హరప్పా నగరానికి యునెస్కో గుర్తింపు

  • జలసిరుల సిటీ ధోలవీర!

వేల ఏండ్ల నాటి చరిత్రకు నిదర్శనంలా నిలిచిన గుజరాత్ లోని ధోలవీర నగర ప్రాంతాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తిస్తున్నట్లు మంగళవారం యునెస్కో ప్రకటించింది. రెండు రోజుల కిందటే మన రాష్ట్రంలోని రామప్ప గుడికి ఈ గుర్తింపు దక్కగా.. తాజాగా ధోలవీరకు కూడా యునెస్కో లిస్టులో చోటు లభించింది. ఈ నేపథ్యంలో పురాతన నగరం ధోలవీర గురించి ప్రత్యేక కథనం. 

ఒక నగరం జన సమూహానికి కేంద్రం. వారి బతుకుదెరువుకు ఆధారం. కట్టడాలు, చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపం. ఇంజనీరింగ్ నైపుణ్యాలను చాటి చెప్పేందుకు నిదర్శనం. అలాంటి నగరమే సింధూ నాగరికతకు కేంద్రమైన హరప్పాలోని ధోలవీర. అక్కడ ఇప్పటిదాకా గుర్తించిన 8 ప్రధాన నగరాల్లో ఐదో పెద్ద నగరమిది. గుజరాత్​లోని కచ్​ జిల్లాలో దీని ఆనవాళ్లు ఉన్నాయి. మన్హస్, మన్హర్​ అనే రెండు నదుల మధ్య కట్టిన ఈ నగరానికి  ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. ఆ ప్రత్యేకతలను గుర్తించిన యునెస్కో.. ఈ చోటునూ వారసత్వ సంపదల జాబితాలో చేర్చింది. వేల ఏండ్ల క్రితమే అక్కడ నిర్మాణాల్లో జామెట్రీనీ వాడారంటే నమ్మలేరేమో. ఇప్పుడున్న నీటి వ్యవస్థల కన్నా అత్యంత ఆధునికమైన నీటి వ్యవస్థలను అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వర్షాలు ఏళ్లతరబడి కురవకపోయినా.. నీటికి కరువు లేకుండా చూసుకునేవారు. సింపుల్​గా చెప్పాలంటే ధోలవీరను ఒక ‘జల సిరుల నగరం’ అని పిలవొచ్చేమో! 

54 ఎకరాల రాతి నగరం 
ధోలవీర నగరాన్ని 54 ఎకరాల స్థలంలో నిర్మించారు. 771.1 మీటర్ల పొడవు, 616.85 మీటర్ల వెడల్పుతో కట్టారు. హరప్పా, మొహెంజోదారో నగరాల్లాగా కాకుండా.. ఆనాడే త్రికోణమితి (జామెట్రీ) సూత్రాల ఆధారంగా ధోలవీర సిటీని కోట, మధ్య సిటీ, దిగువ సిటీగా నిర్మించారు. కోట, మధ్య సిటీల్లో పటిష్ఠమైన రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. పక్కా నిర్మాణ ప్లాన్​తో స్టేడియాలు, బావులు, కాల్వలు, వీధులు, కాంప్లెక్స్​లతో ఆ నాడే సిటీని నిర్మించడం విశేషం. కోటకు రక్షణగా చుట్టూ పెద్దపెద్ద గోడలుండేవి. కోట తర్వాత ముఖ్యమైన అధికారులు నివసించేందుకు వీలుగా నిర్మాణాలున్నాయి. నిజానికి హరప్పాలోని హరప్పా, మొహెంజోదారో వంటి సిటీలకు ఇటుకలతో కడితే.. ధోలవీరలో మాత్రం పూర్తిగా రాతి కట్టడాలుండడం విశేషం. రెండు నదుల మధ్య కట్టిన ఈ సిటీలో ఎత్తైన ప్రాంతంలో కోటను నిర్మించారు.

వాటర్​ టెక్నాలజీ అదుర్స్
ఇప్పుడంటే మనం ప్రాజెక్టులను కడుతున్నాం గానీ.. ఆనాడే ధోలవీరలో ఎన్నో రిజర్వాయర్లను నిర్మించారు. సిటీ నీటి సరఫరా కోసం కాల్వలు తవ్వారు. నీరు వృథా కాకుండా మళ్లీ నదుల్లో కలిసేలా వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. సిటీలోనూ నీటి కొరత రాకుండా బావులను తవ్వారు. ధోలవీరను అన్నింటికన్నా ప్రత్యేకంగా నిలిపింది వారి వాటర్​ ఇంజనీరింగే. అత్యంత ఆధునికమైన నీటి నిల్వ వ్యవస్థను కలిగి ఉన్న నగరాల్లో ప్రపంచంలోనే ధోలవీర మొట్టమొదటిదంటేనే వారి ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ రిజర్వాయర్లనూ పూర్తిగా రాళ్లతోనే కట్టారు. 16 లేదా అంతకన్నా ఎక్కువ భారీ రిజర్వాయర్లను నిర్మించారని సైంటిస్టులు చెప్తారు. అందులో ఇప్పటిదాకా మూడింటిని సైంటిస్టులు తవ్వకాల్లో గుర్తించారు. వర్షపు నీటిని లేదా సిటీకి ఆనుకుని ప్రవహించే రెండు నదుల నీటిని ఈ రిజర్వాయర్లలోకి మళ్లించేవారు. ఒక రిజర్వాయర్​ నుంచి మరొక రిజర్వాయర్ ను పల్లం ఎక్కువగా ఉండే చోట కట్టారు. ఒక్కో రిజర్వాయర్​ను 7 మీటర్ల లోతు79 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఒకవేళ ఆ రిజర్వాయర్లు నిండిపోతే నీరు వృథా కాకుండా.. బావులు తవ్వారు. రిజర్వాయర్లు నిండి ఓవర్​ ఫ్లో అయితే.. ఆ నీరు బావుల్లోకి చేరేలా కాల్వలు తీశారు. 2014 అక్టోబర్​ లో 241 అడుగుల పొడవు, 96 అడుగుల వెడల్పు, 33 అడుగుల లోతున్న ఓ మెట్ల బావిని గుర్తించారు. అది మొహెంజోదారోలోని గ్రేట్​ బాత్​ కన్నా మూడు రెట్లు పెద్దది. కచ్​ పూర్తిగా ఎడారి ప్రాంతం కావడం.. వానలు ఎప్పుడో ఒకసారి పడడం వంటికారణాల వల్ల నీటి నిల్వకు వారు ఇంపార్టెన్స్​ ఇచ్చారని సైంటిస్టులు చెప్తారు.   

