సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బుధవారం గుర్తు తెలియని దుండగులు దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేశారు. పట్టణంలోని హనుమాన్ మందిరంలో దుండగులు వినాయక విగ్రహంతో పాటు హనుమాన్ విగ్రహాన్ని రాళ్లతో ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాలను పరిశీలించారు.
దుండగులను 24 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విగ్రహాలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ వీహెచ్పీ, బీజేపీ నాయకులు జిల్లా ఎస్పీ రూపేశ్ కు వినతిపత్రం అందజేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తున్నారు: బీజేపీ జిల్లా అధ్యక్షురాలు
హిందూ దేవాలయాల పైన ఉద్దేశపూర్వకంగానే దాడులు జరుగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. సదాశివపేటలో జరిగిన సంఘటన హిందూ సమాజానికి అవమానకరమైన సంఘటన అని అన్నారు. దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశ్ పాండే, సంగమేశ్వర్, కౌన్సిలర్ మాణిక్ రావ్ తదితరులు పాల్గొన్నారు.