గర్మిళ్లపల్లిలో బంగారం కోసం వృద్ధురాలి మర్డర్‌‌

గర్మిళ్లపల్లిలో బంగారం కోసం వృద్ధురాలి మర్డర్‌‌
  • చేతులు కట్టేసి, గోనెసంచిలో కుక్కి బావిలో పడేసిన దుండగులు

మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు : బంగారు గొలుసుతో పాటు వెండి కడియాల కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలిని హత్య చేశారు. అనంతరం చేతులు కట్టేసి, గోనె సంచిలో కుక్కి ఓ బావిలో పడేశారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లిలో వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గర్మిళ్లపల్లి శివారులోని బోయినినిపల్లికి చెందిన సోరపాక వీరమ్మ (70) ఈ నెల 19న గర్మిళ్లపల్లిలో పెండ్లికి వెళ్తున్నానని తన భర్తకు చెప్పి బయటకు వచ్చింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. ఆదివారం గర్మిళ్లపల్లి – బోయినిపల్లి రోడ్డు వెంట గల పాత వ్యవసాయ బావి నుంచి దుర్వాసన వస్తుండడంతో గ్రామస్తులు చూడగా డెడ్‌‌బాడీ కనిపించింది. 

వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్‌‌బాడీని బయటకు తీసి వీరమ్మగా గుర్తించారు. బుధవారం గర్మిళ్లపల్లికి వెళ్తున్న వీరమ్మపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, కాళ్ల కడియాలు తీసుకొని, చేతులు కట్టేసి గోనెసంచిలో కుక్కి బావిలో పడేసినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం వీరమ్మ డెడ్‌‌బాడీని చిట్యాల హాస్పిటల్‌‌కు తరలించారు.