భగవద్గీత, నాట్య శాస్త్రానికి అరుదైన గుర్తింపు.. ప్రధాని మోడీ హ్యాపీ

భగవద్గీత, నాట్య శాస్త్రానికి అరుదైన గుర్తింపు.. ప్రధాని మోడీ హ్యాపీ

న్యూఢిల్లీ: వేద వ్యాసుడు రచించిన భగవద్గీత, భరతముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమొరీ ఆఫ్‌‌ వరల్డ్‌‌ రిజిస్టర్‌‌లో చోటు దక్కింది. దేశ సాంస్కృతిక, తాత్విక, కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. ఇప్పటి వరకు యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‎లో ఇండియా తరఫు నుంచి మొత్తం 14 ఎంట్రీలు ఉన్నాయి. ఈ విషయాన్ని కల్చరల్, టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్​ ప్రకటించారు. 

కాగా, ప్రపంచ వ్యాప్తంగా తాజాగా మొత్తం 74 కొత్త డాక్యుమెంటరీ హెరిటేజ్ కలెక్షన్‌‌లను రిజిస్టర్​లో చేర్చినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. శ్రీమద్భగవద్గీత హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన గ్రంథాల్లో ఒకటిగా పరిగణించబడుతున్నది. ఇది మహాభారతంలోని భీష్మ పర్వంలో భాగంగా ఉంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధభూమిలో ఇచ్చిన ఆధ్యాత్మిక ఉపదేశాల సమాహారమే భగవద్గీత అని చెప్పుకుంటారు. ధర్మం, కర్మ, భక్తి, జ్ఞానం, మోక్షం వంటి తాత్విక అంశాల గురించి ఇందులో విస్తృతమైన ప్రస్తావన ఉన్నది. ఇందులో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి.

భారతీయ కళల ప్రాచీన గ్రంథం.. నాట్య శాస్త్రం

భరతముని రచించిన నాట్యశాస్త్రం.. ప్రాచీన భారతీయ కళలకు సంబంధించిన అత్యంత ప్రామాణిక గ్రంథం. ఇది నాట్యం, సంగీతం, నాటకం, రంగస్థల కళలకు సంబంధించిన సమగ్ర సిద్ధాంతాలను వివరిస్తుంది. ఈ గ్రంథం నవరసాలు (తొమ్మిది భావోద్వేగాలు), నాట్య సాంకేతికతలు, రంగస్థల నిర్మాణం, వేషధారణ, కళాకారుల శిక్షణ వంటి అంశాలను విస్తృతంగా చర్చిస్తుంది. నాట్యశాస్త్రం అనేది భారతీయ సాంప్రదాయ కళలైన భరతనాట్యం, కథక్, కూచిపూడి వంటి నృత్య రూపాలకు పునాదిగా నిలుస్తుంది. 

కాగా, యునెస్కోకు చెందిన మెమరీ ఆఫ్ ది వరల్డ్ ప్రోగ్రాం 1992లో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన డాక్యుమెంటరీ వారసత్వాన్ని సంరక్షించడం, గుర్తింపు తీసుకురావడం, ప్రచారం చేయడమే దీని లక్ష్యం. ఇండియా నుంచి రిగ్వేద సంహిత, రామచరితమానస, గీత గోవిందం, ఐఏఎస్​సీ ఆర్కైవ్స్ వంటి మొత్తం 14 ఎంట్రీలు యునెస్కో మెమరీ ఆఫ్‌‌ వరల్డ్‌‌ రిజిస్టర్‌‌లో గుర్తింపు పొంది ఉన్నాయి.

యునెస్కో గుర్తింపు హర్షణీయం: మోదీ

భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు దక్కడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘‘దేశ జ్ఞానం, సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఈ గ్రంథాల సందేశాలు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తాయి’’అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని గుర్తుచేస్తూ, ఈ గ్రంథాలను మరింతగా పరిశోధించాలని యువతను కోరారు. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తున్నదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులని వివరించారు.