- మంత్రి తుమ్మల చొరవతో సిద్ధమవుతున్న ప్రతిపాదనలు
- 970 కిలోమీటర్ల నెట్ వర్క్ తో అన్ని ఇండ్లను కనెక్ట్ చేస్తూ యూజీడీ ఏర్పాటు
- రూ.1300 కోట్ల వరకు ఖర్చు అంచనా
- వరద నీరు నేరుగా వాగులోకి వెళ్లేలా ప్రత్యేక డ్రెయిన్లు
ఖమ్మం, వెలుగు : ఖమ్మంవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరబోతున్నది. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. మొత్తం 970 కిలోమీటర్ల నెట్ వర్క్ తో అన్ని ఇండ్లను కనెక్ట్ చేస్తూ యూజీడీ ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం రూ.1300 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. యూజీడీ పైప్ లైన్ వేసే సమయంలో కొన్ని రోడ్లను మళ్లీ వేయాల్సి రావడం, పైప్ లైన్లను మార్చడం, డ్రెయిన్లను మార్చడం లాంటి అంశాలతో ఖర్చు కొంత ఎక్కువగానే ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
త్రీటౌన్ ఏరియాలో ఇప్పటికే వేసిన గోళ్లపాడు ఛానల్ వల్ల అక్కడ 60 శాతానికి పైగా పనులు కంప్లీట్ అయ్యాయి. దాన్ని మిగిలిన నగరంతో కలుపుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో ఇప్పటికే దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) హైదరాబాద్లో తయారవుతోంది. రెండు, మూడు రోజుల్లోనే పూర్తి స్థాయిలో డీపీఆర్అధికారులకు అందే అవకాశముంది.
వరద నీటిని తరలించేందుకు..
నగరంలో వరద నీటిని తరలించేందుకు ప్రత్యేకంగా డ్రెయిన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల వచ్చిన వరదల్లో మున్నేరును ఆనుకున్న కాలనీలే కాకుండా గతంలో ఎన్నడూ వరద రాని కాలనీలైన కవిరాజ్నగర్, చైతన్య నగర్ కూడా మునగడంతో మరోసారి ఆ పరిస్థితి రాకుండా ప్లాన్ చేస్తున్నారు. ఖానాపురం చెరువు దగ్గర నుంచి ధంసలాపురం చెరువు వరకు ఉన్న ఛానల్ ను వెడల్పు చేసి, వరద నీరు నేరుగా మున్నేరు వాగులో కలిసేలా ఆధునీకరించనున్నారు. గత కొన్నేండ్లు అలుగు వాగుపై పెరిగిన కబ్జాలను కూడా తొలగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆక్రమణలను గుర్తించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి కొన్నేండ్ల కిందటి శాటిలైట్ ఫోటోలను కూడా తెప్పించినట్టు సమాచారం.
మురుగునీరు యూజీడీ పైపుల ద్వారా, వరద నీరు అలుగు వాగు, డ్రెయిన్ ల ద్వారా ఏరులోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రస్తుతం సర్వే జరుగుతోంది. మరో పది రోజుల్లో వరద నీటి డ్రైయిన్లకు సంబంధించిన డీపీఆర్ కూడా పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీనికి కూడా సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చయ్యే చాన్సుందని సమాచారం.
ఎస్టీపీ నిర్మాణం..
నగరాన్ని అధికారులు మూడు జోన్లుగా విభజించి సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న మురుగు నీరు శుద్ధి చేసేందుకు శ్రీనివాస్ నగర్ కింద మున్నేరు దగ్గర 20 ఎంఎల్డీ కెపాసిటీతో సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. కొత్తగా అమృత్ పథకంలో భాగంగా రూ.249 కోట్లతో మరో రెండు ఎస్టీపీలు మంజూరయ్యాయి.
ALSO READ : ఓఆర్ఆర్పై హరీశ్ వర్సెస్ పొంగులేటి
రోజుకు 44 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) సామర్థ్యంతో ధంసలాపురం చెరువు దగ్గర, 9.5 ఎంఎల్డీ సామర్థ్యంతో పుట్టకోట చెరువు దగ్గర ఎస్టీపీలు నిర్మించనున్నారు. వాటి ద్వారా మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాత నీటిని వదలనున్నారు.
యూజీడీ పూర్తయితే ముంపునకు చెక్
ఖమ్మం నగరంలో లక్షా 70 వేల ఇండ్లలో 5 లక్షల మందికి పైగా నివసిస్తున్నారు. ప్రతి యేటా వర్షాకాలంలో వరదల వల్ల నగరంలో లోతట్టు కాలనీలు నీట మునుగుతున్నాయి. 20కి పైగా కాలనీల్లో కొన్ని వేల మంది వరదలతో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ రోజులు వరదలో ఉండడంతో జనం అనారోగ్యం బారినపడుతున్నారు. ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థతో దోమల సమస్య కూడా తీవ్రంగా ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే వీటన్నింటికి చెక్ పడే అవకాశం ఉంది.