
2019- 20 ఆర్థిక సంవత్సరానికి సీఎంఐఈ డేటా ప్రకారం.. వ్యవసాయంపై తలసరి వ్యయంపరంగా భారతదేశంలోని ఉత్తమ 5 రాష్ట్రాలు.. పంజాబ్ (రూ. 19,894), హర్యానా (రూ.19,857), తెలంగాణ (రూ.15,883), ఆంధ్రప్రదేశ్ (రూ.14,408), అస్సాం (రూ.14,200). అదేవిధంగా వ్యవసాయంపై తలసరి వ్యయంపరంగా అట్టడుగున ఉన్న 5 రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరప్రదేశ్ (రూ.4,846), బిహార్ (రూ.4,580), జార్ఖండ్ (రూ.4,418), పశ్చిమ బెంగాల్ (రూ.3,812), ఒడిశా (రూ.3,745). రైతుల సంక్షేమానికి, వ్యవసాయ అభివృద్ధికి లేదా ఉత్పాదకతకు, వ్యవసాయంపై తలసరి వ్యయం ఒక్కటే సూచిక కాదు.
రైతుల ఆదాయం, భూమి లభ్యత, నేల నాణ్యత, సాగు ఖర్చు, అందుబాటులో నీటి వనరులు వంటి విషయాల పట్ల ప్రభుత్వ విధానాలు కూడా గణనీయమైన పాత్ర పోషిస్తాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు వ్యవసాయంపై తలసరి వ్యయంపై డేటాను అందిస్తుంది. అంటే, వ్యవసాయం ఖర్చు మొత్తం రాష్ట్ర జనాభాతో గుణించడం. కానీ, అది ఒక్కో రైతు మీద వ్యయంపై డేటాను అందించదు. వ్యవసాయంపై మొత్తం వ్యయాన్ని ఒక రాష్ట్రంలోని మొత్తం రైతుల సంఖ్యతో భాగించడం ద్వారా ఒక్కో రైతు వ్యయాన్ని మనం అంచనా వేయవచ్చు.
.ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఎంతశాతం రైతులకు చేరుతోంది? తెలంగాణలో రైతు భరోసా ఎందరు రైతులకు చేరుతోంది? అనేదానిపై నిర్దిష్టమైన గణాంకాలు వెల్లడికావాలి. నేషనల్ శాంపిల్ సర్వే 70వ రౌండ్ నుంచి అందుబాటులో ఉన్న తాజా డేటా ప్రకారం, భారతదేశంలో వ్యవసాయ కుటుంబాల సంఖ్య సుమారు 9 కోట్లు.
అయితే, వ్యవసాయం అనుబంధ కార్యకలాపంగా ఉన్న కుటుంబాలు ఇందులో ఉన్నాయి. కుటుంబంలోని అందరు సభ్యులు వ్యవసాయంలో చురుకుగా నిమగ్నమై ఉండకపోవచ్చు. ప్రతి ఐదు ఏండ్లకు నిర్వహించే వ్యవసాయ గణనలో ముఖ్యంగా కమతాల సంఖ్య, సగటు విస్తీర్ణం, వాటి పరిమాణం, భూ వినియోగం, కౌలు, పంటల సరళి మొదలైన సమాచారం సేకరిస్తారు. 11వ వ్యవసాయ గణన (2021–-22) పూర్తి అయ్యింది. ఇంకా దేశవ్యాప్త సమాచారం బయటకు రాలేదు. తెలంగాణా రాష్ట్ర నివేదిక వచ్చింది.
