
షాద్ నగర్, వెలుగు: ఎందరో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణపై సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం పెత్తనం కొనసాగిస్తూ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో శనివారం షాద్ నగర్, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన బీజేపీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 25న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ మార్చ్ కు సంబంధించిన పోస్టర్ ను ప్రభాకర్ తో పాటు మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ, రాష్ట్ర నాయకుడు నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్‌పాలనలో నిరుద్యోగులకు మొదటి నుంచి మోసం జరుగుతోందన్నారు. పేపర్ లీక్ కారణంగా 30 లక్షల నిరుద్యోగుల జీవితాలు ఆగమయ్యాయన్నారు. ఈ పరిస్థితి తెచ్చిన కేసీఆర్‌కు నిరుద్యోగ మార్చ్‌తో గుణపాఠం చెబుదామని ప్రభాకర్పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ నేత దేపల్లి అశోక్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ డా.విజయ్‌కుమార్, అందె బాబయ్య, మిథున్ రెడ్డి పాల్గొన్నారు.