సర్కారీ కొలువు ప్రతి నిరుద్యోగి స్వప్నం. సమాజంలో గౌరవంతో పాటు ఉజ్వల భవిత, సుస్థిర కెరీర్ ప్రభుత్వ ఉద్యోగంతోనే సాధ్యం. అందుకే బీటెక్ వంటి టెక్నికల్ కోర్సులు మొదలు సంప్రదాయ బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ అభ్యర్థులందరు ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం ఆయా రిక్రూట్‌మెంట్ సంస్థల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే తెలంగాణలో గ్రూప్స్‌తో పాటు టెట్, డీఎస్సీ, డీఏవో షెడ్యూల్ విడుదల చేయడంతో అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కారీ కొలువు కలను నిజం చేసుకునే మార్గాల గురించి తెలుసుకుందాం..
లక్ష్యం నిర్దేశించుకోవడం ఒక ఎత్తయితే.. దాన్ని చేరుకునే దిశగా అడుగులు వేయడం అంతకంటే ఎంతో ముఖ్యం. ప్రధానంగా లక్షల్లో పోటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవాలనుకుంటే.. అందుకు తగ్గ పటిష్ట ప్రిపరేషన్ ప్రణాళికతో ముందుకు సాగాలి అంటున్నారు నిపుణులు.
వ్యూహంతోనే విజయం: బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో అనేక ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు పోటీ పడే అవకాశం ఉంది. అదే విధంగా పలు నియామక పరీక్షల్లో ఒకే విధమైన సిలబస్ అంశాలు ఉంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఉమ్మడి ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి. ఫలితంగా ఒకే సమయంలో పలు పరీక్షలకు సన్నద్ధత పొందొచ్చు.
ఎగ్జామ్ ఏదైనా సబ్జెక్ట్ కామన్: పరీక్ష ఏదైనా జనరల్ స్టడీస్ కామన్ పేపర్ ఉంటుంది. ముఖ్యంగా గ్రూప్స్ లాంటి పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అమలవుతున్న పథకాలు, ఆయా రాష్ట్రాల ఆర్థిక విధానాలు, పథకాలు –లబ్ధిదారులు; లక్షిత వర్గాలు, సామాజిక అంశాలు, సంస్కృతి తదితర అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.
స్పెషల్ టాపిక్స్‌పై ఫోకస్: అభ్యర్థులు జనరల్ అవేర్‌నెస్ తర్వాత.. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి.. మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజెస్, యావరేజేస్, రేషియో–ప్రపోర్షన్, ప్రాఫిట్–లాస్, సింపుల్– కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్–వర్క్, టైమ్–డిస్టెన్స్, పర్ముటేషన్స్ –కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, మిక్షర్ అండ్ అలిగేషన్స్, పార్టనర్ షిప్‌పై దృష్టిపెట్టాలి. భాగహారాలు, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక అంశాలను నోటితో గణించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సింప్లిఫికేషన్స్‌కు బోడ్‌మాస్ రూల్స్‌ను అనుసరించాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలు గుర్తుంచుకోవాలి. డేటా ఇంటర్‌ప్రెటేషన్, మెంటల్ ఎబిలిటీలో.. టేబుల్స్, చార్ట్‌లు, గ్రాఫ్‌ల ద్వారా సమాచారమిస్తూ ప్రశ్నలు అడుగుతారు. వీటిని సాధించాలంటే.. పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోలతో ఉండే భిన్నమైన ప్రశ్నలు సాధన చేయాలి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్: గ్రూప్–1 నుంచి సబార్డినేట్ సర్వీసుల పరీక్షల వరకు.. ప్రతి పరీక్షలోనూ కచ్చితంగా ఉండే సబ్జెక్ట్ ఇంగ్లీష్. దీనికోసం అభ్యర్థులు బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్‌పైనా దృష్టిపెట్టాలి. స్పెల్లింగ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, వొకాబ్యులరీ, రీ రైటింగ్ ద సెంటెన్స్, సెంటెన్స్ రీ–అరేంజ్‌మెంట్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ప్రెసిస్ రైటింగ్, బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. టెన్సెస్, సెంటెన్స్ ఫార్మేషన్, యాక్టివ్–ప్యాసివ్ వాయిస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ వంటి ముఖ్యాంశాలపై దృష్టి సారించాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబ్యులరీల్లో పూర్తి స్థాయిలో నైపుణ్యం పొందాలి.
