ఈటల కాన్వాయ్ పై రాళ్ల దాడి.. పలివెలలో ఉద్రిక్తత

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడిలో కాన్వాయ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తల పనే అంటూ బీజేపీ ఆరోపించింది. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. 

పోలీసుల తీరు పై ఈటల ఫైర్ అయ్యారు. పోలీసులు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే కాన్వాయ్ పై దాడి జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వ్యక్తుల పై పోలీసులు కేసు నమోదు చేశారు. పలివెలలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈటల కాన్వాయ్ పై దాడి చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. అధికార పార్టీకి చెందిన వారే చేయించారని ఆరోపిస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోనే రాళ్ల దాడి జరిగిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. పల్లానే దగ్గరుండే తమపై దాడి చేయించారని అన్నారు. ఘటన జరిగిన సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.