- అడ్డుకున్న పోలీసులు.. ఇరువర్గాల మధ్య తోపులాట
- లాఠీ చార్జ్చేసిన పోలీసులు.. లైవ్ కవరేజ్ ఇస్తున్న ఓ రిపోర్టర్‌పైనా దాడి
- ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు
ఓయూ, వెలుగు: డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ ఓయూలో నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రూపు–1,- 2 పోస్టులు పెంచాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలని, అప్పటి వరకు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం స్టూడెంట్లు, నిరుద్యోగులు క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. ఈ విషయంపై ప్రొఫెసర్ కోదండరాం స్పందించాలని కోరుతూ ఆయన ఇంటి ముట్టడికి పిలుపునివ్వగా, పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్చేశారు. ఓ స్టూడెంట్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఓయూ మెయిన్ లైబ్రరీ వద్ద ఆందోళనను లైవ్కవరేజ్చేస్తున్న ఓ న్యూస్‌చానెల్ రిపోర్టర్ నూ వదల్లేదు. చొక్కా పట్టుకుని కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులను అరెస్టు చేయడం మీడియా స్వేచ్ఛను కాలరాయడమేనని జర్నలిస్టు నాయకులు సతీశ్‌రెడ్డి, రామకృష్ణ మండిపడ్డారు.