రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఆకర్షిస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అక్వేరియంలోని రంగురంగుల చేపలను వీక్షిస్తూ కొత్త అనుభూతిని చెందుతున్నారు. సముద్రం అడుగుభాగంలో జీవించే వింతైన జీవరాశులు కనువిందు చేస్తున్నాయి. ఒకే చోట 550 రకాలు చేపలు సందడి చేస్తున్న దృశ్యం సందర్శకులను ఆకట్టుకుంటోంది.
180 డిగ్రీల కోణంలో ఏర్పాటుచేసిన అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియంలో సముద్ర జాతికి చెందిన అపరిమా, పిరానా, రెడ్‌టెల్, క్యాట్‌ఫిష్, సిల్వర్ షార్క్, అరపైమా వంటి ఎన్నో రకాల చేపలు చురుకుగా ఈత కొడుతున్నాయి. వాటిలో లయన్, రెడ్ టైల్, ఆస్కార్, జిబ్రా, టైగర్, షార్క్ జాతులు..స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి దేశాల్లో లభించే చేపలు .. ప్రస్తుతం ఇక్కడ అందుబాటులోకి రావడంతో సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
సముద్రంలో జీవించే విభిన్న మత్స్యజాతులు ఒకే చోట కనిపించడంపై సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మన పైనుంచే చేపలు వెళ్తున్నాయన్నట్లుగా ఉండటంతో..కొందరు అద్దాల పై నుంచి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని వింత చేపలను...లైవ్ గా చూడడం చాలా సంతోషంగా ఉందంటన్నారు. అండర్ వాటర్ టన్నెల్‌ని పూర్తిగా ఎయిర్ కండిషన్‌తో ఏర్పాటు చేశారు. చల్లని వాతావరణంలో రంగు రంగుల చేపలను చూస్తున్నవారు.. సరికొత్త అనుభూతికి లోనవుతున్నారు. కుటుంబ సమేతంగా మినీ మత్స్యప‌్రపంచాన్ని ఆనందంగా తిలకిస్తున్నారు.
ఇక్కడ అక్వేరియమే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి జాయింట్ వీల్... క్రాఫ్ట్ మేళా... హ్యాండ్ క్రాఫ్ట్ మేళా... మట్టి గాజులు..ఇతర గృహోపకరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన ఆహారపదార్థాలు, వంటకాలతో కూడిన ఫుడ్‌కోర్టులు సందర్శకులకు కొత్త రుచులను అందిస్తున్నాయి.