సొంత రాష్ట్రంలోనూ యువతకు అన్యాయమేనా?

సొంత రాష్ట్రంలోనూ యువతకు అన్యాయమేనా?
  • తెలంగాణ ఉద్యమం పుట్టిందే ‘ముల్కీ’ నుంచి

తెలంగాణ ఉద్యమ లక్ష్యం స్వరాష్ట్రంలో మన ప్రాంత నిరుద్యోగ యువతకు నిజాయతీగా దక్కాల్సిన అవకాశాలు, ఉద్యోగాలు కల్పించి ఆత్మస్థైర్యం, ఆత్మ గౌరవంతో బతికే రోజు సాకారం కావాలన్నదే. ముఖ్యంగా ఉద్యమ చరిత్రను గమనిస్తే తెలంగాణ ఏర్పాటుకు పూర్వం మొదలైన ముల్కీ ఉద్యమం, 1969 తొలి దశ ఉద్యమం స్థానిక నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి పురుడు పోసుకున్నవే. 2009 నాటి మలి దశ ఉద్యమంలోనూ పాలకుల మెడలు వంచడంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత చేసిన త్యాగాలదే మేజర్ రోల్. కానీ స్వరాష్ట్రం సాధించుకున్నాక రెండు సార్లు గెలిచిన టీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగుల ఆశలు, ఉద్యమ ఆశయాలపై మట్టికొట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏవో ప్రకటనలు, హామీలు గుప్పించి మాయ చేయడం తప్ప ఏడేండ్లలో చేసింది శూన్యం.
సొంత గడ్డ మీద సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా బతకలేక అక్రోశం నుంచి పుట్టిందే తెలంగాణ ఉద్యమం. మన ప్రాంతంలో ఉద్యోగాలకు మనం పనికిరామన్నట్టు ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుపై మొదలైన తిరుగుబాటు నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారానికి మూలమైంది. నిజాం కాలం నుంచి తెలంగాణ బిడ్డలను కాదని, వలస వచ్చినోళ్లకే ఉద్యోగాలు ఇస్తూ వస్తే, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ కొనసాగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాతైనా మన యువతకు న్యాయం జరుగుతుందన్న ఆశలు అడియాశలైనాయి. తెలంగాణలో ఉన్న వేలాది ఆంధ్రా ఉద్యోగులు ఇక్కడే ఉన్నారని, వాళ్లను అక్కడికి పంపేసి, మన రాష్ట్ర యువతను భర్తీ చేస్తామని అసెంబ్లీలోనే సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పారు. కానీ నేటికీ ఆ హామీకి అతీగతీ లేదు.
ఏం మారింది?
యువత ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసిన పోరాటాలతో తెలంగాణ వచ్చింది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులకు, నేటికీ ఏం మారిందని ప్రశ్నిస్తే మౌనం తప్ప సమాధానం లేదు. ఎన్నికల టైమ్లో ఏదో చేసేశామని తప్పుడు లెక్కలతో అధికార పార్టీ నేతలు మోగిస్తూనే ఉన్నారు. ఉద్యమ పార్టీయే రెండు సార్లు గెలిచినా నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ విషయంలో విఫలమైందని ప్రతి ఒక్కరికీ తెలిసినా, దానిని కప్పిపుచ్చుకునేందుకు లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామంటూ ‘ఫేక్ లెక్కలతో’ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బహిరంగ ప్రకటన చేయడం తెలంగాణ యువతను అవమానించడమే అవుతుంది. 
ప్రకటనలు, ప్రగల్భాలకు కొదవేలేదు
ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరుద్యోగ యువతకు చెప్పిన గొప్పలు, ప్రగల్భాలు, హామీలను చూస్తే రాష్ట్రం వచ్చాక మన భవిష్యత్తుకు బంగార బాటలు పడడం ఖాయమని అంతా అనుకున్నాం. తెలంగాణ సాధించుకున్నాక ఇంటికో ఉద్యోగం, ప్రతి ఏటా టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీ చేయడం, ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను వారి రాష్ట్రానికి పంపి మన వాళ్లకు ఉద్యోగాలు కల్పించడం ఇలా ఎన్నో చెప్పారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక, అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఆ హామీలను నెరవేర్చలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల మార్పిడికి ఏర్పాటు చేసిన కమిటీ ఏమైందో నేటికీ అడ్రస్ లేదు.  
