సూర్యాపేట : ‘పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం, సూర్యాపేట జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, ఆఫీసర్లు ప్రపోజల్స్ పంపితే వాటిని టూరిజం ప్లేస్‌లుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా’ అని 2017లో పర్యాటక దినోత్సవం రోజున మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. మంత్రి మాట ప్రకారం ఆఫీసర్లు రూ. 5 కోట్లతో ప్రపోజల్స్ పంపించారు. కానీ ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా విడుదల కాలేదు.. పర్యాటక ప్రాంతాలు అభివృ-ద్ధికీ నోచుకోలేదు.
జిల్లాలో అనేక టూరిస్ట్ ప్లేస్‌లు...
తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండి, గేట్ వే ఆఫ్ తెలంగాణగా పిలిచే సూర్యాపేట జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చారిత్రక, ఆధ్యాత్మిక కట్టడాలతో పాటు ప్రాచీన కాలం నాటి రాక్షసగుళ్లు, బౌద్ధ స్థూపాలు, కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఉన్నాయి. ఉండ్రుగొండలో, కృష్ణా నది ఒడ్డున మఠంపల్లిలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలు, మేళ్లచెర్వులో స్వయంభు శంభులింగేశ్వర ఆలయం, పిల్లలమర్రిలో శివాలయాలు ఉన్నాయి. ఫణిగిరి బౌద్ధ క్షేత్రాలు, జాన్‌పహాడ్ దర్గా, మూసీ రిజర్వాయర్ కూడా ఈ జిల్లాలోనే ఉంది. వీటితో పాటు ప్రతి రెండేళ్లకోసారి పెద్దగట్టులో లింగమంతుల స్వామి జాతర వైభవంగా సాగుతోంది. ఆయా ప్రాంతాలను చూసేందుకు తెలంగాణతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. కానీ ఆయా ప్రాంతాల్లో కనీస వసతులు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రూ. 5 కోట్లతో ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించారు.
ఫండ్స్ ఇవ్వని ప్రభుత్వం...
జిల్లాలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రం అభివృద్ధికి రూ.3 కోట్లు అవసరం అవుతాయని ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారు. ఫణిగిరి కొండపై రూ.72 లక్షలతో గెస్ట్‌హౌజ్, ఫణిగిరి గ్రామం నుంచి కొండ వరకు రూ.44 లక్షలతో సీసీ రోడ్డు, కొండపైకి రూ. 57 లక్షలతో మెట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే బుద్ధవనం పార్క్, స్థానిక చెరువులో బోటింగ్, టూరిస్ట్‌ల కోసం గెస్ట్‌హౌజ్, బౌద్ధ మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటితో పాటు ఉండ్రుగొండ వద్ద మినీ ఫంక్షన్ హాల్, కోనేరు రివిట్‌మెంట్, ఉండ్రుగొండ గుట్ట మీదికి రోప్‌వే, ఉండ్రుగొండ గుట్టను ఎకో టూరిజం స్పాట్‌గా మార్చడం వంటి పనులు చేసేందుకు ప్రపోజల్స్ పంపించారు. ఐదేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. పట్టించుకునే వారు లేకపోవడంతో ఫణిగిరి గుట్టపై ఉన్న బౌద్ధ క్షేత్రాలు, శిల్పాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ప్రభుత్వం స్పందించి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.