- 6 జంక్షన్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్
- రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్న పనులు
- మూడు లైన్లతో యూని డైరెక్షన్, 7 అండర్ పాస్‌లు, 6 ఫ్లై ఓవర్ల నిర్మాణం
- పనులు పూర్తయితే పార్క్ చుట్టూ తీరనున్న ట్రాఫిక్ సమస్య
హైదరాబాద్ సిటీ, వెలుగు:హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ (కాసు బ్రహ్మానంద రెడ్డి) పార్కుచుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు సంబంధించి నమూనా చిత్రాలను జీహెచ్ఎంసీ శనివారం విడుదల చేసింది. హెచ్–సీఐటీఐ (హైదరాబాద్– సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)లో భాగంగా రెండు ప్యాకేజీలుగా ఈ జంక్షన్లను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేయనుంది.
ఇందులో మొదటి ప్యాకేజీ కింద రెండు ఫ్లైఓవర్లు, మూడు అండర్ పాస్‌లను నిర్మించనుంది. సెకండ్ ప్యాకేజీలో 4 జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. ఇందు లో నాలుగు ఫ్లైఓవర్లు, నాలుగు అండర్ పాస్‌లు ఉండనున్నాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మీదుగా హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాలకు వెళ్లేవారికి ఇబ్బందులు తొలగనున్నాయి.
మొదటి ప్యాకేజీ కింద..
మొదటి ప్యాకేజీలో రూ.421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్‌లో రోడ్ నంబర్ 45 నుంచి కేబీఆర్ పార్కు, యూసుఫ్‌గూడ వెళ్లే రూట్‌లో ‘వై’షేప్‌లో అండర్ పాస్ నిర్మించనున్నారు. అలాగే కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్36 వైపు నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. యూసుఫ్‌గూడ వైపు నుంచి రోడ్ నంబర్45 జంక్షన్ వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్ కట్టనున్నారు.
కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్, ముగ్దా జంక్షన్లలో చూస్తే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వైపు రెండు లేన్ల అండర్‌పాస్, పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు మూడు లేన్ల యూని డైరెక్షనల్, కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు మూడు లేన్ల అండర్ పాస్ నిర్మించనున్నారు.
సెకండ్ ప్యాకేజీ కింద..
రెండో ప్యాకేజీలో రూ.405 కోట్లతో రోడ్ నంబర్ 45 జంక్షన్, ఫిలిం నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్.. ఇలా నాలుగు జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. రోడ్ నంబర్ 45 జంక్షన్‌లో ఫిలింనగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు రెండు లేన్ల అండర్ పాస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నంబర్ 45 వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అలాగే, ఫిలింనగర్ జంక్షన్‌లో మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 45 జంక్షన్ వైపు రెండు లేన్ల అండర్‌పాస్, ఫిలిం నగర్ జంక్షన్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.
Also Read:ఎవరికీ నష్టం జరగనివ్వం
మహారాజా అగ్రసేన్ జంక్షన్ కింద క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఫిలింనగర్ జంక్షన్ వైపు రెండు లేన్ల అండర్‌పాస్, ఫిలిం నగర్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 12 వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్ కట్టనున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్‌లో భాగంగా కేబీఆర్ పార్క్ వైపు నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు రెండు లేన్ల అండర్‌పాస్, మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్12 వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.