నర్సింహులపేట, వెలుగు: ఏఎస్ఐని అంటూ ఫోన్ చేసి వ్యక్తి వద్ద రూ. 80 వేలు కొట్టేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన ప్రకారం.. నర్సింహులపేట మండల కేంద్రంలో గుగులోతు రమేశ్ఎస్ బీఐ మినీ బ్యాంక్ నిర్వహిస్తున్నాడు. అతనికి నాలుగురోజుల కిందట ఫోన్ కాల్ వచ్చింది. ఏఎస్ఐని మాట్లాడుతున్నానని.. తన కూతురికి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో ఉందని, ట్రీట్ మెంట్ కు డబ్బులు కావాలని, క్యాష్ ఇస్తానని ఫోన్ పే చేయాలని కోరాడు.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నానని తన వద్ద పని చేసే వ్యక్తితో డబ్బులు కొట్టిస్తానని చెప్పాడు. నిజమేననుకుని రమేశ్ ఈనెల13న రూ. 80వేలు ఫోన్ పే చేశాడు. అతడు కొద్దీ సేపటి తర్వాత అవతలి వ్యక్తి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని తెలుసుకొని వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాకబు చేశాడు. ఇక్కడ అలాంటి పేరు కలిగిన వ్యక్తి లేడని తెలిపారు. చేసేదేమీలేక ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.