- ఏజెన్సీలో చెరువుల నిండుతున్నా, మైదానప్రాంతంలో ఖాళీ..
- వర్షపాతం నమోదవుతున్నా నిండని చెరువులు
- భారీ వర్షాల కోసం తప్పని ఎదురు చూపులు
- ప్రశ్నార్ధకంగా ఎస్సారెస్పీ జలాలు
- బోరు బావుల కిందే వరి నాట్లు
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, గార్ల, బయ్యారం పరిధిలో భారీ వర్షాల మూలంగా చెరువులు జలకళను సంతరించుకోగా, మైదాన ప్రాంత మండలాలైన కేసముద్రం, ఇనుగుర్తి, డోర్నకల్, కురవి, చిన్నగూడురు, తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, నరసింహులపేట, సీరోలు, దంతాలపల్లి, మరిపెడ, గూడురు, మహబూబాబాద్ పరిధిలోని చెరువుల్లో నీరు లేక వెలవెలబోతున్నాయి. ఇక్కడ బోరుబావులపై ఆధారపడ్డ ఉన్న రైతులు వరి నాట్లను వేస్తుండగా, మిగతావారు భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఏజెన్సీలో జలకళ..
జిల్లాలోని కొత్తగూడ మండలంలో 380 చెరువులు ఉండగా, 290 చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరింది. గంగారం మండలంలో 214 చెరువులకు 187, బయ్యారంలో 98 చెరువులకు బయ్యారం పెద్ద చెరువు, తులారం ప్రాజెక్ట్ పూర్తిగా నిండాయి. గార్ల మండలంలో 96 చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి.
‘మైదానం’ వెలవెల..
జిల్లాలోని మైదాన ప్రాంతాలైన చిన్నగూడురు మండలంలోని 24 చెరువులు, దంతాలపల్లి 29, డోర్నకల్ 69, నరసింహులపేట 46, మరిపెడ 69, మహబూబాబాద్ 87, గూడురు 122, సీరోలు 48, కురవి 76, నెల్లికుదురు 56, కేసముద్రం 53, ఇనుగుర్తి 28, తొర్రూరు 58, పెద్దవంగర 37 చెరువుల్లో ఒక్క చెరువు కూడా పూర్తిగా నిండలేదు. కొన్ని చెరువుల్లో నీరు లేకపోవడంతో వెలవెల బోతున్నాయి. ప్రతీరోజు జిల్లాలో చిరుజల్లుల మూలంగా వర్షపాతం నమోదవుతున్నా వరద బయటికి రావడం లేదు.
ఎస్సారెస్పీపై సన్నగిల్లిన ఆశలు..
మైదాన ప్రాంతంలోని చెరువులను ఎస్సారెస్పీ జలాలతో నింపే అవకాశం ఉన్నా, ప్రాజెక్టులో నీరు లేకపోవడం, ఎల్ఎండీలోనే కనీసం నీరు లేకపోవడంతో కాకతీయ కెనాల్ ద్వారా సాగునీరు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. కేవలం బోరు బావుల ఆధారం ఉన్న రైతులు మాత్రమే వరి నాట్లు వేస్తున్నారు. ఆగస్టు 15లోగా వరి నాట్లు వేయకుంటే నారు ముదిరిపోయే పరిస్థితి ఏర్పడనుంది.
వర్షాల కోసం ఎదురు చూస్తున్నా..
సాగు కోసం వరి నారు పోసినప్పటికీ సరైన వర్షం లేకపోవడంతో చెరువుల్లో నీరు లేదు. భారీ వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. వాతావరణ శాఖ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నా, తొర్రూరు మండల పరిధిలో చెరువుల్లోకి వరద వస్థలేదు, భారీ వర్షం పడుతలేదు. ఎస్సారెస్పీ జలాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
జాటోతు సురేశ్, భీముడు తండా, తొర్రూరు మండలం