రాయికల్, వెలుగు: కేసీఆర్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వక, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త పెన్షన్లు రాలేదని, ఉద్యోగాలు రాలేదని, రేషన్‌కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. శుక్రవారం రాయికల్ పట్టణంలో సకల జనుల విజయ సంకల్ప సభలో జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను వంచించి పాలన చేస్తున్నారన్నారు.
రూ.500 కోట్లతో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీ నేటికీ అమలుకాలేదన్నారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. ఇప్పటికీ దేశ ప్రజలకు ప్రధాని మోదీ రేషన్‌బియ్యం ఉచితంగా అందజేస్తున్నారన్నారు. జగిత్యాలలో బీసీ బిడ్డ బోగ శ్రావణికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు, లీడర్లు పడాల తిరుపతి, మదన్‌మోహన్, డాక్టర్ రాజారెడ్డి, అశోక్, వేణు, భాగ్యలక్ష్మి, అంజలి పాల్గొన్నారు.