గ్రేటర్​లో టీఆర్ఎస్​కు నిరుద్యోగులు షాక్ ఇస్తరు!

మన ఉద్యోగాలన్నీ ఆంధ్రోళ్లు త‌న్నుకుపోయారని, తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, మన ఉద్యోగాలు మనకే అని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 2014లో జరిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఉద్య‌మ పార్టీ టీఆర్ఎస్ గెలిస్తే నెల రోజుల్లోపు రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో నిరుద్యోగులు ప్రాణాలకు తెగించి పోరాటాలు చేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ మాటలు నమ్మి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. కానీ, రెండో ద‌ఫా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా.. నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదు. ఇప్పటికైనా ఖాళీల భర్తీ మొదలుపెట్టకపోతే గ్రేటర్‌‌ ఎన్నికల్లో నిరుద్యోగులు టీఆర్‌‌ఎస్‌కు షాక్‌ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఉద్యోగాల సంఖ్య పెరగలేదు

మొత్తం ఉద్యోగాల సంఖ్య ప్రకటించడంలోనే ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 1976లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య
7,75,900. 1993 నాటికి ఈ సంఖ్య 13,60,540కి పెరిగింది. 2001 లెక్కల ప్రకారం 14,82,832 మంది సిబ్బంది ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వానికి పంపిన సమాచారంలో ఉంది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగే వరకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల సంఖ్యను పెంచారు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 15 లక్షల నుంచి 16 లక్షల వరకు అన్ని కేటగిరీల ఉద్యోగాలు ఉన్నట్లు అంచనా. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో శాశ్వత ఉద్యోగాలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కలిపి 6.4 లక్షల మంది ఉంటారు. ఇందులోనే రిటైర్మెంట్ ఖాళీలు కూడా కలిసి ఉన్నాయి. ప్రస్తుతం శాశ్వత ఉద్యోగాలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కలిపి నాలుగు లక్షల మంది వరకూ ఉన్నట్లు అంచనా. ఒకవైపు జనాభా పెరుగుతోంది. బడ్జెట్ పెరుగుతోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతున్నాయి. కానీ దానికి తగ్గట్టు ఉద్యోగాల సంఖ్య మాత్రం పెరగడం లేదు. కనీసం ఖాళీల భర్తీకి కూడా చర్యలు తీసుకోవడం లేదు.

ఎక్కడ చూసినా ఖాళీలే

రాష్ట్రంలో లక్షా, ఏడు వేల ఖాళీలు ఉన్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ సంఘాలు 1,60,000 ఖాళీలు ఉన్నట్లు చెబుతున్నాయి. నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు రెండు లక్షలు ఖాళీగా ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనా రెండు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయన్నది నగ్న సత్యం. ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లినా ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి. అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి. 90% ప్రభుత్వ బడుల్లో టీచర్లే కాదు గంట కొట్టే అటెండర్లు కూడా లేరు. హాస్టల్ లో వార్డెన్లు, వంట మనుషులు, వాచ్మెన్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల్లో ఇంజనీర్లు లేరు. రెవెన్యూ ఆఫీసుల్లో సర్టిఫికెట్లు ఇచ్చే వారు లేరు. ఖాళీ పోస్టులను టైమ్‌కి భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ శాఖలు నిర్వీర్యమై పోయాయి. గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో కూడా డాక్టర్లు, నర్సులు లేరు. రాష్ట్రంలోని 72 డైరెక్టరేట్లలో సగం పోస్టులు ఖాళీగా ఉండటంతో అభివృద్ధి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు దెబ్బతింటున్నాయి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభం లాంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను యువతరంతో నింపినప్పుడే ఆర్థిక, పాలనా వ్యవస్థ బలపడుతుంది.

నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు

ఇంటికో ఉద్యోగం హామీపై గడికో మాట మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రులు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ బుకాయించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో కోటి 13 లక్షల కుటుంబాలు ఉన్నాయని, ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమా? అంటూ త‌ప్పించుకున్నారు. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది? నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాదా? దాదాపు 1,500 మంది నిరుద్యోగులు, విద్యార్థులు ఎందుకు బలిదానాలు చేసుకున్నారని నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 11 లక్షలు. ప్రభుత్వ శాఖల్లో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటో?

ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగులు
తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరేండ్లు గడిచినా నిరుద్యోగ సమస్య తీరలేదు. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఒత్తిడికి గురై ఇప్పటికే అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పీజీలు, డాక్టరేట్లు తెచ్చుకున్న వాళ్లు కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇకనైనా నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ చేపట్టాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ పై ఉంది. ఇప్పటికైనా ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్ ను ప్రకటించాలి. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్​ ఉద్యోగాల పద్ధతిని పూర్తిగా వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే పర్మినెంట్ పద్ధతిలోనే భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనూ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చడం లేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదు. సమర్థులైన, ప్రతిభావంతులైన యువతకు ఉద్యోగాలు కల్పిస్తే ఉత్సాహంతో, అంకితభావంతో పనిచేస్తారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారు. ఉద్యోగాల భర్తీలో ఇంకా ఇదే నిర్లక్ష్యం కొనసాగిస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిరుద్యోగ యువత తమ ఓటు ద్వారా టీఆర్ఎస్ సర్కారుకు షాక్​ ఇస్తరు? ఇప్పటికైనా సర్కారు మేల్కొని ఉద్యోగాల భర్తీని చేపట్టాలి. లేదంటే నిరుద్యోగులు, విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదు.

మన్నారం నాగరాజు, లోక్ స‌త్తా పార్టీ

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

For More News..

తెలంగాణ కోసం మరో ఉద్యమం తప్పదు

హెచ్‌‌‌‌ఐవీ వ్యాప్తిలో రెండో స్థానంలో తెలంగాణ

గ్రేటర్ వార్: ఒక్కో బూత్​లో మినిమం ఓట్లు పడేలా ప్లాన్​