బెంగళూరు : వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు ఊహించని షాక్. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లిష్ టీమ్ బ్యాటింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో శ్రీలంక చేతిలో చిత్తయ్యింది. ఫలితంగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయంతో రెండు పాయింట్లు సాధించిన బట్లర్‌సేన ఎలిమినేషన్ అంచుల్లో నిలిచింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో 156 రన్స్‌కే కుప్పకూలింది.
బెన్ స్టోక్స్ (73 బాల్స్‌లో 6 ఫోర్లతో 43) టాప్ స్కోరర్. తర్వాత లంక 25.4 ఓవర్లలో 160/2 స్కోరు చేసింది. పాథుమ్ నిశాంక (83 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 నాటౌట్), సమరవిక్రమ (54 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 65 నాటౌట్) దంచికొట్టారు. డేవిడ్ విల్లే (2/30) దెబ్బకు తొలి ఆరు ఓవర్లలోనే కుశాల్ పెరీరా (4), కుశాల్ మెండిస్ (11) ఔటయ్యారు. దీంతో 23/2 వద్ద జోడీ కట్టిన నిశాంక, సమరవిక్రమ ఇంగ్లిష్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. వీలైనప్పుడల్లా బౌండ్రీలు బాదుతూ మూడో వికెట్‌కు137 రన్స్ జోడించి ఈజీగా గెలిపించారు. లాహిరు కుమారా (3/35)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బౌలింగ్ అదుర్స్..
బౌన్సీ పిచ్‌పై లంక బౌలర్లను ఎదుర్కోవడానికి ఇంగ్లిష్ బ్యాటర్లు నానా తిప్పలు పడ్డారు. లోపలికి దూసుకొచ్చిన బాల్స్‌ను డిఫెన్స్ చేయలేక చేతులెత్తేశారు. ఓపెనర్లలో బెయిర్‌స్టో (30), మలన్ (28) బ్యాట్లు ఝుళిపించే ప్రయత్నం చేసినా లంకేయులు సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకున్నారు. మతీషా పతిరణ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన మాథ్యూస్ (2/14) బౌన్స్, స్వింగ్‌తో ముప్పు తిప్పలు పెట్టాడు. ఏడో ఓవర్‌లో మలన్ ఔట్‌కావడంతో తొలి వికెట్‌కు 45 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. 10వ ఓవర్‌లో రూట్ (3) రనౌట్ కావడంతో వికెట్ల పతనం మొదలైంది. మరో రెండు ఓవర్ల తర్వాత కాసున్ రజిత (2/36) బాల్‌ను ఫుల్ చేసిన బెయిర్ స్టో మిడాన్‌లో డిసిల్వాకు దొరికాడు. ఆ వెంటనే కుమార డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు.
వరుస ఓవర్లలో కెప్టెన్ బట్లర్ (8), లివింగ్‌స్టోన్ (1)ను పెవిలియన్‌కు పంపడంతో స్కోరు 85/5గా మారింది. స్టోక్స్‌తో జతకలిసిన మొయిన్ అలీ (15) రెండు షాట్లు కొట్టి ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశాడు. కానీ లంక బౌలర్లు పట్టు సడలించలేదు. 25వ ఓవర్‌లో మాథ్యూస్ బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్‌కు అలీ వెనుదిరగడంతో ఆరో వికెట్‌కు 37 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. తర్వాతి ఓవర్‌లో క్రిస్ వోక్స్ (0) డకౌటయ్యాడు. డేవిడ్ విల్లే (14 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేసినా, 31వ ఓవర్‌లో కుమార.. స్టోక్స్‌ను ఔట్ చేసి షాకిచ్చాడు. తర్వాత వరుస ఓవర్లలో ఆదిల్ రషీద్ (2), మార్క్ వుడ్ (5) పెవిలియన్‌కు చేరడంతో ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 33.2 ఓవర్లలో 156 ఆలౌట్ (బెన్ స్టోక్స్ 43, బెయిర్‌స్టో 30, కుమార 3/35). శ్రీలంక: 25.4 ఓవర్లలో 160/2 (నిశాంక 77*, సమరవిక్రమ 65*, విల్లే 2/30).
1 1996 నుంచి వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడటం ఇదే తొలిసారి.
5 2007 వరల్డ్ కప్ నుంచి శ్రీలంక వరుసగా ఇంగ్లండ్‌పై గెలవడం ఇది ఐదోసారి.