దేశంలో మొత్తం కమతాల సంఖ్య 14.60 కోట్లు
వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేసుకుంటున్న రైతుల సంఖ్య మొత్తం వ్యవసాయ కమతాల సంఖ్య కంటే తక్కువ. 2015–-16 భారత వ్యవసాయ జనాభా లెక్కల ప్రకారం, దేశంలో మొత్తం కమతాల సంఖ్య (పొలాలు) సుమారు 14.60 కోట్లు. సాగుదారుల సంఖ్య సుమారు 10.40 కోట్లు. ఒక్కో కమతానికి సగటున సాగుదారుల సంఖ్య 0.71. బహుశా కొందరు రైతులకు ఎక్కువ కమతాలు ఉండవచ్చు. ఒక రాష్ట్రంలో వ్యవసాయంపై చేసే మొత్తం వ్యయాన్ని ఆ రాష్ట్రంలోని మొత్తం రైతుల సంఖ్యతో భాగించడం ద్వారా ఒక్కో రైతు మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు అంచనా వస్తుంది. అయితే, ఇందులో ‘రైతు’ నిర్వచనం, వ్యవసాయ అనుబంధ
కార్యకలాపాలతో కూడిన కుటుంబాలను చేర్చడం లేదా మినహాయించడం వంటి వివిధ అంచనాలపై
ఆధారపడి ఉంటుంది.
ఏదేమైనా ఈ రకమైన లెక్కలు ప్రజల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాలి. ప్రభుత్వ పని తీరుకు ఈ లెక్కలు కూడా ప్రామాణికం కావాలి. 2015-–16 భారత వ్యవసాయ జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణలో మొత్తం కార్యాచరణ కమతాల సంఖ్య (పొలాలు) సుమారు 22 లక్షలు. అయితే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 35 లక్షలకు పైగా రైతులు ఉన్నారని చెపుతోంది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, రాష్ట్రంలో సన్నకారు, చిన్నకారు రైతులు కలిపి దాదాపు 59 లక్షల మంది సాగుదారులు ఉన్నారు. ఈ సంఖ్యలో సొంతభూమి ఉన్నవారు, కౌలు భూమిని సాగు చేసుకునేవారు ఇద్దరూ ఉన్నారు.
తెలంగాణలో కమతాల సంఖ్య 70.60 లక్షలు
అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా తెలంగాణలో వ్యవసాయంపై తలసరి ప్రభుత్వ వ్యయాన్ని మనం అంచనా వేయవచ్చు. ఇందులో రైతుల కోసం వివిధ పథకాలు, కార్యక్రమాలపై చేసే ఖర్చు కూడా ఉంటుంది. 2022–-23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం వ్యవసాయం, అనుబంధ రంగాలకు మొత్తం బడ్జెట్ కేటాయింపులు రూ.19,383 కోట్లు. రైతుల సంఖ్య 35 లక్షలుగా తీసుకుంటే తెలంగాణలో రైతుపై తలసరి ప్రభుత్వ వ్యయం సంవత్సరానికి కేవలం రూ.5,537 అవుతుంది. ఇది స్థూల అంచనా మాత్రమే.
11వ వ్యవసాయ గణన (2021-–22) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కమతాల సంఖ్య 70.60 లక్షలు. వాటి మొత్తం విస్తీర్ణం 63.12 లక్షల హెక్టార్లు. 2015-–16 లెక్కల ప్రకారం 59.48 లక్షల కమతాల నుంచి 18.70 శాతం పెరుగుదల, విస్తీర్ణంలో 59.72 లక్షల హెక్టార్ల నుంచి 5.70 శాతం విస్తీర్ణం పెరుగుదల కనపడుతుంది. పెరిగిన 3 లక్షల హెక్టార్ల భూమి ఎక్కడ నుంచి వచ్చింది? భూమి వినియోగంలో మార్పిడిని ఇది సూచిస్తుంది. అయితే రాష్ట్రంలో కమతాల సగటు పరిమాణం 2015-–16లో 1.00 హెక్టార్ల నుంచి 2021–-22లో 0.89 హెక్టార్లకు తగ్గింది. దీనిని బట్టి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం ప్రధాన జీవన ఆధారంగా కొనసాగుతున్నది. ఈ మేరకు ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు, విధానాలు లేవు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి.
