మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు

  • ఈఆర్ఎం విధానంలో స్టడీ
  • ఫౌండేషన్​ నుంచి భారీ మోటార్లతో నీటి పంపింగ్

హైదరాబాద్, వెలుగు :  మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ప్రాజెక్టు ఫీల్డ్​ఇంజనీర్ల పర్యవేక్షణలో ఎల్ అండ్​టీ అధికారుల ఆధ్వర్యంలో గురువారం దర్యాప్తు మొదలైంది. బ్యారేజీ ఏడో బ్లాక్​లోని 20వ నంబర్​ పిల్లర్ నిరుడు​ అక్టోబర్​21న కుంగింది. దానికి ఇరువైపులా ఉన్న పిల్లర్లు కూడా కుంగి వాటిలోనూ పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బ్యారేజీ ఎందుకు కుంగిందో తెలుసుకోవడానికి ఎలక్ట్రోరల్​ రెసిస్టివిటీ మెథడ్​(ఈఆర్ఎం) విధానంలో భూగర్భ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆరు నుంచి ఎనిమిదో బ్లాక్​లోని పిల్లర్ల వద్దకు నీళ్లు రాకుండా మట్టికట్ట (కాఫర్​డ్యామ్) నిర్మించారు. పిల్లర్ల ఫౌండేషన్​వద్ద ఇసుకను తొలగించారు. 60 హెచ్​పీ సామర్థ్యం గల మోటార్లు ఏర్పాటు చేసి, ఫౌండేషన్​లో వస్తున్న నీళ్లను ఎత్తిపోస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు బ్యారేజీ బెడ్​లెవల్​వరకు ఉన్న నీటిని తొలగించినట్టు తెలిసింది. మేడిగడ్డ ఘటనపై ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత తీసుకున్న​ఎల్​అండ్​టీ.. ఒక థర్డ్​ పార్టీ ఏజెన్సీకి ఆ పనులు అప్పగించింది. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ఇన్వెస్టిగేషన్​ప్రారంభించారు. మొదట ఏడో బ్లాక్ ​వద్ద ఇన్వెస్టిగేషన్​ పూర్తి చేసి, ఆ తర్వాత బ్యారేజీలోని మిగతా ఏడు బ్లాకుల్లోనూ సర్వే చేయనున్నట్టు సమాచారం.

అన్నారం, సుందిళ్ల బుంగలకు గ్రౌటింగ్..

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఏర్పడిన బుంగలను పూడ్చేసినట్టుగా తెలుస్తోంది. అన్నారం బ్యారేజీకి రెండు చోట్ల, సుందిళ్ల బ్యారేజీకి నాలుగు చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. ఇసుక, సిమెంట్​బస్తాలతో వాటిని తాత్కాలికంగా పూడ్చేసిన ఇంజనీర్లు.. ఆయా బుంగలను పూడ్చేసే బాధ్యతను డైనోసర్​అనే కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీ ఆధ్వర్యంలో దాదాపు అన్ని బుంగలను సిమెంట్, కెమికల్​ట్రీట్​మెంట్​ద్వారా గ్రౌటింగ్​చేసినట్టుగా తెలుస్తోంది. రెండు బ్యారేజీల్లో ఎందుకు బుంగలు ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు త్వరలోనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టనున్నట్టు తెలిసింది.