల్డ్‌కప్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ యువరాజ్ సింగ్. తన ఆల్ రౌండ్ మెరుపులతో ఇండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత ప్రొఫెషనల్ కోచ్ అవతారం ఎత్తనప్పటికీ యువీ తన స్వరాష్ట్రం పంజాబ్‌కు చెందిన పలువురు క్రికెటర్లను తీర్చిదిద్దుతున్నాడు. యువీ మార్గనిర్దేశంలో శుభ్‌మన్ గిల్ టీమిండియా నయా సూపర్ స్టార్‌గా ఎదిగాడు. గిల్‌తో పాటు అభిషేక్‌శర్మ, అన్మోల్ ప్రీత్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ వెలుగులోకి రావడం వెనుకా యువరాజ్ హస్తం ఉంది. కొవిడ్ లాక్‌డౌన్ టైమ్‌లో యువీ తన ఇంట్లో ఏర్పాటు చేసిన ఐదు వారాల స్పెషల్ ట్రెయినింగ్ క్యాంప్‌లో పాల్గొనడం వీళ్ల కెరీర్‌ను మలుపు తిప్పింది.
అప్పటికే ఇండియా టీమ్‌లోకి వచ్చిన గిల్ ఈ క్యాంప్‌లో యువీ గైడెన్స్‌లో మరింత రాటు దేలాడు. అతని ఆట మరో లెవెల్‌కు వెళ్లి ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు. అభిషేక్ పంజాబ్ రంజీ టీమ్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో కీలకంగా ఎదిగాడు. ప్రభ్‌సిమ్రన్ ఆసియా గేమ్స్‌లో టీమిండియా తరఫున బరిలోకి దిగగా.. అన్మోల్ ప్రీత్ కూడా రంజీ, ఐపీఎల్‌లో రాణిస్తున్నాడు. యువీ ఇంట్లో 35 రోజులు గడపడంతో ఆటపై తమ ఆలోచన విధానం మారిందని అభిషేక్ చెప్పాడు. ‘కరోనా పీక్ టైమ్‌లో మా కోసం యువీ ఇండోర్ క్యాంప్ ఏర్పాటు చేశాడు. ఓ మెంటార్‌గానే కాకుండా పెద్దన్నలా మాకు సాయం చేశాడు.
అంతకుముందు 2–3 ఏండ్ల నుంచి మాకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. ఆ క్యాంప్‌లో ప్రతీ రోజు మాకు ప్రత్యేక ట్రెయినింగ్ షెడ్యూల్ ఇచ్చాడు. ఉదయం ఫిట్‌నెస్, స్కిల్ సెషన్స్‌లో పాల్గొనేవాళ్లం. సాయంత్రం తన ఇంట్లోని హోమ్ థియేటర్లో మా ఆట వీడియోలు ప్లే చేసి లోపాలను సరిదిద్దేవాడు. ఈ సెషన్ మమ్మల్ని చాలా మార్చింది. గిల్ అప్పటికే ఇండియా టీమ్‌కు ఆడినా ఇప్పుడు చూస్తున్న జోరు లేదు. ఈ క్యాంప్ తర్వాత తను చాలా సక్సెస్ అయ్యాడు. నా ఆట కూడా మారింది. డొమెస్టిక్‌తో పాటు ఐపీఎల్‌లోనూ నా పెర్ఫామెన్స్ మెరుగైంది ’ అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.