సికింద్రాబాద్, వెలుగు: యేడాది వయసున్న ఓ పాపను జేబీఎస్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం ఉదయం వదిలి వెళ్లిపోయాడు. మారెడుపల్లి పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి పాపతో జేబీఎస్‌కు వచ్చాడు. ప్లాట్‌ఫామ్ నంబరు23 వద్ద బస్సు కోసం వేచి ఉన్న ఓ మహిళాప్రయాణీకురాలి వద్దకు వెళ్లి, తాను వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తానని, అప్పటి వరకు తన పాపను చూసుకోవాలని చెప్పి పాపను ఆమెకు అప్పగించి వెళ్లాడు.
గంటన్నర అయినా అతను తిరిగి రాకపోవడంతో సదరు మహిళ జేబీఎస్లో విధులు నిర్వహిస్తున్న మారెడుపల్లి పీఎస్ హెడ్ కానిస్టేబుల్ గంగుల నర్సింహ్మ రెడ్డి వద్దకు వెళ్లి విషయం చెప్పింది. దీంతో అతను ఆ వ్యక్తి కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో పాపను మారెడుపల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాపను యూసఫ్‌గూడలోని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాగా ఉద్దేశ పూర్వకంగా పాపను జేబీఎస్లో వదిలి వెళ్లినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు.