ఎస్సారెస్పీ నీటి కోసం ఎదురుచూపులు

  • పై నుంచి వరద లేకపోవడంతో నీటి విడుదలపై లేని స్పష్టత 
  •  ఆయకట్టు కింద 2.20 లక్షల ఎకరాలు
  •  ఆందోళనలో రైతులు 

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాకు వరప్రదాయినిగా మారిన శ్రీరాంసాగర్ రెండో దశ నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఖరీఫ్ సీజన్ లో నీటి విడుదల జరుగుతుందా.. లేదా..? అనే విషయంలో ఎవరూ స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎస్సారెస్పీ నీటిపై రైతాంగం ఆధారపడి ఉంది. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల మరింత ఆలస్యం కానుంది. 

2.20 లక్షల ఎకరాల్లో సాగు..

జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 2.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఎస్సారెస్పీ రెండో దశ కింద ఉంది. 2018 నుంచి ఎస్సారెస్పీ ద్వారా ఏటా రెండు పంటలకు సాగునీరందిస్తున్నారు. శ్రీరాంసాగర్ ఎత్తిపోతల ద్వారా ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు మీదుగా జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు చేరుతుంది. అయితే ఎగువ నుంచి వరద లేకపోవడంతో తొలిసారిగా ఆయకట్టుకు నీటిని అందించే పరిస్థితి లేదు. గోదావరి జలాలు వస్తాయన్న ఆశతో రైతులు వరి నార్లు పోసుకొని సిద్ధంగా ఉన్నారు. 

పై నుంచి వరద లేకపోవడంతో..

ఎస్సారెస్పీ ప్రస్తుతం సగం మాత్రమే నిండడంతో ఈ సీజన్ లో పంటలకు సరిపడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి మిడ్ మానేరు అక్కడి నుంచి లోయర్ మానేరు మీదుగా సూర్యాపేట జిల్లాకు అందించాల్సి ఉంది. అయితే, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు 15 రోజులపాటు నీటిని ఎత్తిపోయగా, పైనుంచి వరదలు తగ్గి లిఫ్టింగ్​ నిలిచిపోయింది. దీనితో మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు కు నీటి తరలింపు లేక జిల్లాకు 

సాగునీరు అందించే అవకాశం లేకుండా పోయింది. ఏటా ఆగస్టు 10 వరకు వ్యవసాయానికి సాగునీటిని విడుదల చేస్తారు. ఈనెల5న రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళికా కమిటీ సమావేశమై 15 రోజుల తర్వాత నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ఈ 15 రోజుల్లో ఆశించిన మేర ప్రాజెక్టులోకి వరద నీరు రాలేదు.

చెరువులు వెలవెల..

సూర్యాపేట జిల్లాలో మొత్తం 1225 చెరువులు ఉండగా, 967 చెరువులు ఎస్సారెస్పీ కింద ఉన్నాయి. ఈ చెరువులు సూర్యాపేట, తుంగతుర్తి పరిధిలో ఉండగా, ప్రస్తుతం ఎస్సారెస్పీ కాల్వలపైనే రైతులు ఆధారపడి ఉన్నారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో నాగార్జునసాగర్ నిండడంతో ఈ ప్రాజెక్టుల కింద ఉన్న చెరువులు నిండే అవకాశం ఉంటుంది. 

తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల రైతులకు నీరు అందించే ఎస్సారెస్పీ కాల్వకు నేటికీ నీటి విడుదల జరగలేదు. ఎప్పుడు నీరు విడుదల చేస్తారనే విషయంపై స్పష్టత కూడా లేదు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తే తప్ప ఈ రెండు నియోజకవర్గాల్లో చెరువులు నిండే అవకాశం ఉంది. 

ప్రాజెక్ట్ లో నీళ్లు తక్కువ ఉండడంతో ఆలస్యం 

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 50 శాతం మాత్రమే నీరు నిల్వ ఉంది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడి నీటిమట్టం పెరిగితే సాగునీరు వదలడానికి వీలుంటుంది. ప్రస్తుతం నీటిమట్టం తక్కువగా ఉండడంతో రైతులు తొందరపడి వరి నాట్లు వేయొద్దు. 

-శ్రీకాంత్, ఏఈ, ఎస్సారెస్పీ