పాకిస్తాన్ అండర్ వరల్డ్ డాన్ బలాజ్ కాల్చివేత.. పెళ్లి వేడుకల్లో కాల్పులు

పాకిస్తాన్ దేశం.. లాహోర్ సిటీలో పేరుమోసిన అండర్ వరల్డ్ డాన్ గా గుర్తింపు పొందిన బలాజ్ ను కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. గూడ్స్.. వస్తువుల ట్రాన్స్ పోర్ట్ నెట్ వర్క్ యజమానిగా గుర్తింపుతోపాటు.. లాహోర్ సిటీలో క్రిమినల్ రికార్డ్ ఉంది బలాజ్ పై. 2024, ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి.. లాహోర్ సిటీలోని ఓ పెళ్లి వేడుక బరాజ్ లో పాల్గొన్నాడు.. ఈ సమయంలోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. బలాజ్ పై తుపాకులతో కాల్పులు జరిపారు. బంధువులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు.

బలాజ్ చుట్టూ.. ఆయనకు రక్షణగా నిత్యం పది మంది తుపాకులతో సెక్యూరిటీ ఉంటారు. పెళ్లి వేడుక కావటంతో వాళ్లందరూ రిలాక్స్ అయ్యారని.. ఇదే సమయంలో కొందరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు పోలీసులు. బలాజ్ పై కాల్పులు జరిపిన వారిలో ఒకర్ని.. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపినట్లు చెబుతున్నారు. వ్యక్తిగత కక్షలతోనే ఈ దాడి జరిగిందని.. దాడి చేసింది ఎవరు.. కారణాలు ఏంటీ అనేది విచారణ తర్వాత వెల్లడిస్తామని ప్రకటించారు పోలీసులు.

పాకిస్తాన్ దేశంలోనే అండర్ వరల్డ్ డాన్స్ లో ఒకడిగా గుర్తింపు పొందిన బలాజ్ హత్యతో.. పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రతీకార దాడులు జరగొచ్చన్న అనుమానంతో.. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. బలాజ్ ఇటీవలే ముస్లిం లీగ్ నవాజ్ పార్టీలో జాయిన్ అయ్యాడు. 

బలాజ్ కుటుంబానికి అతని తాత హయాం నుంచి రక్త చరిత్ర ఉంది. బలాజ్ తండ్రి ఆరిఫ్ అమీర్ సైతం 2010లో దుండగుల కాల్పుల్లో చనిపోయాడు. ఆ తర్వాత ఆ బాధ్యతలను బలాజ్ టిప్పు తీసుకున్నాడు. లాహోర్ అండర్ వరల్డ్ డాన్స్ లో ఒకరిగా గుర్తింపు పొందాడు.