- ప్రపంచవ్యాప్తంగా 2010 నుంచి 2022 మధ్య 37 కోట్ల మంది బాధితులు: యునిసెఫ్
యునైటెడ్ నేషన్స్: ప్రపంచవ్యాప్తంగా 2010 నుంచి 2022 మధ్య ప్రతి 8 మంది బాలికల్లో ఒకరు లైంగిక దాడులకు గురయ్యారు. ఆ పుష్కర కాలంలో 18 ఏండ్లలోపు ఉన్న 37 కోట్ల మంది బాలికలపై లైంగిక దాడులు, అత్యాచారాలు జరిగాయని యునిసెఫ్ తెలిపింది. శుక్రవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా యునిసెఫ్ ఒక రిపోర్టును విడుదల చేసింది. బాలలపై లైంగిక హింసకు సంబంధించిన మొట్టమొదటి రిపోర్టు ఇది.
వెలుగులోకి రాని ఘటనలను కూడా కలిపితే లైంగిక దాడులకు గురైన బాధితుల సంఖ్య 65 కోట్లు (ప్రతి 5 మంది బాలికల్లో ఒకరు) ఉండవచ్చని రిపోర్టు తెలిపింది. ‘‘అత్యధిక మంది బాధితులతో సబ్ సహారా ఆఫ్రికా మొట్టమొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 7.9 కోట్ల మంది మహిళలు, బాలికలు లైంగిక దాడులు, అత్యాచారాలు, వేధింపులకు గురయ్యారు. ఇక తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా దేశాల్లో 7.5 కోట్ల మంది, మధ్య, దక్షిణాసియా దేశాల్లో 7.3 కోట్ల మంది, యూరప్, నార్త్ అమెరికాలో 6.8 కోట్ల మంది బాధితులున్నారు.
రాజకీయ సంక్షోభ దేశాలు, శరణార్థి శిబిరాలున్న ప్రాంతాల్లో ఘోరాలు ఎక్కువగా జరుగుతున్నాయి” అని యునిసెఫ్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా బాలురు, పురుషులు కూడా లైంగిక దాడికి గురయ్యారని, ఇలాంటి బాధితులు కనీసం 24 కోట్ల నుంచి 31 కోట్ల మంది ఉండొచ్చని వెల్లడించింది.