డిస్క్రిప్టివ్‌గానే అప్రోచ్: ప్రస్తుతం మారుతున్న పేపర్ ప్యాటర్న్‌కు పరీక్ష ఏదైనా.. డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగించడం మేలు చేస్తుంది. ముఖ్యంగా గ్రూప్–1 వంటి ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలోని పరీక్షలు; అదే విధంగా పూర్తిగా ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉండే గ్రూప్–2, 3, 4, ఇతర పోటీ పరీక్షలకు ఈ విధానాన్ని అనుసరించాలి. పరీక్ష ఏదైనా.. డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో ముందుకు సాగితే.. ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సులభంగా సమాధానాలు ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. ఇది రెండు రకాల పరీక్షల్లోనూ విజయానికి దోహదపడుతుంది.
ఉమ్మడి అంశాలపై పట్టు: ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. ముందుగా సిలబస్‌ను సమగ్రంగా అవగాహన చేసుకోవాలి. ఇందులో కామన్ టాపిక్స్‌ను గుర్తించాలి. ప్రస్తుతం ఆయా పరీక్షలను గమనిస్తే.. అన్నింటిలోనూ జనరల్ నాలెడ్జ్/జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ సబ్జెక్టులు కామన్‌గా కనిపిస్తున్నాయి.
పరీక్షల్లో వీటికి ఎక్కువ వెయిటేజీ ఉంటోంది. వీటితోపాటు జనరల్ స్టడీస్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ, అంతర్జాతీయ, జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలతో సిలబస్ ఉంటోంది. వీటిపై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. ఉమ్మడి టాపిక్స్ సిలబస్‌కు, ప్రత్యేక టాపిక్స్ సిలబస్‌కు సమయం కేటాయించుకునేలా పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలి. ఉమ్మడి సిలబస్‌తో పలు పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులు..ఆయా పరీక్షల తేదీలకు అనుగుణంగా ముందుకుసాగాలి. తొలుత పరీక్ష జరిగే పోస్ట్‌లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్ష తేదీకి కనీసం నెల రోజుల ముందు నుంచీ ఆ పరీక్ష ప్రిపరేషన్‌కే సమయం కేటాయించాలి.
సొంత నోట్స్.. ఎంతో మేలు: ఆయా పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు.. ఎప్పటికప్పుడు తాము చదివిన టాపిక్స్ నుంచి ముఖ్యమైన అంశాలతో షార్ట్ నోట్స్ రాసుకోవాలి. సొంత నోట్సు రివిజన్ సమయంలో చాలా కీలకంగా మారుతుంది. వేగంగా రివిజన్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
మోడల్ పేపర్స్ ప్రాక్టీస్: అభ్యర్థులు నమూనా పరీక్షలకు హాజరై.. తమ బలాలు, బలహీనతలను గుర్తించాలి. దీని ఆధారంగా తక్కువ మార్కులు వస్తున్న టాపిక్స్, అందుకు కారణాలను గుర్తించి.. వాటి ప్రాధాన్యతకు అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. ఆయా సిలబస్ అంశాలకు పరీక్షలో వెయిటేజీ ఎక్కువగా ఉంటే.. వాటి ప్రిపరేషన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
కంబైన్డ్ ప్రిపరేషన్: ఒకే సమయంలో పలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు.. అనుసంధాన వ్యూహాన్ని అనుసరించాలి. అన్ని పరీక్షలలోనూ కామన్ టాపిక్స్‌ను గుర్తించి.. వాటిని ఏకకాలంలో పూర్తి చేసే విధంగా వ్యవహరించాలి. ప్రతి పరీక్షలోనూ ఆయా సబ్జెక్ట్‌ల మధ్య ఉన్న పోలికలను గుర్తిస్తూ.. వాటిని కూడా అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగిస్తే విజయం సాధించొచ్చు.
లక్ష్యం ఉన్నతం
ఉమ్మడి సిలబస్ అవకాశాన్ని అనుకూలంగా చేసుకుంటూ.. పోటీ పరీక్షలకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ఉన్నత స్థాయి పరీక్షను తమ తొలి గమ్యంగా నిర్దేశించుకోవాలి. దానికి అనుగుణంగా ఆ స్థాయి ప్రిపరేషన్ సాగించాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్–1 లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తే.. ఆ తర్వాత స్థాయిలోని గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4లను సులభంగా సాధించే వీలుంది. అదే విధంగా జాతీయ స్థాయిలోని అత్యున్నత పరీక్ష సివిల్ సర్వీసెస్‌ను లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే.. యూపీఎస్‌సీ నిర్వహించే ఇతర పోటీ పరీక్షల్లో, రాష్ట్రస్థాయి గ్రూప్స్ పరీక్షల్లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు.