కరీంనగర్, వెలుగు: జిల్లాలో పారిశుద్ధ్య కార్మికుల రక్షణ, భద్రత, గౌరవంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందుకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ప్రశంసిస్తూ యూనిసెఫ్ లేఖ పంపింది. ఈ లేఖను యూనిసెఫ్ రాష్ట్ర వాష్ స్పెషలిస్ట్ వెంకటేశ్ శుక్రవారం కలెక్టర్ కు అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పించడం, ఎక్కడా లేని విధంగా ఆరోగ్య పరీక్ష కార్డులు పంపిణీ చేయడం, నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహించడం, రక్షణ కవచాలు అందజేసి, పని సమయంలో తప్పక వాడుకునేలా చేయడం లాంటి చర్యలు తీసుకున్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందిస్తున్నందుకు జిల్లా కలెక్టర్ కు యూనిసెఫ్ మూడు రాష్ట్రాల చీఫ్ జిలాలెమ్. బి. టఫస్సీ సంతకం చేసిన ప్రశంస పత్రం అందించారు. కార్యక్రమంలో యూనిసెఫ్ రాష్ట్ర కన్సల్టెంట్ ఫణీంద్ర కుమార్, జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి, స్వచ్ఛభారత్ జిల్లా సమన్వయకర్తలు రమేశ్, వేణు ప్రసాద్, క్లస్టర్ ఫెసిలిటేటర్లు కళ్యాణి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల జాబ్ మేళాకు స్పందన
కరీంనగర్, వెలుగు: మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ, యూత్ ఫర్ జాబ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన దివ్యాంగుల జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. 17 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొనగా 348 మంది దివ్యాంగులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 165 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 102 మందిని వివిధ కంపెనీలలో పలు ఉద్యోగాలకు ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జాబ్ మేళాను సందర్శించారు.
ఉద్యోగాల వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, యూత్ ఫర్ జాబ్స్ కోఆర్డినేటర్స్ మధుసూదన్ షాహిద్, జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాస్, ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు, వారధి మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు, సిడిపిఓలు కస్తూరి, సుగుణ, శ్రీమతి, ఎఫ్ఆర్వో రఫీ పాల్గొన్నారు.