దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య 

హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉన్న మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి చెరువులోకి దూకాడు ఓ వ్యక్తి. 2023, మే 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బ్రిడ్జిపై నుంచి వ్యక్తి దూకుతున్న సమయంలో వాహనదారులు కొంత మంది చూసి.. అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికే అతను చెరువులోకి దూకేయటంతో.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చెరువులో దూకిన వ్యక్తి కోసం గత ఈతగాళ్లు, బోట్ల సాయంతో వెతుకుతున్నారు. అతని ఆచూకీ దొరికితేనే.. పూర్తి వివరాలు బయటకు వస్తాయి. కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకటం వెనక కారణాలు ఏమై ఉంటాయనే వివరాల కోసం పోలీసులు విచారణ చేపట్టారు. వ్యక్తిగత కారణాలతో ఈ పని చేశాడా లేక మానసిక స్థితి బాగోలేదా లేక కుటుంబంలో గొడవలా.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. 

నిత్యం ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని అందించే కేబుల్ బ్రిడ్జి.. ఇప్పుడు విషాధ సంఘటనకు కారణం అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఓ మహిళ సైతం ఇలాగే బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల కాలంలో ఇది రెండో ఘటన కావటం కలకలం రేపుతోంది.