- జిల్లా అధ్యక్షుడికి నిరసనగా రాజీనామా
- ఇంటికి పిలిపించుకొని బుజ్జగించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీలో కొత్త లొల్లి పుట్టుకొచ్చింది. గుడిహత్నూర్, నేరడిగొండ, బజార్ హత్నూర్, బోథ్ మండలాలకు కొత్త అధ్యక్షులను నియమించడం వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయా మండలాల పాత అధ్యక్షులు, సీనియర్ లీడర్లు గుర్రుగా ఉన్నారు. కార్యకర్తలతో సమావేశం, సంప్రదింపులు జరపకుండా నిర్ణయాలు తీసుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో ఇలా మొదటిసారి వివాదం చెలరేగడంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది.
నచ్చజెప్పిన ఎమ్మెల్యే
గుడిహత్నూర్ అధ్యక్షుడిగా జాడి సుభాష్‌ను పదవి నుంచి తొలగించడం పట్ల ఆయనతో పాటు మండల ఫ్రధాన కార్యదర్శి సందీప్, బీజేవైఎం మండలాధ్యక్షుడు నితీశ్, కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వీరితో పాటు బోథ్ మండల అధ్యక్షుడిగా ఉన్న సుభాష్ సూర్యను, బజార్హత్నూర్ అధ్యక్షుడు బత్తిని సుధాకర్ లను తొలగించారు.
వీరి స్థానంలో జిల్లా అధ్యక్షుడికి సన్నిహితులకు పదవులు ఇచ్చుకున్నారంటూ నేతలు ఆరోపిస్తున్నారు. మండల అధ్యక్ష ఎన్నికల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు సరికావని నేరడిగొండకు చెందిన సోనయ్య హీరాసింగ్ బహిరంగంగానే విమర్శించారు. ఈ క్రమంలోనే మాజీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను పలువురు బోథ్ నియోజకవర్గ లీడర్లు కలిశారు. ఎమ్మెల్యే నచ్చజెప్పడంతో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ భేటీ అనంతరం వారు ప్రకటన చేశారు. అయితే పదవులు కోల్పోయిన లీడర్లు మాత్రం ఇంకా అసంతృప్తిలోనే ఉన్నారు.
ఎంపీ అభ్యర్థి నగేశ్‌కు తలనొప్పి
పార్టీ క్యాడర్ అంతా పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేయాల్సిన సమయంలో ఈ వివాదం రాజుకోవడం బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌కు తలనొప్పిగా మారింది. ఒకపక్క ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ల మద్దతు కోసం ఆయన ప్రయత్నిస్తుంటే.. కొత్త లొల్లితో ఆయనకు మరింత టెన్షన్ పట్టుకుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సన్నాహాక సమావేశంలో సైతం ఆయా మండలాల లీడర్లు తమకు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి సమాచారం రావడం లేదని అసంతృప్తి వెల్లగక్కినట్లు తెలిసింది. ఇప్పటికీ ప్రచార కార్యక్రమాల్లో మాజీ ఎంపీలు, సీనియర్ లీడర్లు పూర్తి స్థాయిలో పాల్గొనడం లేదు. ఇప్పుడు పార్టీలోని అంతర్గత విభేదాలు రచ్చకెక్కడంతో ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.