మెదక్ సభలో తీన్మార్ మల్లన్న
మెదక్, వెలుగు : కేసీఆర్ కేబినెట్లో చాలా మంది చదువుకోని మంత్రులే ఉన్నారని తీన్మార్ మల్లన్న విమర్శించారు. గురువారం మెదక్‌లోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మంత్రులు దయాకర్‌రావు 5వ తరగతి, సత్యవతి రాథోడ్3వ తరగతి మాత్రమే చదివారన్నారు. మరో మంత్రి మల్లారెడ్డి రెండు సంతకాలు పెడితే ఒకటికి ఒకటి ట్యాలీ కావని ఎద్దేవా చేశారు. స్కూల్ స్టూడెంట్స్‌కు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పరీక్ష పెడితే ఎవరు పాసైతరో తెలుస్తదన్నారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ఎమ్మెల్యే ఏమి చదువుకోలేదని, పటాన్చెరు ఎమ్మెల్యే 8వ తరగతి, అందోల్ఎమ్మెల్యే 12వ తరగతి మాత్రమే చదివారన్నారు. ఇల్లు బాగుపడాలంటే ఇల్లాలు చదువుకుని ఉండాలంటారని, అలాంటిది నియోజకవర్గం బాగుపడాలంటే ఎమ్మెల్యేకు చదువు అవసరం లేదా అని ప్రశ్నించారు. గురుకులాల్లో తన మనుమడు తినే సన్న బియ్యం అన్నమే పెట్టేలా చర్యలు తీసుకున్నామని సీఎం చెప్పారని, కానీ, పురుగుల అన్నం, బల్లి పడిన చారు పెడుతున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పది రోజులు గురుకులాల్లో తింటే బతుకుతరా అని ప్రశ్నించారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాకు చెందిన యువకులు తీన్మార్ టీంలో చేరగా మల్లన్న వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్దాసరి భూమన్న, లీగల్ అడ్వైజర్ శరత్‌కుమార్, ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ మహేశ్, మెదక్ జిల్లా కన్వీనర్ నగేశ్, కో కన్వీనర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
మూడు రోజుల్లో రీ ఎస్టిమేషన్ పంపుతాం..
జహీరాబాద్ మున్సిపాలిటీ ఎస్ డీఎఫ్ ఫండ్స్ కు సంబంధించిన అంచనాలు రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి పంపుతాం. ఇదివరకు ప్రపోజల్స్ పంపించగా వార్డుల వారీగా ఎస్టిమేషన్స్ పంపాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు సూచించారు. అందుకే ఆలస్యమైంది. సీఎం మంజూరు చేసిన ఎస్డీఎఫ్ రూ.50 కోట్లు పై ఆఫీసర్ల పరిధిలోనే ఉన్నాయి. ప్రతిపాదనలకు అనుమతులు రాగానే పనులు స్టార్ట్ చేస్తాం.
- సుభాష్ రావు దేశ్ ముఖ్,
జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్
‘రూర్బన్’ పనులు భేష్
నారాయణ్ ఖేడ్, వెలుగు: ర్యాకల్ క్లస్టర్ లో రూర్బన్ పనుల పురోగతి చాలా బాగుందని కేంద్ర గ్రామీణ అభివృద్ధి సంయుక్త కార్యదర్శి స్మృతి శరన్, ఉప కార్యదర్శి నివేదిత ప్రసాద్ రూర్బన్ కన్సల్టెంట్ బిహు మహాపాత్ర అన్నారు. గురువారం నారాయణఖేడ్ మండల పరిధిలోని ర్యాకల్ క్లస్టర్ లో రూర్బన్ పథకంలో భాగంగా నిజాంపేట్, జూకల్ హనుమంతరావుపేట్, ర్యాకల్, నారాయణఖేడ్, గంగాపూర్ లలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్ కింద చేపట్టిన వివిధ పనులు, హెల్త్ సబ్ సెంటర్స్, వెజిటేబుల్ పండాల్స్, ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్ భవనం, హార్టికల్చర్ లో పందిరి సాగు పంటలను, ర్యాకల్ గ్రామంలో కొత్గా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ సెంటర్ ను పరిశీలించారు. వారి వెంట అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జడ్పీటీసీ ఉన్నారు.
