దొంగతనం చేశారంటూ బట్టలిప్పించి చెక్ చేయించిన్రు

  • పెద్దపల్లి జిల్లా పూలే స్కూల్‌‌‌‌లో మహిళా స్వీపర్ల ఆందోళన

గోదావరిఖని, వెలుగు : నాలుగు వేల రూపాయలు దొంగతనం చేశారన్న అనుమానంతో మహిళా స్వీపర్లను బట్టిలిప్పించి తనిఖీ చేయించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేశ్‌‌‌‌ నగర్‌‌‌‌లోని జ్యోతిబా పూలే రెసిడెన్సియల్‌‌‌‌ స్కూల్‌‌‌‌లో ఈ ఘటన జరిగింది. ఈ అవమానంతో స్వీపర్లు మంగళవారం రాత్రి స్కూల్‌‌‌‌లో  ఆందోళన చేపట్టారు. పోలీసు‌‌ కేసు పెట్టకుండా తమతో పసుపునీళ్లు తాగించారని, లేని నింద మోపారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

స్కూల్‌‌‌‌లో చదివే పిల్లల కోసం కాస్మోటిక్స్‌‌‌‌  కొనుగోలు చేసేందుకు గెస్ట్‌‌‌‌  టీచర్‌‌‌‌  శ్రీలేఖ తన హ్యాండ్‌‌‌‌బ్యాగ్‌‌‌‌లో రూ.4 వేలు తీసుకునివచ్చి పక్కన పెట్టి ప్రేయర్‌‌‌‌కు  వెళ్లింది. ఆమె వచ్చేలోపు డబ్బు మాయమైంది. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్‌‌‌‌  మంజుల.. స్టూడెంట్లు, టీచర్లు, స్వీపర్ల బ్యాగ్‌‌‌‌లన్నింటినీ తనిఖీ చేయించారు. డబ్బు దొరకకపోవడంతో స్టాఫ్‌‌, టీచర్లు, స్వీపర్లతో మంత్రించిన పసుపునీళ్లు తాగించారు.

సాయంత్రం 6.30 గంటలకు స్వీపర్లు ఇంటికెళ్లే సమయంలో స్కూల్‌‌‌‌లో  ఇన్ చార్జి ప్రిన్సిపాల్‌‌‌‌ రమ్యసుధ.. లేడీ వాచ్‌‌మెన్‌‌‌‌తో కలిసి స్వీపర్ల బట్టలు ఇప్పించి చెక్‌‌‌‌  చేయించింది. తమను అవమానించారని స్వీపర్లు రాత్రి 9.30 గంటల వరకు స్కూల్‌‌‌‌లోనే బైఠాయించారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్‌‌‌‌  మంజుల, పోలీసులు స్కూల్‌‌‌‌కు వెళ్లి మహిళా స్వీపర్లకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించి ఇంటికెళ్లారు.