ముద్రికలు.. శ్మశానవాటిక..
ఎలాంటి రాతలు లేకుండా కేవలం జంతువుల బొమ్మలతో కూడిన ముద్రిక (సీల్స్​)లను ధోలవీరలో గుర్తించారు. అది సింధూ నాణేల్లోనే ప్రత్యేకమైనవిగా చెప్తుంటారు. ఈ ప్రాంతంలో గుర్తించిన గుండ్రటి ప్రాంతాన్ని.. శ్మశానవాటిక లేదా స్మారకంగా భావిస్తారు. అయితే, చక్రం ఆకారంలో నిర్మించిన ఆ ప్రాంతంలో సమాధులున్నా.. ఒక్క దాంట్లో తప్ప మిగతా ఎలాంటి ఎముకల గూళ్లను గుర్తించలేదు. ఆ ఒక్క సమాధిలోనే ఎముకల గూడును గుర్తించారు. దాంతో పాటు పాలరాతి పూసలు, రాగి నగ, బంగారు గాజులు, బంగారు ఆభరణాలను వెలికితీశారు. నగరంలో వాటితో పాటు కుండలు, జాడీలు, సుత్తి, బాడిష వంటి వాటిని గుర్తించారు. లోథల్​, సుత్కాగన్​ ప్రాంతాలను కలిపేలా మక్రన్​ తీరంలో ఓ సముద్ర మార్గాన్నీ సృష్టించారు.

చెక్కుచెదరని శాసనం
హరప్ప ప్రజలు ఏ భాష వాడారో కూడా ఇప్పటివరకు సైంటిస్టులు తేల్చలేకపోయారు. ధోలవీర భాషదీ అదే పరిస్థితి. వారి లిపిని డీకోడ్​ చేయలేకపోయారు. వారు 400 బేసిక్​ అక్షరాలు, గుర్తులను వాడినట్టు సైంటిస్టులు తేల్చినా అదేంటన్నది మాత్రం చెప్పలేకపోయారు. కుడి నుంచి ఎడమకు రాసినట్టుగా మాత్రం నిర్ధారించారు.

రాగి, కంచు, టెర్రాకోట రాయితో తయారు చేసిన ప్రత్యేక దిమ్మెలపై ఆ అక్షరాలతో శాసనాలను గుర్తించారు. అందులో ప్రత్యేకమైనది సిటీ ఉత్తర ద్వారంలోని పక్క గదుల్లో గుర్తించిన శాసనం. ‘ధోలవీర సైన్​బోర్డ్​’గా పిలిచే ఈ శాసనంలో ఒక్కో అక్షరం 37 సెంటీమీటర్ల పొడవుందట. ఆ సైన్​ బోర్డు 9.8 అడుగుల పొడవుందట. ఆ రాతి శాసనం కొద్దిగా దెబ్బతిన్నా.. దాని మీద ఉన్న గుర్తులు మాత్రం చెక్కుచెదరలేదు. 

1967లో గుర్తించిన్రు
ధోలవీరలో క్రీస్తు పూర్వం 3500 క్రితం నుంచే జనాలు అక్కడ నివసిస్తున్నట్టు చరిత్రకారులు చెప్తుంటారు. లేట్ హరప్పన్​ పీరియడ్​లోని క్రీస్తు పూర్వం1800 వరకు అక్కడ ప్రజలు నివసించారం టారు. తర్వాత ఆ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. అయితే, తొలిసారిగా ఆ హరప్పా సిటీని 1967–68లో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సైంటిస్ట్ జె.పి. జోషి గుర్తించారు. 1990లో తవ్వకాలు ప్రారంభించారు. 

ఏడు దశల్లో సిటీ చరిత్ర
ధోలవీర నగరాన్ని ఆ తవ్వకాలకు డైరెక్టర్​గా ఉన్న రవీంద్ర సింగ్ బిష్త్​ ఏడు దశలుగా విభజించారు. 1990 నుంచి 2005 వరకు ధోలవీరలోని దాదాపు13 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాల్లోనే సిటీ నిర్మాణం, జంతువుల ఎముకలు, బంగారం, వెండి, టెర్రాకోట వస్తువులు, కుండలు, కంచు పాత్రలను వెలికి తీశారు. గుజరాత్, సింధ్, పంజాబ్, పశ్చిమాసియాల మధ్య వాణిజ్యానికి ధోలవీరనే కీలక ప్రాంతంగా గుర్తించారు.