ఉద్యోగాల భర్తీ ఆలోచనే లేదు
ప్రస్తుతం రాష్ట్ర అక్షరాస్యత 64 శాతంగా ఉంది. ఇది దేశ అక్షరాస్యత కంటే తక్కువ. దీన్ని మెరుగుపరిచే ఆలోచన మానేసి, గొర్రెలు, బర్రెలు స్కీములు ప్రకటనలు చేశారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని  నీరుగార్చేశారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన లేదు. భారీగా ఖాళీలు ఏర్పడినా లెక్చరర్లు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆలోచనే చేయలేదు. కాంట్రాక్టు ఉద్యోగులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఆరోగ్య రంగంలో సగం ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీయే ఈ మధ్యే తేల్చింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో భారీగా అన్ని శాఖల్లో ఉద్యోగుల అవసరం ఉన్నా  రిక్రూట్మెంట్ ఆలోచన చేయలేదు. 
ఎలక్షన్స్‌లో ఎదురుదెబ్బలతో..
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీ, టీఎస్పీఎస్సీ ద్వారా ఒక్క నోటిఫికేషన్ మినహా పెద్దగా చేసిందేం లేదు. తెలంగాణ ఏర్పడినప్పటికే వేల సంఖ్యలో ఉన్న  ఖాళీలు, ఈ ఏడేండ్లలో రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో ఏర్పడిన వేకెన్సీలు, కొత్త జిల్లాలు ఏర్పడడంతో భారీగా ఉద్యోగుల అవసరం లాంటి వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీటిపై ప్రశ్నిస్తే తప్పుడు లెక్కలు చెబుతూ భారీ ప్రకటనలు ఇవ్వడం తప్ప నిరుద్యోగ యువతకు చేసిందేం లేదు.  దుబ్బాక బై ఎలక్షన్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడంతో ఈ ఎమ్మెల్సీ, రాబోయే నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో  మళ్లీ ఓటమి తప్పదేమోనన్న భయంతో 50 వేల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్లు వస్తున్నాయంటూ ప్రకటనలు గుప్పించిన సీఎం కేసీఆర్ ఇంత వరకు వాటిని రిలీజ్ చేయకపోవడం చూస్తే ఏం అర్థం చేసుకోవాలి. ఆ నోటిఫికేషన్ల విడుదలకు ఉన్న టెక్నికల్ సమస్యలను పరిష్కరించకుండా వట్టి మాటలు చెప్పి ఓట్లు దండుకోవాలన్న దురాలోచన తప్ప మరేం లేదని తెలంగాణ యువతకు క్లియర్గా అర్థమవుతోంది. 
కేటీఆర్ లేఖ జూటా..