సాగుఖర్చులో రైతుకు తిరిగి చేరుతున్నది 30శాతమే
రైతు ప్రతి ఎకరా సాగుఖర్చులో మార్కెట్ నుంచి రైతుకు తిరిగి చేరుతున్నది చాలా తక్కువ అని భారత వ్యవసాయం మీద చేసిన అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. ప్రభుత్వ ధాన్యం సేకరణ వల్ల కొంత ఉపయోగం ఉన్నా అన్ని పంటలకు దీనిని వర్తింపజేయకపోవటం వల్ల ఆశించిన లక్ష్యం, ఫలితాల మీద అనుమానం ఉన్నది. సంఖ్య ఎక్కువ కాబట్టి ప్రభుత్వ నిధులు భారీగా ఉన్నట్టు అనిపిస్తున్నా అదే సంఖ్యతో గుణిస్తే వారికి చేరుతున్నది తక్కువ. వారి ద్వారా ఇతర రంగాలకు చేరుతున్నది ఎక్కువ.
వ్యవసాయం మీద ఆధారపడిన ప్రైవేటు విత్తన, రసాయనాలు, పరికరాల రంగాలలో పెరుగుదల చాల వేగంగా ఉన్నది. దీనిని బట్టి వ్యవసాయంలో ప్రభుత్వ నిధులతో పాటు , రైతుల అప్పులు, మార్కెట్ ధరలో లోటు పూర్తిగా ఆయా కంపెనీలకు చేరుతున్నాయి. పంటల బీమా వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు దాదాపు రూ.24 వేల కోట్లు చేరినట్టు కాగ్ ఇదివరకు నివేదిక ఇచ్చింది. తెలంగాణా రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2014–-15లో రూ.5.05 లక్ష కోట్ల నుంచి 2023-–24 నాటికి రూ.15.01 లక్ష కోట్లకు పెరిగింది. దీనిని జనాభాతో గుణించి తలసరి ఆదాయం
రూ.1.24 లక్షల నుంచి రూ.3.56 లక్షలకు పెరిగింది.
సమగ్ర వ్యవసాయ విధానం ప్రకటించాలి
2011 తరువాత జనాభా గణన జరగనందున గుణించిన తలసరి ఆదాయం తక్కువనే ఉండవచ్చు. వ్యవసాయ రంగం అందించిన స్థూల రాష్ట్ర ఆదాయం రూ.76,123 కోట్ల నుంచి రూ.2.13 లక్షల కోట్లకు పెరిగింది. అయితే, రైతులు, వ్యవసాయ సంబంధిత ఇతర జీవనోపాధుల మీద ఆధారపడిన సంఖ్య అందుబాటులో లేకపోవడం వల్ల, సేకరించకపోవడం వల్ల సగటు ఆదాయం దీని నుంచి గుణించే అవకాశం లేదు. అంచనాకు ఒక కోటి జనాభా తీసుకున్నా సగటు ఆదాయం సంవత్సరానికి రూ.76 వేల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లు. నెలకు రూ.6,343 నుంచి రూ.17,770. ఇటువంటి ఆదాయం ఉన్నదా? లేదు. ఉంటే, రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. రైతు ఆత్మహత్యలు ఉండేవి కావు.
వ్యవసాయం మీద ప్రభుత్వ పెట్టుబడులు, ప్రకటించే పథకాలు రైతుల ఆర్థిక ప్రగతిని పెంచే విధంగా ఉండాలి. ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయానికి నష్టం చేసినా రైతులను ఆదుకునేవిధంగా ఉండాలి. మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చే విధంగా విధానాలు, చట్టాలు, పథకాలు రావాలి. పంటల వైవిధ్యం పెరిగే విధంగా, ప్రస్తుతం 2-3 పంటల నుంచి అనేక పంటలు వేసే విధంగా నిధులు కేటాయించాలి. సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయం మీద నిపుణులతో సమీక్షించి సమగ్ర వ్యవసాయ విధానం ప్రకటించాలి.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్