నేషనల్ అవార్డుకు పోటీ పడాలి
సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట రూరల్, వెలుగు : నేషనల్ అవార్డుల కోసం జిల్లాలోని అన్ని పంచాయతీలు పోటీ పడాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం పంచాయతీ నేషనల్ అవార్డు కోసం గ్రామ పంచాయతీల నుంచి దరఖాస్తు చేసుకోవడంపై మండల స్థాయి అధికారులకు కలెక్టర్ ఆఫీస్ లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతూ అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాయన్నారు. సమర్థవంతంగా పని చేయడానికి అవార్డులు, ప్రశంసలు ఎంతో ప్రోత్సాహం అందిస్తాయని తెలిపారు. ఎంపీడీవో, ఎంపీవో, ఎంఈవో, సీడీపీవో, ఈజీఎస్ ఏపీవో, ఐకేపీ ఏపీఎం, మెడికల్ ఆఫీసర్లు పొరపాట్లకు తావులేకుండా ఆయా అంశాలకు క్లుప్తంగా జవాబులు పొందుపర్చాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఆర్డీవో గోపాల్ రావు, జడ్పీ సీఈవో రమేశ్, డీపీవో దేవకీదేవి, డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ కాశీనాథ్, డీడబ్ల్యూవో రామ్ రెడ్డి పాల్గొన్నారు.
మర్డర్ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
మెదక్, వెలుగు : ఈనెల 5న మెదక్‌పట్టణంలో జరిగిన రాచపల్లి బ్రహ్మచారి (37) హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు. గురువారం డీఎస్పీ ఆఫీస్‌లో కేసు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. మెదక్ పట్టణం పిట్లంబేస్ వీధికి చెందిన బ్రహ్మచారి 2018లో తన చిన్నమ్మ కూతురును ప్రేమ పేరుతో వేధించారని అదే ప్రాంతానికి చెందిన లింగంపేట రంజిత్ మీద మెదక్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కేసును ఉపసంహరించుకోవాలని బ్రహ్మచారిని రంజిత్ పలుమార్లు అభ్యర్థించాడు. అందుకు ‘నీ తల్లిదండ్రులు నా కాళ్లు పట్టుకోవాలి’ అని బ్రహ్మచారి అన్నాడు. దీంతో విసుగు చెందిన రంజిత్ ఈ విషయాన్ని తన ఫ్రెండ్ వట్పల్లి నవీన్ అలియాస్ నిఖిల్ కు చెప్పి బాధపడ్డాడు. బ్రహ్మచారి తన ప్రపోజల్ అంగీకరించకుంటే చంపేస్తానని అన్నాడు. ఈ క్రమంలో 5న రాచపల్లి బ్రహ్మచారి, రంజిత్ మరో వ్యక్తి కిట్టు కలిసి మద్యం తాగారు. కిట్టుకు ఫోన్ రావడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత నవీన్ కు రంజిత్ ఫోన్ చేసి ఎల్‌ఐసీ ఆఫీస్ దగ్గర ఉన్న కల్లు దుకాణానికి రావాలని కోరాడు. అతడు రాగానే మరింత మద్యం కొనుక్కొని ముగ్గురూ పసుపులేరు వాగు ఒడ్డున ఉన్న ఎల్లమ్మ ఆలయం వెనుక వైపునకు వెళ్లి తాగారు. బ్రహ్మచారి మత్తులోకి జారుకుని పడుకోగానే రంజిత్ బండ రాయితో అతడి తలపై కొట్టి చంపేశాడు. మెదక్ టౌన్, రూరల్ సీఐల ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి మర్డర్ కేసును ఛేదించి రంజిత్, నవీన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు.
రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పాదయాత్ర
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు సంఘీభావంగా గురువారం ఉమ్మడి మెదక్ జిల్లాలో పలుచోట్ల పార్టీ స్థానిక లీడర్లు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట నుంచి నిజాంపేట వరకు రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన యాత్రకు డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మ్యాడం బాలకృష్ణ, టీపీసీసీ సెక్రటరీ సుప్రభాత రావు హాజరయ్యారు. కౌడిపల్లి నుంచి జగ్గంపేట వరకు చేపట్టిన యాత్రలో టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే ఆల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎనిమిదేళ్ల పాలనలో చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మీద విసుగు చెంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు.
- వెలుగు, నెట్వర్క్
ఆసరా పింఛన్లు పంపిణీ
మెదక్ (రేగోడ్), వెలుగు : రేగోడ్ మండలంలో గురువారం అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆసరా పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణకు ఎంతో చేశారని, మరింత చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు. బీజేపీ మాటలు నమ్మవద్దని సూచించారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కోహెడ(హుస్నాబాద్)వెలుగు : పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. గురువారం హుస్నాబాద్‌లో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అంతకుముందు పట్టణంలో రూ.40 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.
అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు
చేర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకూ అందుతున్నాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గురువారం చేర్యాల, దూల్మిట్ట మండలాల్లోని ఆకునూరు, జాలపల్లి గ్రామాల్లో బీసీ కమ్యూనిటీ హాలు, 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్‌కు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అభివృద్ధి జరుగుతున్న తీరును గమనించకుండా ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు అవినీతి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అనంతరం తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి దూల్మిట్ట మండలంలోని గ్రామాల చెరువులకు కాల్వల ద్వారా నీరు అందిస్తున్న క్రమంలో సీఎం కేసీఆర్ ఫొటోకు పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు బీ.క్రిష్ణారెడ్డి, ఉల్లంపల్లి కర్ణాకర్, జడ్పీటీసీ మల్లేశం, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
మెట్ల మీద పడి యువకుడు మృతి
దుబ్బాక, వెలుగు: వినాయక నిమజ్జన వేడుకల్లో దారుణం జరిగింది. మెట్ల మీద పడి ఓ యువకుడు మృతి చెందాడు.ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. గ్రామంలో సఫాయి కార్మికులుగా పని చేస్తున్న మన్నె రాజవ్వ, మల్లేశం కుమారుడు బాలకృష్ణ(22) ఫ్రెండ్స్‌తో కలిసి బుధవారం రాత్రి స్థానిక చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్లాడు. చెరువు వద్ద ఉన్న బతుకమ్మ మెట్లపై బాలకృష్ణ జారి పడడంతో ముక్కుకు దెబ్బ తగిలింది. స్థానికులు అతడిని సిద్దిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కేసీఆర్ కుటుంబం భూముల దందా చేస్తోంది
కొండాపూర్, వెలుగు : నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భూముల దందా చేస్తోందని బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ ఆరోపించారు. గురువారం పార్టీ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీలో పాల్గొని గిర్మాపూర్ తోగర్ పల్లి, కొండాపూర్, దొబ్బకుంటలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల నయా నిజం పాలనతో పబ్లిక్ అరిగోస పడుతున్నారన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు బాగుపడాలంటే బీజేపీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు శ్రద్ధ పెట్టాలి
- మెదక్ అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ టౌన్, వెలుగు : విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మెదక్ అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. గురువారం ఆమె చాంబర్లో డీఆర్డీవో పీడీ శ్రీనివాస్, ఐసీడీఎస్‌పీడీ బ్రహ్మాజీ, యునెస్కో జిల్లా కో-ఆర్డినేటర్ గంగాధర్‌తో కలిసి ‘క్రీములు కాదు.. ఆహారం తినండి’ అనే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మెదక్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కాలేజీలను ఆమె సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ఫుడ్ క్వాలిటీ, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వంట గది వెనుక నిలిచిన మురుగు పోయేలా చూడాలని మున్సిపల్ కమిషనర్శ్రీహరికి సూచించారు. క్లాస్ రూమ్‌లను సందర్శించి స్టూడెంట్స్‌ను పలు ప్రశ్నలు అడిగారు. వారికి పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు.
విషజ్వరాలు ప్రబలకుండా చూడాలి
జిల్లా వ్యాప్తంగా డెంగీ, విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ గురువారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఏ మాత్రం జ్వరం వచ్చినా వెంటనే డాక్టర్లను సంద్రించాలని సూచించారు.
నీటి సంరక్షణకు కృషి చేస్తే అవార్డులు
సమాజంలో నీటి సంరక్షణకు విశేష కృషి చేస్తున్న వ్యక్తులకు, సంస్థలకు నాలుగో నేషనల్ వాటర్ అవార్డులు ఇవ్వడానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఎంట్రీలను ఆహ్వానిస్తోందని అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 11 రకాల కేటగిరీలలో ఎంట్రీలను ఆహ్వానిస్తోందని, ఒక్కో విభాగంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ అవార్డులను ఎంపిక చేసి నగదు పురస్కారాలు ఇవ్వనుందని పేర్కొన్నారు. జిల్లాకు అధిక సంఖ్యలో అవార్డులు తీసుకురావాలని అధికారులను కోరారు. ఇతర వివరాల కోసం www.awards.gov.inవెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.