ఉద్యోగాల భర్తీపై కేటీఆర్ రిలీజ్ చేసిన బహిరంగ లేఖ చూస్తేనే టీఆర్ఎస్ సర్కారు గ్రాడ్యుయేట్స్కు తీవ్ర అన్యాయం చేసిందని అర్థమవుతుంది.  ఎందుకంటే ఎలాంటి అదనపు క్వాలిఫికేషన్ లేని గ్రాడ్యుయేట్స్కు మాత్రమే మూడు వేల గ్రూప్-2, 4 ఉద్యోగాలు ఇచ్చారని అందులో తెలుస్తోంది. గ్రూప్-1 సహా జూనియర్ కాలేజీ లెక్చరర్స్, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్, విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగ ప్రకటనలు రాక పదేండ్లు అయింది. ఏడు జోన్స్ను అసంబద్ధంగా ఏర్పాటు చేసి కోర్ట్ కేసులతో కాలక్షేపం చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఆ లేఖలో చెప్పిన విద్యుత్ శాఖ ఉద్యోగాల లెక్క చూస్తే, అప్పటికే ఉన్న 23వేల ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం మాత్రమే జరిగింది. మరి అవి కొత్త ఉద్యోగాలు ఎలా అవుతాయి? 9 వేల పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలతో గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఊడగొట్టి వారి పనిని కూడా వీరికే అప్పచెప్పి  వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వివిధ ప్రభుత్వ సంస్థలలో కాలానికి అనుగుణంగా భర్తీ చేసే ఉద్యోగాలు కూడా వీరి ఖాతాలోకి వేసుకోవడం హాస్యాస్పదం. కేసీఆర్ తన కుటుంబంలో ఐదుగురికి పదవులు ఇచ్చుకున్నారు. మరి ఆత్మబలిదానాలు చేసుకున్న 1200 మంది యువకుల ఫ్యామిలీలో ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఇప్పటికే ఒక తరం వారి జీవితాలు నాశనమయ్యాయి. ఇక తర్వాతి తరం కోసమైనా ప్రభుత్వం పనిచేయాలి. లేదంటే ప్రాంతీయేతరులను తరిమినట్టే ఈ పాలకులను ఇక్కడే పాతరేసేలా వచ్చే ప్రతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పడం దేశం అంతా చూస్తుంది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నిరుద్యోగ యువత టీఆర్ఎస్కు బుద్ధి చెప్పడం ఖాయం.
ఉద్యమానికి మూలం ఏమిటో తెలియదా?
అసలు కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని చెప్పుకునే అధికార పార్టీ నాయకులకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పుట్టుక మూలం తెలియదా? ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్లకు ఇక్కడి ఉద్యోగ అవకాశాల్లో జరిగిన అన్యాయంలో నుంచి ముల్కీ ఉద్యమం పుడితే, ఆ ముల్కీ నిబంధనలను పాలకులు ఉల్లంఘించడంపై అక్రోశంతో 1969లో ఖమ్మం విద్యార్థులు పోరుబాట పట్టి ప్రాణ త్యాగాలు చేసిన విషయం ఈ టీఆర్ఎస్ నాయకులకు తెలియదా? నిజాం కాలంలో అధికారిక భాష ఉర్దూ కావడం, బోధన కూడా అదే భాషలో జరగడం, ఇక్కడ జమీందార్లు, దొరలు తప్ప సామాన్యులకు చదువుకునే అవకాశం కూడా లేకుండా అణిచేసిన విషయాన్ని చరిత్రలో ఎవరూ మర్చిపోలేరు. దీని కారణంగా నిజాం కాలంలో, ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలోనూ ఇతర ప్రాంతాల వాళ్లే ఇక్కడికి వలస వచ్చి ఉద్యోగాల్లో చేరారు. ఈ అన్యాయంపై నిజాం కాలంలోనే ముల్కీ ఉద్యమం జరిగింది. ఆ పోరాటాల ఫలితంగా ముల్కీలకే (ముల్కీ ఉంటే స్థానికులు) ఉద్యోగాలు ఇవ్వాలని గెజిట్ వచ్చింది. కానీ హైదరాబాద్ రాష్ట్రం, ఉమ్మడి ఏపీలోనూ ముల్కీ నిబంధనలు సక్రమంగా అమలు కానేలేదు. స్థానిక యువతకు ఉద్యోగాలు రాలేదు. ఇక్కడి వారి అవకాశాలను వలస వచ్చినవారు దోచుకుంటూ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చినదే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అని రాజకీయ నాయకులు మర్చిపోతే ఆ పార్టీలను రాష్ట్రంలోనే బొందపెట్టడం ఖాయమని గుర్తించాలి.-రేకులపల్లి భాస్కర్‌రెడ్డి, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ మెంబర్.