- వివరాలు వెల్లడించిన వెంకటాపురం సీఐ బండారి కుమార్
వెంకటాపురం, వెలుగు: రాంగ్ కాల్ తో పరిచయమైన మహిళ వేధింపులతోనే ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్యకి పాల్పడినట్లు వెంకటాపురం సీఐ బండారు కుమార్ తెలిపారు. శనివారం పోలీస్ స్టేషన్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదయతండాకు చెందిన బానోత్ అనసూర్య అలియాస్ అనూష ఒక ప్రైవేట్ కాలేజీలో అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ గా పని చేస్తుంది. ఏడు నెలల కింద ఒక రాంగ్ కాల్ చేయడంతో వాజేడు ఎస్సై హరీశ్‌తో పరిచయం ఏర్పడింది. హరీశ్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుతుందని భావించిన అనూష.. తరచూ ఎస్సైకి ఫోన్ చేస్తూ సాన్నిహిత్యం పెంచుకుంది.
ఈ క్రమంలో హరీశ్కు మరో యువతితో నిశ్చితార్థం అవుతుందని తెలుసుకొని, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలని.. లేదంటే శారీరకంగా వాడుకున్నావని మీడియా, ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసింది. వేరే ఆప్షన్ లేదని తనను పెళ్లి చేసుకోవాలని.. లేదంటే సూసైడ్ చేసుకొని చనిపొమ్మని ఆత్మహత్యకి ప్రేరేపించింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఎస్సై హరీశ్, డిసెంబర్ 2న వాజేడు మండలం ఫెరియోడో రిసార్ట్ లో సర్వీస్ రివాల్వర్ లో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అన్ని ఆధారాలు సేకరించిన అనంతరం అనూషను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.