త్వరలో నిరుద్యోగ భృతి.. రేపోమాపో కేసీఆర్​ అనౌన్స్​మెంట్

  • ఇప్పటికే లక్షా 31 వేల జాబ్స్​ భర్తీ చేసినం: కేటీఆర్
  • 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తం
  • ప్రతిపక్ష నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరని ఫైర్​
  • టీఆర్​వీకేఎస్​లో విలీనమైన తెలుగునాడు విద్యుత్​ విభాగం

కాంగ్రెస్​, బీజేపీ నేతలకు అధ్యక్ష పదవులు కేసీఆర్​ భిక్షే

రాష్ట్ర ప్రభుత్వంపై, టీఆర్‌‌ఎస్‌‌ పార్టీపై టీ పీసీసీ, టీ బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నరు. వారికి పదవులు సీఎం కేసీఆర్‌‌ పెట్టిన భిక్ష. తెలంగాణ తెచ్చింది కేసీఆరే. తెలంగాణ వచ్చింది కాబట్టే టీ పీసీసీ, టీ బీజేపీ నేతలకు పార్టీ అధ్యక్ష పదవులు వచ్చినయ్. తెలంగాణ వచ్చిన తర్వా త ఇప్పటివరకు
టీఎస్‌‌పీఎస్సీ ద్వారా వేల ఉద్యోగాలు భర్తీ చేసినం. జెన్‌ కో, ట్రాన్స్‌‌కో, సింగరేణి.. ఇలా అన్ని రంగాల్లో వేల ఉద్యోగాలు ఇచ్చినం.

– కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగ భృతిపై టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్‌‌ కీలక ప్రకటన చేశారు. కొద్ది రోజుల్లోనే నిరుద్యోగ భృతి ఇస్తామని, దీనిపై రేపోమాపో సీఎం కేసీఆర్‌‌ ప్రకటన చేస్తారని వెల్లడించారు. త్వరలోనే  50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఇప్పటికే లక్షా 31 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆయన చెప్పారు. గురువారం తెలుగునాడు విద్యుత్‌‌ కార్మిక విభాగం టీఆర్‌‌వీకేఎస్‌‌లో విలీనమైంది. తెలంగాణ భవన్‌‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌‌ మాట్లాడారు. ఆరేండ్లలో రాష్ట్ర  ప్రభుత్వం వివిధ రంగాల్లో పలు విజయాలను సాధించిందని వివరించారు. టీఆర్‌‌ఎస్‌‌పై అవాకులు చెవాకులు పేలుతున్న వారికి తగిన రీతిలో సమాధానం చెప్పాలని, వారి ఆరోపణలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేటీఆర్‌‌ వేదికపైకి వస్తున్న సమయంలో సభలోని  టీఆర్‌‌ఎస్‌‌ నాయకులు ‘‘కాబోయే సీఎం కేటీఆర్‌‌ జిందాబాద్‌‌’’ అంటూ నినాదాలు చేశారు.

రాష్ట్రంలో 945 గురుకులాలు ఏర్పాటు చేశామని కేటీఆర్​ చెప్పారు. ‘‘ఇక్కడి స్టూడెంట్లు విదేశాల్లో చదువుకునేందుకు ప్రభుత్వం స్కాలర్​షిప్​లు ఇస్తున్నది. రేపోమాపో నిరుద్యోగ భృతిని సీఎం ప్రకటిస్తరు. టీఆర్‌‌ఎస్‌‌పై అవాకులు చెవాకులు పేలుతున్న వారికి తగిన రీతిలో సమాధానం చెప్పాలి. వారి ఆరోపణలను తిప్పికొట్టాలి” అని అన్నారు.

కరెంట్​ సమస్య లేదు.. భవిష్యత్తులో పోదు

రాష్ట్రంలో కరెంట్‌‌ సమస్యలేదని, భవిష్యత్‌‌లో కరెంట్‌‌ పోదని చెప్పగలనని కేటీఆర్​ అన్నారు. ‘‘తెలంగాణ ఏర్పడితే చీకట్లు అమలుకుంటాయని, అంధకారమయం అవుతుందని శాపనార్థాలు పెట్టారు. కానీ ఈ రోజు రాష్ట్రంలో విద్యుత్‌‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి” అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాలకు కరెంట్‌‌ కష్టాలు ఉండేవని, వారానికి మూడు రోజులు పవర్‌‌ హాలిడేలు ఉండేవని చెప్పారు. 7 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యం నుంచి 16 వేల మెగావాట్లకు పెంచామని, సోలార్‌‌ పవర్‌‌ జనరేషన్‌‌లో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామన్నారు. కరెంట్‌‌ వాడకంలో అన్ని రాష్ట్రాల్లోనూ తెలంగాణ ముందంజలో ఉందని పేర్కొన్నారు. పరిశ్రమలకు 24 గంటల కరెంట్‌‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని కేటీఆర్​ అన్నారు. విద్యుత్‌‌ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర సంపదను కేసీఆర్​ పెంచారు

కాళేశ్వరం ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడం వెనుక విద్యుత్‌‌ ఉద్యోగుల కృషి ఉందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని ఎక్కువ భూభాగానికి సాగు నీళ్లు ఇస్తున్నామని, రాష్ట్రం ధాన్య భాండాగారంగా నిలిచిందని చెప్పారు. రాష్ట్ర సంపదను సీఎం కేసీఆర్‌‌ ఎంతో పెంచారని, పెరిగిన ఆదాయాన్ని అన్నిరంగాల అభివృద్ధికి వెచ్చిస్తున్నామన్నారు. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు.