దేశంలో 2022 డిసెంబర్లో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ ప్రకారం డిసెంబర్లో నిరుద్యోగిత రేటు 8.30 శాతానికి పెరిగిందని పేర్కొంది. ఇక నవంబర్లో 8.00 శాతంగా ఉందని వెల్లడించింది. గ్రామాల్లో నిరుద్యోగిత రేటు నవంబర్‌లో 7.55 శాతం ఉంటే డిసెంబర్‌లో 7.44 శాతంకు తగ్గింది. అయితే పట్టణాల్లో 10.09 శాతానికి పెరిగిందని నివేదిక తేల్చింది.
రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా హర్యానాలో నిరుద్యోగిత రేటు 37.4 శాతం కలిగి ఉంది. ఆ తర్వాత రాజస్థాన్ 28.5 శాతంతో రెండో స్థానంలో ఉండగా..20.8 శాతంతో మూడో ప్లేస్ లో ఢిల్లీ, 19.1 శాతంతో బిహార్ నాల్గో ప్లేస్ లో 18 శాతంతో ఐదో స్థానంలో జార్ఖండ్ ఉంది.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్‌లో యువత నిరుద్యోగిత రేటు చాలా తక్కువగా ఉంది. గుజరాత్ రాష్ట్రం దేశంలో రెండవ అత్యల్ప నిరుద్యోగ రేటును కలిగి ఉంది. అత్యల్పంగా ఒడిశా నిరుద్యోగిత రేటు 0.9 శాతం ఉండగా.. గుజరాత్ లో .2.3 శాతంగా ఉంది. దేశంలో అత్యధిక నిరుద్యోగిత రేటు కోవిడ్-19 సమయంలో నమోదైందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ తెలిపింది. 2022 సంవత్సరం చివరి వరకు క్రమంగా తగ్గుతూ వచ్చిందని పేర్కొంది.