ఏండ్లు గడుస్తున్నా యాడియాడనే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అసంపూర్తి నిర్మాణాలు

  •     రెండేండ్లు దాటినా పూర్తికాని ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ కాంప్లెంక్స్​
  •     ఐదేండ్లుగా అసంపూర్తిగా డ్రైనేజీ, ఫుట్​పాత్​ల నిర్మాణం
  •     కొత్త ప్రభుత్వంపైనే ఆశలు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభించిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. శంకుస్థాపన చేసి ఏండ్లు గడుస్తున్నా ఆయా పనులు ఇప్పటికీ కంప్లీట్​ కాలేదు. నిధుల కొరత, లీడర్ల పట్టించుకోకపోవడం, ఆఫీసర్ల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లా కేంద్రం కామారెడ్డిలో లక్షకు పైగా జనాభా ఉంటారు. 

నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. గత ప్రభుత్వం​నిధులు కేటాయించకపోవడంతో ఆయా పనులు మధ్యలోనే ఆగాయి. ప్రభుత్వం మారిన నేపథ్యంలో, ఈ గవర్నమెంట్​హయాంలోనైనా పాలకులు పట్టించుకొని త్వరగా కంప్లీట్​చేయాలని టౌన్​ప్రజలు కోరుతున్నారు.

డ్రైనేజీ, పూట్​పాత్​ల నిర్మాణం అస్తవ్యస్తం

రూ. కోట్ల ఫండ్స్​తో కొత్త బస్టాండ్​ నుంచి హౌజింగ్​బోర్డు కాలనీ వరకు రోడ్డుకు రెండు వైపులా డ్రైనేజీ, ఫుట్​పాత్​ల నిర్మాణాన్ని ప్రారంభించారు. 2018లో షురూ చేసిన పనులు సగంలోనే ఆగిపోయాయి. బస్టాండ్ ​నుంచి మున్సిపల్​ ఆఫీస్​వరకు, కొత్త బస్టాండ్ ​నుంచి నిజాంసాగర్​ చౌరస్తా వరకు పనులు ప్రారంభించి ఆపేశారు. ఇంకా కిలోమీటరున్నర మేర పనులు కాలేదు. ఫుట్​పాత్​లు కూడా సగం కట్టారు. 

చాలా చోట్ల షాప్​ల ఓనర్లు డ్రైనేజీ పై స్లాబ్​వేసుకున్నారు. 5 ఏండ్లు దాటినా పట్టించుకునే వారు లేరు. టౌన్​లో నిజాంసాగర్​ చౌరస్తా, కొత్త బస్టాండ్​సమీపంలోని చర్చి చౌరస్తా, ఇందిరా చౌక్, రామారెడ్డి రోడ్డు చౌరస్తా వద్ద జంక్షన్​ల  డెవలప్​మెంట్​కు ప్రతిపాదనలు పంపారు. కానీ పనులు షురూ చేయలేదు. జంక్షన్​లు సరిగా లేక వెహికల్స్​ రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్త ప్రభుత్వం దృష్టి సారిస్తే ఆయా పనులు త్వరగా పూర్తవుతాయి.

మధ్యలోనే ఆగిన ఇంటిగ్రేటెడ్ ​మార్కెట్​ కాంప్లెక్స్​

కామారెడ్డి గాంధీ గంజ్​లో రూ.7.20 కోట్ల అంచనా వ్యయంతో గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ ​కాంప్లెక్స్​ నిర్మాణాన్ని చేపట్టింది. 2021, ఆగస్టులో అప్పటి కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజల అవసరాల కోసం విశాల మైదానంలో కూరగాయలు, మాంసాహార మార్కెట్​ కాంప్లెక్స్​ను నిర్మించాల్సి ఉంది. 28 నెలలు గడిచినా సగం పనులు కూడా పూర్తి కాలేదు. 

తాము చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్ మిగతా పనులు చేయడం లేదు. దీంతో ప్రస్తుతమున్న కూరగాయల మార్కెట్​ సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తిలక్​ రోడ్​లోని డెయిలీ మార్కెట్​ చిన్నగా ఉంది. ఇందులో ఉన్న 2 షెడ్లు శిథిలమయ్యాయి. రైతులు, వ్యాపారులు రోడ్లపై కూర్చుండే కూరగాయలు అమ్ముతున్నారు. రూ.50 లక్షలతో రైతుబజార్​ నిర్మించి ఐదేండ్లవుతున్నా అందులో రైతులను కూర్చోనివ్వడం లేదు.