
సత్తుపల్లి, వెలుగు: భార్యపై హత్యాయత్నం చేసిన కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న పెండ్ర రమేశ్ మంగళవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సబ్ జైల్ గోడ దూకి పారిపోయాడు. అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామానికి చెందిన రమేశ్ గత నెల 3న సబ్ జైలుకు వచ్చాడు.
జైలు లోపల పని చేస్తున్న క్రమంలో 18 అడుగుల ఎత్తు ఉన్న గోడ దూకి వెనక ఉన్న నీలాద్రి అర్బన్ పార్క్ నుంచి పరారైనట్లు జైలు సూపరింటెండెంట్ సోమ రాజు ప్రవీణ్ తెలిపారు. అప్రమత్తమైన సబ్ జైలు అధికారులు, పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టి 3 గంటల్లో ఖైదీని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు జైలును పరిశీలించి ఖైదీ వివరాలు తెలుసుకున్నారు.