కరీంనగర్ సిటీ, వెలుగు: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి జనాల్లో అనూహ్య స్పందన లభించింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఉదయం 9 గంటలకే ఎస్సారార్ కాలేజీ వద్దకు వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు.
ఉదయం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డితో కలసి సంజయ్ నామినేషన్ వేశారు. అనంతరం నేరుగా ఎస్సారార్ కాలేజీ వద్దకు చేరుకొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి కోర్టు చౌరస్తా, రాజీవ్ చౌక్, గీతాభవన్ చేరుకున్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు ర్యాలీ నిర్వహించారు. పలు చోట్ల మహిళలు పూలు చల్లి, హరతి పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. టవర్ సర్కిల్ వద్ద సంజయ్ వద్దకు వ్యాపారులు స్వచ్చందంగా తరలి వచ్చి స్వాగతం పలుకుతూ కరచాలనం చేస్తూ ఆలింగనం చేసుకున్నారు.